హొసూరు రూరల్, న్యూస్‌లైన్: సరైన రక్షణ ఏర్పాట్లు లేకుండా భూగర్భ డ్రెయినేజీని శుభ్రం చేసేందుకు వెళ్లిన ముగ్గురు ప్రైవేటు సంస్థ కార్మికుల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. విషవాయువు పీల్చడం వల్లే ఈ ఘటన జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ధర్మపురి మున్సిపాలిటీలో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు పట్టణంలోని 90 శాతానికిపైగా ఇళ్లు, దుకాణాల నుంచి వెలువడే మురుగునీటిని ప్రధాన మురుగుకాల్వలకు అనుసంధానం చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
బస్టాండు వద్ద పెట్రోలు బంక్ సమీపంలో భూగర్భ డ్రెయినేజీలో చెత్త అడ్డుపడడంతో దానిని తొలగించే పనులను అధికారులు టెండర్ ద్వారా ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పట్టణానికి చెందిన రాజు, మాదేశ్ అనే కార్మికులు మ్యాన్‌హోల్‌లోకి దిగారు. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో లక్ష్మణన్ (28)అనే కార్మికుడు సైతం లోపలకు దిగాడు. అతను కూడా ఎంతసేపటికీ పైకి రాకపోవడంతో పనులు పర్యవేక్షిస్తున్న ప్రైవేటు సంస్థ అధికారులు టార్చిలైట్ వేసి పరిశీలించారు. అందులో ఏమీ కనిపించకపోవడంతో ఏదైనా జరిగి ఉంటుందని భావించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
వారు ఘటనా స్థలానికి చేరుకొని మ్యాన్‌హోల్‌లోకి దిగి గాలింపు చేపట్టగా ముగ్గురూ చనిపోయారని నిర్ధారించి మృతదేహాలను వెలికి తీశారు. మృతుల్లో లక్ష్మణన్ తప్ప మిగిలిన ఇద్దరూ వివాహితులు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించగా అక్కడకు చేరుకున్న బంధువుల రోదనలతో ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రి మిన్నంటింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ నేతృత్వంలో గట్టి పోలీస్‌బందోబస్తు ఏర్పాటుచేశారు.
నిర్లక్ష్యమే కారణం
సరైన రక్షణా కవచాలు ఇవ్వకుండా కార్మికులను మ్యాన్‌హోల్‌లోకి దింపడం వల్లే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అండర్ డ్రెయినేజీల్లో మరమ్మతు పనులను మనుషులతో చేపట్టరాదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. యంత్రాలను మాత్రమే వినియోగించాలని స్పష్టమైన ఆదేశాలున్నా నిబంధనలకు విరుద్ధంగా కార్మికులను మ్యాన్‌హోల్‌లోకి దింపారు.
దీనికితోడు ఆ సమయంలో ఒక్క ప్రభుత్వ అధికారి కూడా లేకపోవడం, ప్రైవేట్ సంస్థ అధికారుల అజమాయిషీలో పనులు జరగడం ముగ్గురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని స్థానికులు పేర్కొంటున్నారు. చెత్త తొలగింపునకు యంత్రాన్ని అదజేసినట్టు మున్సిపల్ కార్యాలయ అధికారులు పేర్కొంటున్నా వాటిని ఉపయోగించిన దాఖలాలు లేవు. డ్రెయినేజీలో వ్యక్తులు దిగిన చాలాసేపటి తర్వాత గానీ పైనున్న వ్యక్తులు గమనించలేదని, అగ్నిమాపక శాఖకు ఆలస్యంగా తెలియజేశారని అక్కడున్న పెట్రోల్ బంక్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
ఘటనా స్థలాన్ని సందర్శించిన మంత్రి
ధర్మపురి ఘటన విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పళణియప్ప శనివారం ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆస్పత్రికి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. బాధితుల కుటుంబాలకు న్యాయం చేస్తామని ఓదార్చారు.
విషవాయువు పీల్చి ముగ్గురి మృతి
Published Sun, Aug 25 2013 3:42 AM | Last Updated on Tue, Sep 18 2018 7:34 PM
Advertisement
Advertisement