న్యూఢిల్లీ: దేశరాజధానిలో తక్కువ విద్యుత్ వినియోగించే వారికి కరెంట్ షాక్ తగలనుంది. నిర్ణీత చార్జీల బిల్లులను పెంచాలన్న విద్యుత్ పంపిణీ కంపెనీ(డిస్కమ్)ల డిమాండ్‌ను రెగ్యులేటరీ అంగీకరించినట్లయితే కొద్దిరోజుల్లోనే చార్జీలు ఒక్కసారిగా పెరిగిపోయే ప్రమాదముంది. అతి తక్కువ విద్యుత్ అనగా రెండు కిలోవాట్ల విద్యుత్‌ను ఉపయోగిస్తున్న వినియోగదారుల కేటగిరీని పూర్తిగారద్దుచేసి... ఐదు కిలోవాట్ల విద్యుత్‌ను ఉపయోగిస్తున్న కేటగిరీలోకి మార్చాలని డిస్కంలు కోరుతున్నాయి. ప్రస్తుతం ఆ రెండు కిలోవాట్ల కనెక్షన్లకు నిర్ణీత బిల్లుగా 40 రూపాయలు, ఐదు కిలోవాట్ల కనెక్షన్లకు నిర్ణీత బిల్లుగా 100 రూపాయలు వసూలు చేస్తున్నాయి.
రెండు కిలోవాట్ల కేటగిరీని రద్దు చేసి, ఐదు కిలోవాట్ల పరిధిలోకి మార్చడం వల్ల టీవీ, కూలర్, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు వంటి సౌకర్యాలు లేని కుటుంబాలు బిల్లు కింద కనీసం రూ. 100 రూపాయల బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. రోజుకూలీపై ఆధారపడి జీవనం సాగించే కుటుంబాలకు ఈ చెల్లింపు భారంగా పరిణమిస్తుంది. డిస్కంల డిమాండ్‌ను ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (డీఈఆర్సీ) అంగీకరించినట్లయితే రెండు కిలోవాట్ల విద్యుత్‌ను మాత్రమే ఉపయోగిస్తున్న కుటుంబాలు చెల్లించే బిల్లులు ఒకేసారి 150 శాతం పెరుగుతాయి. డిస్కమ్‌ల ఒత్తిడి మేరకు డీఈఆర్సీ పవర్ టారిఫ్‌ను పునఃసమీక్షిస్తోందని రెగ్యులేటర్ అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈసమస్యపై ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన తరువాత జూన్ ఆఖరుకల్లా డీఈఆర్సీ నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.
దేశరాజధాని ప్రజల వార్షికాదాయం బాగానే ఉందని, రెండు కిలోవాట్ల విద్యుత్‌ను మాత్రమే వాడుతున్నవారి సంఖ్య అతి స్వల్పమని డిస్కమ్‌లు చెబుతున్నాయి. ప్రస్తుతం మురికివాడల్లో నివసిస్తున్నవారికి సైతం టీవీ, కూలర్, ఫ్యాన్లు, లైట్లు ఉంటున్నాయని, అలాంటి వారిని ఇంకారెండు కిలోవాట్ల పరిధిలోనే ఉంచడం నష్టమేనన్నది డిస్కమ్‌ల వాదన. అంతేకాదు.. రెండు కిలోవాట్ల నిర్ణీత రేట్ల పరిధిలో ఉన్న ఢిల్లీ వాసులు, దానికంటే మూడు రెట్లు ఎక్కువ విద్యుత్‌నే వినియోగిస్తున్నారని కూడా డిస్కమ్ కంపెనీ అధికారి ఒకరు చెబుతున్నారు. డిస్కమ్‌ల డిమాండ్ ప్రకారం రెండు కిలోవాట్ల పరిధిని రద్దు చేస్తే ఐదు కిలోవాట్ల పరిధిలోకి 60 శాతం మంది వినియోగదారులు వస్తారు. ఇదిలా ఉంటే వినియోగదారుల అభిప్రాయాలను సేకరించిన తరువాతే పవర్ డిస్కమ్‌ల డిమాండ్‌పై నిర్ణయం తీసుకుంటామని డీఈఆర్సీ అధికారులు చెబుతున్నారు.
పేదలకు కరెంట్ షాక్
Published Mon, May 5 2014 11:04 PM | Last Updated on Sat, Sep 2 2017 6:58 AM
Advertisement
Advertisement