రాజధానిలోని కళాశాలల్లో సీట్ల భర్తీపై మంత్రి మనీశ్ సిసోడియా చేసిన ప్రతిపాదనలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పరిష్కారమిది కాదు!!
Published Thu, Jan 9 2014 11:00 PM | Last Updated on Sat, Sep 2 2017 2:26 AM
న్యూఢిల్లీ: రాజధానిలోని కళాశాలల్లో సీట్ల భర్తీపై మంత్రి మనీశ్ సిసోడియా చేసిన ప్రతిపాదనలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులకే 90 శాతం సీట్లు కేటాయించాలనే అభిప్రాయాన్ని సిసోడియా ఇటీవలే సూచనప్రాయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ ఈ ప్రతిపాదనపై విద్యార్థుల్లో హర్షం వ్యక్తమవుతుండగా విద్యావేత్తల్లో మాత్రం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ‘ఇది విశ్వవిద్యాలయ స్ఫూర్తికి విరుద్ధం. ప్రభుత్వ ప్రతిపాదనలు విద్యార్థుల్లో పోటీతత్వాన్ని దెబ్బతీస్తాయి. ఉదాహరణకు సెంట్రల్ యూనివర్సిటీనే తీసుకుందాం. అక్కడికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి కూడా విద్యార్థులు చేరుతుంటారు. అప్పుడే విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుంది.
కేవలం ఢిల్లీ వాసులకే 90 శాతం సీట్లు కేటాయించడం ద్వారా తమకెలాగైనా సీటు వస్తుందనే అభిప్రాయం వారిలో పోటీతత్వాన్ని తగ్గిస్తుంద’ని దయాళ్‌సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఐఎస్ బక్షీ అన్నారు. ‘మంత్రి మనీశ్ సిసోడియా ఈ విషయంలో చొరవ తీసుకోవడం ప్రశంసనీయమైన విషయమే. అయితే సమస్యకు పరిష్కారం ఇది కాదు. ఏటా 2.65 లక్షల మంది విద్యార్థులు పాఠశాలల నుంచి కళాశాల చదువుల కోసం బయటకు వస్తున్నారు. అయితే నగరంలోని కళాశాలల్లో కేవలం 90,000 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ కారణంగా నగర విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. అంతేగానీ ఇతర ప్రాంతాలవారు వస్తున్నంతమాత్రాన స్థానిక విద్యార్థులు అవకాశాలు కోల్పోతున్నారనుకోవడం సరికాదు. అయితే సమస్య పరిష్కారానికి బయట విద్యార్థులను రాకుండా అడ్డుకోవడం సమంజసమనిపించుకోదు. కళాశాలల సంఖ్య పెంచి, స్థానిక విద్యార్థుల అవకాశాలను మరింత మెరుగుపర్చాల’ని కిరోరీమాల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సలోనీ శర్మ అభిప్రాయపడ్డారు.
పాఠశాలల్లో చదివిన విద్యార్థులతోనే కలిసి విశ్వవిద్యాలయాల్లో కూడా చదివితే అప్పుడు పాఠశాలకు, విశ్వవిద్యాలయానికి తేడా లేకుండా పోతుందని, ఇది విశ్వవిద్యాలయ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ మాజీ సభ్యుడు అమర్‌దేవ్ శర్మ మాట్లాడుతూ... ‘ఢిల్లీ యూనివర్సిటీ అనేది రాష్ట్రానికి చెందిన విశ్వవిద్యాలయం కాదు. అది కేంద్ర విశ్వవిద్యాలయం. దానిని ఢిల్లీ వాసులకే పరిమితం చేస్తామంటే ఎలా? నగర విద్యార్థులు నగరంలోనే చదువుకోవాలనే అభిప్రాయం నేతల్లో ఉంటే వారి కోసం రాష్ట్ర విశ్వవిద్యాలయాలను ప్రారంభించుకోవాలి. అంతేకాని దేశంలోని మిగతా ప్రాంతాల విద్యార్థుల అవకాశాలను దెబ్బతీయడం సరికాద ’న్నారు.
Advertisement
Advertisement