sujatha sharma
-
ఎన్నికల నియమావళి పాటించాలి: కలెక్టర్ సుజాతశర్మ ఆదేశం
ఒంగోలు టౌన్: శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటించాలని కలెక్టర్ సుజాతశర్మ స్పష్టం చేశారు. ఎవరైనా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. శాసనమండలి ఎన్నికల నిర్వహణపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో స్టాండింగ్ కమిటీ సమావేశం ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కలెక్టరేట్లో ఎన్నికల ఫిర్యాదుల విభాగం (టోల్ ఫ్రీ నంబర్ 1077) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండల స్థాయిలో ఎంసీసీ బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వార్తా పత్రికలు, టీవీ చానళ్లలో వచ్చే ప్రసారాలను సంబంధిత కమిటీ పరిశీలిస్తోందన్నారు. ఓటర్లకు బల్క్ ఎస్ఎంఎస్లు పంపినా ఎన్నికల ఉల్లంఘన కిందకు వస్తోందన్నారు. మార్చి 9వ తేదీ ఉదయం 8 గంటలకు ఎన్నికలు ప్రారంభమవుతాయని, దానికి 48 గంటల ముందు నుంచే మద్యం విక్రయాలు చేయరాదని పేర్కొన్నారు. గిద్దలూరులో చెక్కులు పంపిణీ చేశారని ఫిర్యాదు...: గిద్దలూరులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేసి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని వైఎస్ఆర్ సీపీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు డీఎస్ క్రాంతికుమార్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మంత్రులు, అధికారపార్టీ శాసనసభ్యులు అధికారులను వెంటపెట్టుకుని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని చెప్పారు. తమ మాట వినకపోతే బదిలీ చేస్తామంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు. ఒంగోలులోని గుంటూరురోడ్డులో గల ఫంక్షన్ హాలులో మంత్రులు అధికారులను పిలిపించుకున్నారన్నారు. కలెక్టర్ స్పందిస్తూ మంత్రుల వెంట నిఘా బృందాలు వీడియోగ్రఫీ చేస్తున్నాయని, నిర్దిష్టమైన వివరాలతో ఫిర్యాదుచేస్తే తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మంత్రి నారాయణ సమీక్ష నిజం కాదా?: ఎన్నికల నిర్వహణపై నిర్వహించిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో టీడీపీ కార్యాలయ ఇన్చార్జి దాసరి వెంకటేశ్వర్లు వ్యాఖ్యలపై సీపీఎం నేత జీవీ కొండారెడ్డి ఘాటుగా సమాధానమిచ్చారు. అధికారపార్టీపై లేనిపోని ఆరోపణలు చేయవద్దని దాసరి వెంకటేశ్వర్లు అనడంపై కొండారెడ్డి స్పందిస్తూ మంత్రి నారాయణ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లడం, అక్కడి అధికారులతో సమావేశాలు నిర్వహించడం నిజం కాదా..? అని నిలదీశారు. జేసీ హరిజవహర్‌లాల్ జోక్యం చేసుకుంటూ మంత్రి నారాయణ అధికారులతో సమీక్షపై విచారిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఏ దేవదానం, డీఆర్ఓ ప్రభాకరరెడ్డి, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నాగేంద్రయాదవ్, బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి డొక్కా యర్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఓటర్లపై కొండపి ఎమ్మెల్యే వత్తిడి తెస్తున్నారు...: కొండపి నియోజకవర్గ పరిధిలోని కొంతమంది ఉపాధ్యాయుల ఇళ్లకు వెళ్లి తమ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయాలంటూ అక్కడి ఎమ్మెల్యే ఒత్తిడి తెస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. చీరాలలోని భారతి కాలేజీ స్టాఫ్ మీటింగ్ పెట్టుకుని ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని తెలిపారు. బా«ధ్యులకు డబ్బు చేరిన తర్వాత చెక్‌పోస్టులను అలర్ట్ చేశారన్నారు. కలెక్టర్ స్పందిస్తూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరిగినట్లు కచ్చితమైన ఆధారాలు ఇస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
చెత్త కనిపిస్తే సస్పెండ్ చేస్తా..!
పారిశుద్ధ్య పనుల విషయంలో అలసత్వం వద్దు జిల్లా కలెక్టర్ ఎస్.సుజాతశర్మ మద్దిపాడు మండలంలో పారిశుద్ధ్య పనులు పరిశీలన కాలనీల్లో పేరుకున్న చెత్త చూసి అసహనం సస్పెండ్ చేస్తానంటూ గ్రామ కార్యదర్శికి వార్నింగ్ రాజకీయూలు చేస్తే చెక్‌పవర్ రద్దు చేస్తానని సర్పంచ్‌కి హెచ్చరిక తాగునీరు కలుషితం అవుతోందని స్థానికుల ఫిర్యాదు గుండ్లకమ్మ వద్ద సీపీడబ్ల్యు స్కీమ్‌లో తాగునీటి పరిశీలన మద్దిపాడు (సంతనూతలపాడు) : గ్రామంలో ఇంత చెత్త పేరుకుపోతే ఏమీ పట్టనట్టు తిరుగుతారా..? పారిశుద్ధ్యంపై అలసత్వం వహిస్తే సస్పెండ్ చేస్తా.. నంటూ జిల్లా కలెక్టర్ సుజాతశర్మ మద్దిపాడు మండలం రాచవారిపాలెం గ్రామ కార్యదర్శికి వార్నింగ్ ఇచ్చారు. గ్రామ సర్పంచ్‌ని సైతం చెక్ పవర్ రద్దు చేస్తాన ని హెచ్చరించారు. పారిశుద్ధ్యం విషయంలో రాజకీయాలొద్దని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోనని మందలించారు. ఎవరి ఇంటి ముందు వారు శుభ్రం చేసుకోలేరా.. వీధుల్లో చెత్తవేస్తా ఎలాగ అంటూ కాలనీ వాసులపై అసహనం వ్యక్తం చేశారు. శనివారం మద్దిపాడు మండలంలో పర్యటించిన కలెక్టర్ పలు గ్రామాల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణ, తాగునీటి సరఫరా వంటి మౌలిక వసతులను పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణపై అసంతృప్తి.. రాచవారిపాలేనికి మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చిన కలెక్టర్ అధికారులను పరుగులు తీయించారు. గ్రామంలోని పారిశుద్ధ్య నిర్వహణపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేయాలని గ్రామ కార్యదర్శి జాన్బాషాను ఆదేశించారు. అలసత్యం వహిస్తే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. గ్రామంలో ఇలా చెత్త పేరుకుపోతుంటే మీరేమి చేస్తున్నారంటూ సర్పంచ్ పిట్టల ఆంజనేయులును నిలదీశారు. ఇలాగైతే చెక్‌పవర్ తీసేస్తానని హెచ్చరించారు. స్పందించిన సర్పంచ్ మాట్లాడుతూ తాను సర్పంచ్‌నని కూడా గుర్తించకుండా కార్యదర్శి ఇస్టానుసారం వ్యవహరిస్తున్నాడని, ఒక పార్టీ వారికే పనులు చేస్తానని చెబుతున్నాడని ఆరోపించారు. పారిశుద్ధ్య పనుల విషయంలో రాజకీయూలొద్దని కలెక్టర్ హితవు పలికారు. అనంతరం ఎస్సీ కాలనీలో పర్యటించిన ఆమె కాలనీలలో చెత్త నయిదిబ్బలు వేసి ఉంటే ఎలాగని కాలనీ వాసులను ప్రశ్నించారు. ఎవరి ఇంటి ముందు వారు, ఎవరివీధి వారు శుభ్రం చేసుకోలేరా..? అని ప్రశ్నించారు. కార్యదర్శి విషయం పక్కనబెట్టి పారిశుధ్య పనులు దగ్గర ఉండి చేయించాలని సర్పంచ్‌కు సూచించారు. పనులు పర్యవేక్షించాలని డీపీఓ ప్రసాద్‌ను ఆదేశించారు. గ్రామ కంఠంలోని స్థలాన్ని వైద్య ఆరోగ్యశాఖ సబ్సెంటర్కు ఇవ్వటానికి తీర్మానం చేయనీయకుండా గ్రామ కార్యదర్శి, మరికొందరు కలిసి ఇబ్బంది పెడుతున్నారని సర్పంచ్ ఆరోపించారు. గ్రామానికి సీపీడబ్ల్యు స్కీమ్ ద్వారా నీరు వస్తున్నా దానిలో గుండ్లకమ్మ నదిలోని నీరు కలుపుతుండటంతో నీరు వాసన వేస్తుందని, గాజులపాలెం వద్ద ఏర్పాటు చేసిన రొయ్యల ఫ్యాక్టరీలో వ్యర్ధపు నీరు శుద్ధి చేయకుండా గుండ్లమ్మ నదిలోకి వదలడంతో జబ్బులు వస్తున్నాయని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తేవడంతో తిరుగు ప్రయాణంలో ఆ గ్రామానికి ఏర్పాటు చేసిన సంప్ వద్ద నీరు లీక్ అవుతుండటాన్ని పరిశీలించారు. తాగునీటి సరఫరా పరిశీలన.. గాజులపాలెం, కీర్తిపాడు గ్రామస్తులు తమ గ్రామంలో రోడ్లులేవని, ఆదేవిధంగా రొయ్యల ఫ్యాక్టరీవారు గుండ్లకమ్మ నదిలోని నీటిని కలుషితం చేస్తున్నారని ఆరోపించారు. దీంతో కలెక్టర్ ఫ్యాక్టరీ వెనుక భాగంలో ఫ్యాక్టరీ నుంచి వదులుతున్న నీటిని పరిశీలించారు. ప్యాక్టరీ నుంచి వస్తున్న దుర్వాసనకు ముక్కు మూసుకున్నారు. వెంటనే పొల్యూషన్ కంట్రోల్ వారితో వచ్చి పూర్తి స్థాయిలో పరిశీలన చేయూల్సిందిగా ఆమె ఆర్డీవో కమ్మ శ్రీనివాసరావును ఆదేశించారు. ప్రతి చోటా తాగునీటిపై ఫిర్యాదులు వస్తుండటంతో ఆమె గుండ్లకమ్మ రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన సీపీడబ్ల్యు స్కీమ్ వద్దకు వె ళ్లి అక్కడి పరిస్థితులను గమనించారు. క్లోరోమీటర్ ద్వారా నీటిలో క్లోరినేషన్ చేశారా లేదా అని పరిశీలించారు. గుండ్లకమ్మ సీపీడబ్ల్యు స్కీమ్ ద్వారా 76 గ్రామాలకు నీరు సరఫరా అవుతోందని ఏఈ రవికుమార్ కలెక్టర్‌కు తెలిపారు. స్కీమ్ నుంచి చివరి ట్యాప్ వరకూ ఎంత పీపీఎం నమోదైనది తనకు ఆదివారం సాయంత్రానికల్లా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నీటి నమూనాలు తీసుకోవాల్సిందిగా డీఎంహెచ్ఓ జాస్మిన్ను ఆదేశించారు. సీపీడబ్ల్యు స్కీమ్ వద్ద క్లొరినేషన్ పెంచాల్సి ఉంటుందని కలెక్టర్ అభిప్రాయం వ్యక్తం చేయగా అసలు క్లోరినేన్ చేస్తేనే కదా అంటూ స్థానికులు చర్చించుకోవడం కనిపిం చింది. కార్యక్రమంలో తహశీల్దార్, ఎంపీడీవో, ఇతర మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
'ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం'
ప్రకాశం: ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామని ప్రకాశం జిల్లా కలెక్టర్ సుజాత శర్మ అన్నారు. శనివారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడారు. జూలై 3న జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రకాశం జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ఈనెల 30న ఓటర్లకు పోలింగ్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. వికలాంగులు, నిరక్షరాస్యులు తమ వెంట సహాయకులను తెచ్చుకునే వెసులుబాటు కల్పించామని.. అందుకోసం ముందుగా ఎన్నికల అధికారికి దరఖాస్తు చేసుకోవాలని ఆమె చెప్పారు. జిల్లాలో ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ శ్రీకాంత్ అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ వదిలి పెట్టబోమని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. క్యాంపు రాజకీయాలు చేయటం ఎన్నికల చట్టప్రకారం నేరమని.. క్యాంపు రాజకీయాలకు దూరంగా ఉండాలని ఎస్పీ శ్రీకాంత్ రాజకీయ పార్టీలను హెచ్చరించారు. -
ఎండ బాధితులకు కంట్రోల్ రూం ఏర్పాటు
తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడి ప్రతాపానికి వందల మంది మృత్యువాత పడుతుండటం తెలిసిందే. తాజాగా సోమవారం రోజున ప్రకాశం జిల్లాలో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సందర్భంగా ఆ జిల్లా కలెక్టరు సుజాత వర్మ మాట్లాడుతూ.. 'ప్రజలు అప్పమత్తంగా ఉండాలి. వడదెబ్బ తగలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటి దాకా జిల్లాలో వడదెబ్బతో మృతిచెందిన వారి వివరాలను సేకరించేందుకు మండలాల వారీగా త్రిసభ్య కమిటీ వేశాం. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చలివేంద్రాల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశాం. జిల్లా కలెక్టరేట్లో ప్రజలకోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేశాం. నంబరు 08592281400, 1077 టోల్ ఫ్రీ నంబరు' ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని కలెక్టర్ సుజాతశర్మ తెలిపారు. -
రైస్‌మిల్లర్లకు షోకాజ్ నోటీసులు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో 26మంది రైస్‌మిల్లర్లకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. 2012-13 సంవత్సరం ఖరీఫ్, రబీ సీజన్లలో ప్రభుత్వం ఐకేపీ ద్వారా వరి ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఆ ధాన్యాన్ని రైస్‌మిల్లర్లకు అప్పగించింది. మిల్లింగ్ చేసేందుకు చార్జీలు చెల్లిస్తోంది. మిల్లింగ్ చేసిన అనంతరం రైస్‌మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్)ను ఎఫ్‌సీఐకి డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు రైస్‌మిల్లర్లు ఎఫ్‌సీఐకి బియ్యం అప్పగించలేదు. దీంతో సంబంధిత రైస్‌మిల్లర్లకు జాయింట్ కలెక్టర్ సుజాతశర్మ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రైస్‌మిల్లర్ల వద్ద 14,365 మెట్రిక్ టన్నుల బియ్యం ఉన్నాయి. ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వం అప్పగించిన ధాన్యాన్ని సేకరించిన ఐదుగురు మిల్లర్లు, రబీ సీజన్లో సేకరించిన 21మంది రైస్‌మిల్లర్లకు నోటీసులు జారీ అయ్యాయి. బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించాలని, లేనిపక్షంలో రెవన్యూ రికవరీ యాక్టు ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేసిన 15 రోజుల్లోగా సీఎంఆర్ రైస్‌ను ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంటుంది. 2013-14 ఖరీఫ్ సీజన్లో రైతుల వద్ద ఐకేపీ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న వరి ధాన్యాన్ని నోటీసులు జారీ అయిన రైస్‌మిల్లర్లకు ఇవ్వడం లేదని, కొత్త మిల్లర్లు, గత ఏడాది పూర్తి బియ్యాన్ని అప్పగించిన రైస్‌మిల్లర్లకు మాత్రమే ఈ ఏడాది ధాన్యం ఇస్తున్నామని డీఎస్వో వసంత్‌రావ్ దేశ్‌పాండే తెలిపారు.