రాజకీయ రథసారథులెవరో..!
Published Sat, Oct 15 2016 12:59 PM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM
పార్టీ పగ్గాలపై నేతల ఆసక్తి
అధ్యక్ష పదవుల కోసం అధిష్టానం వేట
త్వరలోనే నియామకాలు
సాక్షి, సిరిసిల్ల : కొత్తజిల్లా ఏర్పాటైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు నూతన సారథుల కోసం రాజకీయ పార్టీలు వేట మొదలెట్టాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజించాక రాజకీయ పార్టీలకు కూడా కొత్త అధ్యక్షుల నియూమకం అనివార్యమైంది. అధికార టీఆర్‌ఎస్‌తోపాటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు సైతం నూతన అధ్యక్షుడి నియూమకం కోసం కసరత్తు చేస్తున్నారుు. ఈవిషయంలో సీపీఎం ఒకడుగు ముందుకేసి ఇప్పటికే నూతన జిల్లా కార్యదర్శులను ప్రకటించింది.
అధికార పార్టీలో అధికపోటీ..
అధికార టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్ష స్థానానికి పోటీ అధికంగానే ఉంది. అరుుతే, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆశిస్సులు ఎవరికి ఉంటే వారే అధ్యక్షుడు కానున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న సమయంలోనూ ఈ ప్రాంతం నుంచి జిల్లాస్థాయి నాయకులెవరూ అంతగా లేరు. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల అధ్యక్ష పదవికి గూడూరి ప్రవీణ్, గడ్డం నర్సయ్య, చిక్కాల రామారావు, చీటి నర్సింగరావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వేములవాడ దేవస్థానం పాలకవర్గం మినహా, పెద్దగా నామినేటెడ్ పదవులు కూడా లేకపోవడంతో సహజంగానే నాయకులు జిల్లా అధ్యక్ష పదవిపై దృష్టిసారించారు. బీసీ సామాజిక వర్గానికి కట్టబెట్టేట్లయితే అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, ఏఎంసీ మాజీ చైర్మన్ గడ్డం నర్సయ్యకు జిల్లా పగ్గాలు దక్కే అవకాశం ఉంది. నియోజకవర్గానికి కేటీఆర్ వచ్చిన నాటి నుంచి వెన్నంటి ఉన్న గూడూరి ప్రవీణ్ కాస్త ముందు వరుసలో ఉన్నారు. ఇక సెస్ మాజీ చైర్మన్ చిక్కాల రామారావు, కేటీఆర్ సమీప బంధువు చీటి నర్సింగరావు పేర్లు పరిశీలించాలంటూ పలువురు ప్రతిపాదిస్తున్నారు. కానీ జిల్లాలో ప్రస్తుతం ఉన్న సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో అదే సామాజిక వర్గానికి పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఇస్తారా..? అనేది అనుమానమే.
కాంగ్రెస్‌లో..
ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష రేసులో పలువురి పేర్లు ప్రముఖంగా ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కటకం మృత్యుం జయం, ప్రస్తుత రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపే ట వాస్తవ్యుడు. ఒకవేళ మృత్యుంజయం రాజన్న సిరిసిల్లపై ఆసక్తి కనబరిస్తే ఆయనే డీసీసీ అధ్యక్షుడిగా కొనసా గే అవకాశం ఉంది. కానీ ఆయన కరీంనగర్ మాజీ ఎమ్మె ల్యే కూడా కావడంతో కరీంనగర్ వైపు మొగ్గు చూపితే జిల్లాకు కొత్త అధ్యక్షుడు రాక తప్పదు. పార్టీ రాష్ట్ర నాయకులు కేకే మహేందర్‌రెడ్డి, ఉమేశ్‌రావు, ఏఎంసీ మాజీ చైర్మన్ ఏనుగు మనోహర్‌రెడ్డి, బీసీకి కేటారుుస్తే సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ పేర్లు డీసీసీ అధ్యక్ష రేసులో ప్రధానంగా వినిపిస్తున్నాయి.
బీజేపీలో..
జిల్లాలో పట్టున్న బీజేపీ అధ్యక్ష స్థానానికి కాస్త పోటీ ఎక్కువగానే ఉంది. గతంలో సిరిసిల్ల మున్సిపాల్టీని కైవసం చేసుకొన్న బీజేపీ.. వేములవాడ నగరపంచాయతీ పీఠంపై తొలిజెండా ఎగురవేసింది. దీంతో సహజంగానే ఆ పార్టీ అధ్యక్ష పీఠంపై ఆసక్తి నెలకొంది. వేములవాడ నగరపంచాయతీ వైస్ చైర్మన్, పార్టీ సీనియర్ నాయకుడు ప్రతాప రామకృష్ణ, వేములవాడ దేవస్థానం మాజీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్, సిరిసిల్ల మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్, మాజీ జెడ్పీటీసీ మట్ట వెంకటేశ్వర్‌రెడ్డి రేసులో ఉన్నారు. ప్రతాప రామకృష్ణ ఉమ్మడి కరీంనగర్‌కు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆది శ్రీనివాస్ రెండుసార్లు వేములవాడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.
టీడీపీలో..
జిల్లాలో ఉనికికోల్పోయిన టీడీపీకి ఇక్కడ పెద్దగా పోటీ కనిపించడం లేదు. ఉమ్మడి కరీంనగర్‌కు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న అన్నమనేని నర్సింగరావు జిల్లాలోని ముస్తాబాద్ మండల వాస్తవ్యుడు. ఆయన ఆశిస్తే జిల్లా అధ్యక్ష పదవి ఆయనను వరించే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే సీపీఎం జిల్లా కార్యదర్శిగా పంతం రవికి ఆ పార్టీ పగ్గాలు అప్పగించారు. సీపీఐ కూడా తమ కార్యదర్శిని ప్రకటించనుంది. మొత్తానికి కొత్త జిల్లా రాజన్న సిరిసిల్లకు అన్ని రాజకీయ పార్టీలు తొలి అధ్యక్షులను నియమించేందుకు కసరత్తు చేస్తున్నాయి. కొద్ది రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
Advertisement
Advertisement