పీఎంకే అధినేత రాందాస్ కొత్త స్వరం
Published Sun, Aug 11 2013 2:01 AM | Last Updated on Fri, Sep 1 2017 9:46 PM
పీఎంకే అధినేత రాందాస్ కొత్త స్వరం అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో తమిళులు అధికంగా నివసించే మండలాలను తమిళనాడులో కలపాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేనున్నట్లు ప్రకటించారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాట పీఎంకే బలోపేతమే లక్ష్యంగా రాందాస్ సాగుతున్నారు. రాజకీయంగా బలమైన వన్నియర్ సామాజిక వర్గాన్ని చేరదీయడం లక్ష్యంగా పావులు కదిపారు. ఈ క్రమంలో ఆయన అనేక కేసుల్లో ఇరుక్కున్నారు. ముఖ్యంగా మరక్కానం అల్లర్ల కేసులు వెంటాడుతున్నాయి. అరెస్టులు, విధ్వంసం వల్ల ప్రభుత్వానికి ఏర్పడిన కోట్లాది రూపాయల నష్టాన్ని పీఎంకే నుంచి ముక్కుపిండి వసూలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో రాందాస్ ఇష్టారాజ్యంగా సంచరించే వీలు లేకుండా నిషేధాజ్ఞలు అమలుచేసే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తూ తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా కేంద్రం ఇటీవల నిర్ణయం ప్రకటించింది. అదే సమయంలో రాందా స్ కొత్త స్వరం అందుకున్నారు.
తమిళనాడులో కలపాలి
తమిళనాడు-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో నివసించే తమిళుల హక్కులు కాపాడడం అనే మరో అజెండాను రాందాస్ సిద్ధం చేసుకున్నారు. తమిళులు ఆంధ్రప్రదేశ్‌లో ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణించబడుతున్నారనే వాదనను ఆయన లేవనెత్తారు. ఈ మేరకు రాందాస్ శనివారం చెన్నైలో ఓ ప్రకటన విడుదల చేశారు. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విభజన జరిగినప్పుడు అధికంగా నష్టపోయింది తమిళనాడు మాత్రమేనని తెలిపారు. మొత్తం 70 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కలిసిపోయిందని పేర్కొన్నారు.
ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా 32 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఎనిమిది మండలాలు (300 గ్రామాలు)గా తెలిపారు. ఇది తమిళ ప్రజలకు ఆ రోజుల్లో జరిగిన పెద్ద ద్రోహంగా అభివర్ణించారు. విద్య, ఉద్యోగం విషయాల్లో స్థానికేతరులుగా పరిగణించడం వల్ల తమిళులు నష్టపోతున్నారని తెలిపారు. అలాగే క్షేత్రస్థాయి మొదలుకుని ఎమ్మె ల్యే, ఎంపీలుగా పోటీచేసే రాజకీయ హక్కును కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో నివసించే తమిళులు తమ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసుకోవాలంటే 700 కిలోమీటర్ల దూరంలోని హైదరాబాద్‌కు వెళ్లాల్సి ఉందని తెలిపారు.
ఈ ఎనిమిది మండలాలను తమిళనాడులో కలిపితే కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉండే ముఖ్యమంత్రికి విన్నవించుకోవచ్చని ఆయన వివరించారు. ఇటువంటి అనేక ప్రయోజనాల దృష్ట్యా చిత్తూరు, పుత్తూరు, సత్యవేడు, తిరుపతి, శ్రీకాళహస్తి మరో మూడు మండలాలను తమిళనాడులో కలపాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సమయంలో తమిళనాడుకు ఏర్పడిన నష్టాన్ని ఈ ఎనిమిది మండలాలను కలపడం ద్వారా భర్తీ చేయవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు తమ పార్టీ కేంద్రంపై ఒత్తిడి తేనున్నట్లు తెలిపారు.
Advertisement