చోరీ చేసి.. గొయ్యిలో దాచి
పోలీసుల సోదాల్లో రూ. 3 లక్షలు వెలికితీత
దొంగ అరెస్టు, రిమాండ్‌కు తరలింపు
ఆదిలాబాద్ క్రైం : చోరీ చేసిన సొమ్మును గొయ్యిలో దాచి పెట్టాడో దొంగ. ఎవరికంట పడొద్దని గొయ్యిలో దాచినప్పటికీ పోలీసులు అనుమానంతో సోదాల్లో ఇల్లును జల్లెడ పట్టారు. దీంతొ గొయ్యి జాడ వెలుగులోకి వచ్చింది. గొయ్యిలో రూ. 3 లక్షలు బయటపడ్డాయి. మంగళవారం సదరు దొంగను అరెస్టు చేసిన వివరాలు ఆదిలాబాద్ డీఎస్పీ లక్ష్మీనారాయణ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈనెల 19 తేదీ రాత్రి మోచిగల్లిలోని కార్తీక ఫెస్టిసైడ్స్‌లో దొంగతనం జరిగింది. షాపులోనిపై రేకులు తొలగించి దొంగతనానికి పాల్పడి రూ. 3.86 లక్షల నగదు, నాలుగు సెల్‌ఫోన్‌లు, 5 గ్రాముల గోల్డ్‌రింగ్‌ను ఎత్తుకెళ్లారు. అయితే ఈ చోరీలో పాతనేరస్తుడైన పట్టణంలోని ఖానాపూర్ కాలనీకి చెందిన అశ్విన్‌కుమార్‌పై అనుమానాలు రావడంతో వన్‌టౌన్, సీసీఎస్ పోలీసులు నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలో మంగళవారం సీఐ సత్యనారాయణ, సీసీఎస్ డీఎస్పీ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో అశ్విన్‌కుమార్ ఇంట్లో సోదాలు చేశారు.
ఇళ్లంతా గాలించిన పోలీసులు ఓగదిలో అనుమానం రావడంతో తవ్విచూడగా అందులో ఉన్న నగదు బయటపడింది. దీంతో అశ్విన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చోరీచేసిన సొత్తులో రూ. 73 వేలు నిందితుడు ఖర్చు చేసుకోగా, ఒక సెల్‌ఫోన్‌ను పడేశాడు. మిగతా సొమ్ము రూ. 3.13 వేల నగదు, మూడు సెల్‌ఫోన్‌లు, బంగారు ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీసీఎస్ డీఎస్పీ నర్సింహారెడ్డి, వన్‌టౌన్ సత్యనారాయణ, సీసీఎస్ ఎస్సైలు రాజు, సత్యనారాయణ, వన్‌టౌన్ ఏఎస్సై అప్పారావు, పోలీసు సిబ్బంది రాహత్, రాంరెడ్డి, సీసీఎస్ హెచ్‌సీ ఎండి సిరాజ్‌ఖాన్, రమేశ్, గంగాధర్, అబ్దుల్ జాహీర్, తదితరులు ఉన్నారు.