విద్యుత్‌పై ‘బాబు’ శ్వేతపత్రం బూటకం | Power 'Babu' paper cited | Sakshi
Sakshi News home page

విద్యుత్‌పై ‘బాబు’ శ్వేతపత్రం బూటకం

Published Fri, Jul 4 2014 3:43 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

Power 'Babu' paper cited

  • మీ తొమ్మిదేళ్ల పాలనలో ఘోరాలనూ చేర్చి ఉంటే బాగుండేది..
  •  ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై పోరుబాట సాగిస్తాం..
  •  వైఎస్సార్‌సీపీ కన్వీనర్ శంకరనారాయణ, ఎమ్మెల్యే విశ్వ, మాజీ ఎంపీ అనంత, నాయకుడు ఎర్రిస్వామిరెడ్డి ధ్వజం
  • అనంతపురం జిల్లా పరిషత్తు: రాష్ర్టంలో విద్యుత్ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విడుదల చేసిన శ్వేతపత్రం ఒట్టి బూటకమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. గురువారం సాయంత్రం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ, ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, నాయకుడు బీ.ఎర్రిస్వామిరెడ్డి మాట్లాడారు.

    ఈ శ్వేతపత్రంలో గతంలో ఆయన హయాంలో చోటుచేసుకున్న అనేక అంశాలను పొందుపరిచి ఉంటే స్వాగతించే వారమన్నారు. కరెంటు అడిగిన పాపానికి బషీర్‌బాగ్‌లో పోలీసుల చేత అత్యంత పాశవికంగా కాల్పులు జరిపించి రైతులను పొట్టన పెట్టుకున్న  ఘటనను, కరెంటు బిల్లులు కట్టలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న రైతుల నుంచి బలవంతంగా సొమ్ము వసూలు చేసిన విషయాన్ని, కట్టకుంటే బోరుబావుల దగ్గరకు పోలీసులను ఉసిగొల్పి మోటార్లను తొలగించి వాటిని పోలీస్ స్టేషన్లలో పెట్టుకున్న సందర్భాలున్నాయన్నారు.

    అలాగే కేసులు నమోదు చేసి రైతులను జైలుపాలు చేయడం, ప్రతి ఏటా కరెంటు చార్జీల పెంచి ప్రజల నడ్డి విరిచిన చేదు ఘటనల్ని కూడా పొందుపరిచి ఉంటే సముచితంగా ఉండేదని వ్యాఖ్యానించారు. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో ప్రతి యూనిట్‌ను కొలిచి నిర్ధాక్షిణ్యంగా ప్రజల నుంచి బిల్లులు వసూలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని నేతలు ధ్వజమెత్తారు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత ఉచిత కరెంటు ఇస్తానంటే... బట్టలు ఆరేసుకునేందుకు కరెంటు తీగలు పనికొస్తాయంటూ అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు హేళన చేయడాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు.

    ఈ విషయాలన్నీ పక్కన పెట్టి శ్వేతపత్రం విడుదల చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికలకు ముందు పరిశ్రమలు, గృహ అవసరాలకు 24 గంటల కరెంటు, రైతులకు తొలుత 7 గంటలు, తర్వాత కొద్ది నెలలకే నిరంతరంగా 9 గంటల ఉచిత విద్యుత్ అందజేస్తామని గొప్పగా హామీలు ఇచ్చారని, వాటి నుంచి తప్పుకునేందుకే శ్వేతపత్రం విడుదల చేశారని వారు దుమ్మెత్తి పోశారు.

    ఇక పరిస్థితులు బాగోలేవంటూ విద్యుత్ చార్జీలు పెంచక తప్పదనే సంకేతాన్ని పంపేందుకు, ప్రపంచ బ్యాంకును సంతృప్తి పరచడానికి ఇలాంటి కుటిల యత్నాలు, ఎత్తుగడలకు తెర లేపారని మండిపడ్డారు. మరోవైపు ఖరీఫ్‌లో రైతులకు పంట రుణాలు ఇవ్వకుండా, రుణమాఫీ చేయకుండా కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.
     
    ప్రభుత్వంపై పోరాటానికి పార్టీ అధిష్టానం పిలుపు మేరకు రైతులు, అన్ని వర్గాల ప్రజలతో కలిసి పోరుబాట సాగిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ నగర కమిటీ అధ్యక్షుడు రంగంపేట గోపాలరెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బోరంపల్లి ఆంజనేయులు, కార్యాలయ కార్యదర్శి సాకే ఆదినారాయణ పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement