- పారిశుద్ధ్య పనుల విషయంలో అలసత్వం వద్దు
- జిల్లా కలెక్టర్ ఎస్.సుజాతశర్మ
- మద్దిపాడు మండలంలో పారిశుద్ధ్య పనులు పరిశీలన
- కాలనీల్లో పేరుకున్న చెత్త చూసి అసహనం
- సస్పెండ్ చేస్తానంటూ గ్రామ కార్యదర్శికి వార్నింగ్
- రాజకీయూలు చేస్తే చెక్‌పవర్ రద్దు చేస్తానని సర్పంచ్‌కి హెచ్చరిక
- తాగునీరు కలుషితం అవుతోందని స్థానికుల ఫిర్యాదు
- గుండ్లకమ్మ వద్ద సీపీడబ్ల్యు స్కీమ్‌లో తాగునీటి పరిశీలన
మద్దిపాడు (సంతనూతలపాడు) : గ్రామంలో ఇంత చెత్త పేరుకుపోతే ఏమీ పట్టనట్టు తిరుగుతారా..? పారిశుద్ధ్యంపై అలసత్వం వహిస్తే సస్పెండ్ చేస్తా.. నంటూ జిల్లా కలెక్టర్ సుజాతశర్మ మద్దిపాడు మండలం రాచవారిపాలెం గ్రామ కార్యదర్శికి వార్నింగ్ ఇచ్చారు. గ్రామ సర్పంచ్‌ని సైతం చెక్ పవర్ రద్దు చేస్తాన ని హెచ్చరించారు.
పారిశుద్ధ్యం విషయంలో రాజకీయాలొద్దని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోనని మందలించారు. ఎవరి ఇంటి ముందు వారు శుభ్రం చేసుకోలేరా.. వీధుల్లో చెత్తవేస్తా ఎలాగ అంటూ కాలనీ వాసులపై అసహనం వ్యక్తం చేశారు. శనివారం మద్దిపాడు మండలంలో పర్యటించిన కలెక్టర్ పలు గ్రామాల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణ, తాగునీటి సరఫరా వంటి మౌలిక వసతులను పరిశీలించారు.
పారిశుద్ధ్య నిర్వహణపై అసంతృప్తి..
రాచవారిపాలేనికి మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చిన కలెక్టర్ అధికారులను పరుగులు తీయించారు. గ్రామంలోని పారిశుద్ధ్య నిర్వహణపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేయాలని గ్రామ కార్యదర్శి జాన్‌బాషాను ఆదేశించారు. అలసత్యం వహిస్తే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు.
గ్రామంలో ఇలా చెత్త పేరుకుపోతుంటే మీరేమి చేస్తున్నారంటూ సర్పంచ్ పిట్టల ఆంజనేయులును నిలదీశారు. ఇలాగైతే చెక్‌పవర్ తీసేస్తానని హెచ్చరించారు. స్పందించిన సర్పంచ్ మాట్లాడుతూ తాను సర్పంచ్‌నని కూడా గుర్తించకుండా కార్యదర్శి ఇస్టానుసారం వ్యవహరిస్తున్నాడని, ఒక పార్టీ వారికే పనులు చేస్తానని చెబుతున్నాడని ఆరోపించారు.
పారిశుద్ధ్య పనుల విషయంలో రాజకీయూలొద్దని కలెక్టర్ హితవు పలికారు. అనంతరం ఎస్సీ కాలనీలో పర్యటించిన ఆమె కాలనీలలో చెత్త నయిదిబ్బలు వేసి ఉంటే ఎలాగని కాలనీ వాసులను ప్రశ్నించారు. ఎవరి ఇంటి ముందు వారు, ఎవరివీధి వారు శుభ్రం చేసుకోలేరా..? అని ప్రశ్నించారు. కార్యదర్శి విషయం పక్కనబెట్టి పారిశుధ్య పనులు దగ్గర ఉండి చేయించాలని సర్పంచ్‌కు సూచించారు. పనులు పర్యవేక్షించాలని డీపీఓ ప్రసాద్‌ను ఆదేశించారు.
గ్రామ కంఠంలోని స్థలాన్ని వైద్య ఆరోగ్యశాఖ సబ్‌సెంటర్‌కు ఇవ్వటానికి తీర్మానం చేయనీయకుండా గ్రామ కార్యదర్శి, మరికొందరు కలిసి ఇబ్బంది పెడుతున్నారని సర్పంచ్ ఆరోపించారు. గ్రామానికి సీపీడబ్ల్యు స్కీమ్ ద్వారా నీరు వస్తున్నా దానిలో గుండ్లకమ్మ నదిలోని నీరు కలుపుతుండటంతో నీరు వాసన వేస్తుందని, గాజులపాలెం వద్ద ఏర్పాటు చేసిన రొయ్యల ఫ్యాక్టరీలో వ్యర్ధపు నీరు శుద్ధి చేయకుండా గుండ్లమ్మ నదిలోకి వదలడంతో జబ్బులు వస్తున్నాయని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తేవడంతో తిరుగు ప్రయాణంలో ఆ గ్రామానికి ఏర్పాటు చేసిన సంప్ వద్ద నీరు లీక్ అవుతుండటాన్ని పరిశీలించారు.
తాగునీటి సరఫరా పరిశీలన..
గాజులపాలెం, కీర్తిపాడు గ్రామస్తులు తమ గ్రామంలో రోడ్లులేవని, ఆదేవిధంగా రొయ్యల ఫ్యాక్టరీవారు గుండ్లకమ్మ నదిలోని నీటిని కలుషితం చేస్తున్నారని ఆరోపించారు. దీంతో కలెక్టర్ ఫ్యాక్టరీ వెనుక భాగంలో ఫ్యాక్టరీ నుంచి వదులుతున్న నీటిని పరిశీలించారు. ప్యాక్టరీ నుంచి వస్తున్న దుర్వాసనకు ముక్కు మూసుకున్నారు. వెంటనే పొల్యూషన్ కంట్రోల్ వారితో వచ్చి పూర్తి స్థాయిలో పరిశీలన చేయూల్సిందిగా ఆమె ఆర్డీవో కమ్మ శ్రీనివాసరావును ఆదేశించారు. ప్రతి చోటా తాగునీటిపై ఫిర్యాదులు వస్తుండటంతో ఆమె గుండ్లకమ్మ రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన సీపీడబ్ల్యు స్కీమ్ వద్దకు వె ళ్లి అక్కడి పరిస్థితులను గమనించారు. క్లోరోమీటర్ ద్వారా నీటిలో క్లోరినేషన్ చేశారా లేదా అని పరిశీలించారు.
గుండ్లకమ్మ సీపీడబ్ల్యు స్కీమ్ ద్వారా 76 గ్రామాలకు నీరు సరఫరా అవుతోందని ఏఈ రవికుమార్ కలెక్టర్‌కు తెలిపారు. స్కీమ్ నుంచి చివరి ట్యాప్ వరకూ ఎంత పీపీఎం నమోదైనది తనకు ఆదివారం సాయంత్రానికల్లా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నీటి నమూనాలు తీసుకోవాల్సిందిగా డీఎంహెచ్‌ఓ జాస్మిన్‌ను ఆదేశించారు. సీపీడబ్ల్యు స్కీమ్ వద్ద క్లొరినేషన్ పెంచాల్సి ఉంటుందని కలెక్టర్ అభిప్రాయం వ్యక్తం చేయగా అసలు క్లోరినేన్ చేస్తేనే కదా అంటూ స్థానికులు చర్చించుకోవడం కనిపిం చింది. కార్యక్రమంలో తహశీల్దార్, ఎంపీడీవో, ఇతర మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.