
లక్కీ గ్రాహక్, డిజీ ధన్ షురూ
న్యూఢిల్లీ: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రధాని మోదీ ‘మన్‌కీ బాత్’సందర్భంగా లక్కీ గ్రాహక్ యోజన, డిజీ ధన్ వ్యాపార్ యోజన పథకాలను ప్రారంభించారు. ‘మొబైల్ బ్యాంకింగ్, ఎలక్ట్రానిక్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు వినియోగదారులు, వ్యాపారుల కోసం ఈ పథకాలు ప్రారంభిస్తున్నాం’అని ఆయన తెలిపారు. క్రిస్మస్ కానుకగా లక్కీ గ్రాహక్ కింద ఈ రోజు డ్రా ద్వారా 15 వేల మంది విజేతలకు వారి ఖాతాల్లో రూ. 1,000 జమ అవుతుందని, వందరోజులు అమలయ్యే ఈ పథకం కింద రోజూ 15 వేల మంది విజేతలకు వెయ్యి అందుతుందని చెప్పారు.
అయితే మొబైల్ బ్యాంకింగ్, ఈ–బ్యాంకింగ్, రూపే కార్డు, యూపీఐ తదితరాలతో రూ. 50 నుంచి రూ. 3,000ల లోపు డిజిటల్ చెల్లింపులు చేస్తేనే ఇది వర్తిస్తుందన్నారు. ప్రతివారం లక్షల విలువైన నగదు బహమతి కూడా ఉంటుందన్నారు. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా కోట్ల రూపాయల అవార్డులిచ్చే మెగా బంపర్ డ్రా ఉంటుందని తెలిపారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే వ్యాపారుల కోసం వంద రోజుల నడిచే డిజీ ధన్‌ను తెచ్చామని, వారికి వేలాది అవార్డులు, పన్ను రాయితీ ఉంటాయని చెప్పారు. దేశంలో 30 కోట్ల రూపే కార్డులుండడంతో 30 కోట్ల మంది ఈ పథకాల కిందికి వచ్చారన్నారు. డిజిటల్ ఉద్యమాన్ని నల్లధనం, అవినీతి నిర్మూలనకు అనుసంధానించాలని కోరారు.