ప్రత్తిపాడు ఆంధ్రాబ్యాంకులో నగదు కోసం వేచి ఉన్న జనం
- ఖాతాదారులపై ప్రత్తిపాడు ఆంధ్రాబ్యాంకు మేనేజర్ ఫైర్
- మా డబ్బులు మాకివ్వడానికి మీ నిబంధనలేంటంటూ ఖాతాదారుల మండిపాటు
ప్రత్తిపాడు: ‘అసలు మిమ్మల్ని మా బ్యాంకులో డబ్బులెవ్వడేసుకోమన్నాడు.. ఇప్పుడిలా ఎవడెగబడమన్నాడు.. మిమ్మల్ని బతిమాలామా.. మా బ్యాంకుకు రమ్మని పిలిచామా.. ముందు బయటకు పోయి మాట్లాడండి..’ అంటూ గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఆంధ్రాబ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావు ఖాతాదారులపై ధ్వజమెత్తారు. ఇష్టానుసారంగా మాట్లాడి ఖాతాదారుల ఆగ్రహావేశాలకు గురయ్యారు.
మంగళవారం జరిగిన ఈ ఘటన వివరాల్లోకెళితే.. ఈనెల 26, 27 తేదీల్లో బ్యాంకులకు సెలవు కాగా, 28న నగదు కొరత వలన విత్‌డ్రాయల్స్‌ను అనుమతించలేదు. దీంతో మంగళవారం ఉదయం ఊహించని విధంగా బ్యాంకు వద్దకు ఖాతాదారులు భారీగా చేరుకున్నారు. దీంతో బ్యాంకులో తోపులాట జరిగింది. తాము ఇంతమంది వచ్చినా బ్యాంకు మేనేజర్ పట్టించుకోకపోవడంతో ఖాతాదారులు ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డబ్బుల్లేక జనం అల్లాడుతుంటే.. పట్టంచుకోరా అంటూ నిలదీశారు. తదనంతరం ఖాతాదారులకు మేనేజర్ నగదును అందజేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.
16 లక్షలు పంపిణీ చేశాను
రెండురోజులు బ్యాంకుకు సెలవు రావడం, సోమవారం బ్యాంకులో నగదు లేకపోవడంతో జనం రద్దీ బాగా ఎక్కువగానే ఉంది. ఇవాళ ఒక్కరోజే సుమారు 600 మందికి రూ.16 లక్షల నగదును అందజేశాం. అసలు మాకు నోట్లు వస్తేనే కదా మేము జనానికి ఇచ్చేది.
– శ్రీనివాసరావు, ఆంధ్రాబ్యాంకు మేనేజర్, ప్రత్తిపాడు