రైల్వే పథకాలకు మంగళం
రాష్ట్రంలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో, అమలుకు నోచుకోకుండా ఉన్న రైల్వే పథకాలకు మంగళం పాడేందుకు కేంద్రం సిద్ధమైనట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. రూ.19,500 కోట్ల విలువగల పథకాల్ని కేంద్ర రైల్వే శాఖ రద్దు చేసిన సమాచారంతో పీఎంకే అధినేత రాందాసు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ ఎంపీలు మంత్రులుగా ఉన్న కాలంలో తీసుకొచ్చిన పథకాలను రద్దు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు.
సాక్షి, చెన్నై: ఏటా రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతూనే వస్తోంది. కొత్త రైల్వే పథకాలను ప్రకటిస్తున్నారే గానీ అందుకు తగ్గ నిధుల్ని మాత్రం రాల్చడం లేదు. దీంతో దక్షిణ తమిళనాడులో అనేక రైల్వే పథకాలు అమలుకు నోచుకోకుండా మూలనపడి ఉన్నాయి. 1990 నుంచి 2009 మధ్య కాలంలో ప్రకటిం చిన అనేక పథకాలు ఆ జాబితాలో ఉన్నాయి. 2002-2007 మధ్య కాలంలో రాష్ట్రానికి కాస్త ఊరటనిచ్చే పథకాలు అమల్లోకి వచ్చాయి. ఇందుకు కారణం రాష్ట్రానికి చెందిన ఎంపీలు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రులుగా పదవులు చేపట్టడమే. తొలుత పీఎంకే ఎంపీ ఏకే మూర్తి కొన్నాళ్లు సహాయ మంత్రిగా, మరో ఎంపీ ఏవి వేలు మరికొన్నాళ్లు మంత్రిగా పనిచేశారు. ఈ కాలంలో కొత్త పథకాలను తీసుకొచ్చారు. తమకు పట్టున్న ఈరోడ్, సేలం, కృష్ణగిరి, ధర్మపురి పరిసరాల్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే విధంగా రైల్వే పథకాలకు చర్యలు చేపట్టారు.
గతంలో పెండింగ్‌లో ఉన్న కొన్ని పథకాలకు నిధుల్ని సమకూర్చారు. కొత్త రైల్వే సేవలకు చర్యలు తీసుకున్నారు. ఇందులో కొన్ని అమల్లోకి వచ్చినా, చాలా వరకు కదల్లేదు. ఈ పరిస్థితుల్లో తమిళనాడులో ప్రకటించి అమలుకు నోచుకోకుండా ఉన్న పథకాలకు, ఏళ్ల తరబడి పెండింగ్‌లో పడి ఉన్న మరికొన్ని ప్రాజెక్టులకు మంగళం పాడే విధంగా కేంద్ర రైల్వే యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందుకు తగ్గ వివరాల్ని పార్లమెంట్ సమావేశాలు దృష్టిలో ఉంచుకుని సిద్ధం చేసిన రైల్వే శాఖ ఆర్థిక నివేదికలో పొందుపరచి ఉన్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. 14 రైళ్లతో పాటుగా రూ.19,500 కోట్లు విలువగల 160 పథకాలకు మంగళం పాడే విధంగా ఆ నివేదిక ఉన్నట్టుగా ఢిల్లీ నుంచి వస్తున్న సంకేతాలతో పీఎంకే అధినేత రాందాసు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఆగ్రహం: తమ ఎంపీలు మంత్రులుగా ఉన్న సమయంలో తమిళనాడుకు అనేక రైల్వే ప్రాజెక్టులు వచ్చాయంటూ తన ప్రకటనలో సోమవారం రాందాసు వివరించారు. కొన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసిన ఘనత తమ వాళ్లకే దక్కుతుందన్నారు. అయితే, తమిళనాడు అభివృద్ధిని అడ్డుకునే విధంగా కేంద్ర రైల్వే శాఖ వ్యవహరిస్తున్నట్టుందని ధ్వజమెత్తారు. కర్ణాటకకు చెందిన కేంద్ర రైల్వే మంత్రి తన బడ్జెట్ ద్వారా తమిళనాడు మీద చిన్నచూపు చూశారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ శాఖలో తమిళనాడుకు చెందిన మంత్రులెవ్వరూ లేని దృష్ట్యా, అన్యాయం తలబెట్టేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. 2002-09 మధ్య కాలంలో తమ ఎంపీలు మంత్రులుగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన పథకాలు సైతం రద్దు చేయడానికి కేంద్రం నిర్ణయించినట్టుగా తన దృష్టికి వచ్చిందని మండి పడ్డారు.
దక్షిణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలను కలుపుతూ సత్యమంగళం మీదుగా బెంగళూరుకు 260 కి.మీ మేరకు రూ.13 వేల కోట్లతో చేపట్టదలచిన రైల్వే పథకాన్ని పర్యావరణ అనుమతి సాకుతో రద్దు చేసినట్లుగా సమాచారం వచ్చిందన్నారు. అలాగే, మరెన్నో పథకాలను స్థల సేకరణ పేరిట, వంతెనల నిర్మాణాల్ని అడ్డుకునే విధంగా లెవల్ క్రాసింగ్‌లను మూసివేస్తూ, కొన్ని ట్రాక్‌ల విస్తరణ, మరికొన్ని చోట్ల స్టేషన్ల అభివృద్ధి, డబుల్ ట్రాక్ పనులను రద్దు చేస్తూ నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోందని వివరించారు. కేంద్ర రైల్వే శాఖ చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, తమిళనాడుకు అన్యాయం తలబెట్టితే సహించబోమని హెచ్చరించారు.