న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎన్నికల హామీ మేరకు ఢిల్లీలో విద్యుత్ చార్జీలను 50 శాతం తగ్గిస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. నెలకు 400 యూనిట్ల వరకు వినియోగదారులందరికీ ఇది వర్తిస్తుంది. దీంతో 90 శాతం ఢిల్లీ వాసులకు ప్రయోజనం చేకూరనుంది. కేజ్రీవాల్ నేతృత్వంలోని కేబినెట్ బుధవారం సమావేశమై ఈ మేరకు నిర్ణయించింది.
మార్చి 1 నుంచి ఇది అమలుకానుంది. అలాగే ప్రతి ఇంటికీ నెలకు 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా సరఫరా చేస్తామని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా వెల్లడించారు. అంతకన్నా ఎక్కువ వాడితే మాత్రం బిల్లు కట్టాల్సి ఉంటుందన్నారు. ఈ రెండు నిర్ణయాల వల్ల రాష్ర్ట ప్రభుత్వంపై ఏటా రూ.1, 670 కోట్ల భారం పడనుంది. ఉచిత నీటి సరఫరా వల్ల 18 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఇక విద్యుత్ డిస్కంల ఖాతాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)తో ఆడిట్ చేయించిన తర్వాత విద్యుత్ రేట్లను సమీక్షిస్తామని సిసోడియా చెప్పారు. మరోవైపు ఇదే అంశంపై సీఎం కేజ్రీవాల్ బుధవారమే కాగ్ శశికాంత్ శర్మను కలిశారు.