‘కరోనా’.. కోటి రూపాయల నజరానా | Prove Covid-19 Spreads Through Chicken And Claim Rs One Crore | Sakshi
Sakshi News home page

‘కరోనా’.. కోటి రూపాయల నజరానా

Published Wed, Mar 18 2020 5:10 PM | Last Updated on Wed, Mar 18 2020 5:38 PM

Prove Covid-19 Spreads Through Chicken And Claim Rs One Crore - Sakshi

సాక్షి, చెన్నై: కోడి గుడ్లు, చికెన్‌ తినడం వలన, కరోనా వైరస్‌ వ్యాపిస్తుందని ఎవరైనా నిరూపిస్తే వారికి రూ.కోటి బహుమతిని అందజేస్తామని తమిళనాడు ఫౌల్ట్రీ రైతు సమాఖ్య, తమిళనాడు ఫౌల్ట్రీ రైతు మార్కెటింగ్‌ సొసైటీ సంయుక్తంగా ప్రకటించాయి. కరోనా కలకలం నేపథ్యంలో చికెన్‌, గుడ్లు ధరలు దారుణంగా పడిపోయాయి. ఫౌల్ట్రీకి ప్రసిద్ధి చెందిన నామక్కల్‌లో ఎన్నడూ లేనంతగా కోళ్ల ఫారాలు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఫౌల్ట్రీ రైతులు మంగళవారం నామక్కల్‌ పట్టణంలో సమావేశమయ్యారు. ఫౌల్ట్రీ రైతు సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాంగిలి సుబ్రమణ్యం ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కరోనా భీతితో కొన్ని రోజులుగా కోడి మాంసం, కోడిగుడ్ల వ్యాపారం తీవ్రంగా నష్టపోయిందన్నారు. కోడి గుడ్డు ధర ఇప్పుడు రూ. 1.3 పడిపోయిందని, కోడి మాంసం రూ. 20కి తగ్గిందన్నారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వదంతులే దీనికి కారణమన్నారు. (‘కరోనా’పై కొత్త చాలెంజ్‌.. భారీ స్పందన)

ఇటువంటి ప్రచారంతో కోళ్ల ఫారం రైతులే కాకుండా వ్యాపారులు కూడా తీవ్రంగా నష్టపోయారని వాపోయారు. రూ. 20 విక్రయించిన మొక్క జొన్నలు (కోళ్ల దాణా) ఇప్పుడు రూ. 16కు విక్రయిస్తున్నా కొనేవారు కరువయ్యారని అన్నారు. వ్యాపారం దారుణంగా పడిపోవడంతో నామక్కల్‌ మండలంలో 15 కోట్ల గుడ్లు నిలిచిపోయాయని, పాఠశాలలు సెలవుల కారణంగా అదనంగా మరో 4 కోట్ల గుడ్లు నిలిచిపోయాయని వెల్లడించారు. వీటిని శీతలీకరణ పెట్టెల్లో పెట్టి ధర పెరిగిన తర్వాత విక్రయించే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. చికెన్‌, కోడిగుడ్లు తినడం ద్వారా కరోనా వ్యాపిస్తుందని ఎవరైనా నిరూపిస్తే వారికి తమ సమాఖ్య తరఫున రూ.కోటి బహుమతి అందజేస్తామని ప్రకటించారు. అమెరికా, చైనా, ఇటలీ వంటి దేశాల్లో కూడా కోడి మాంసం, కోడి గుడ్లను ఆహారంగా తీసుకుంటున్నారు.. అక్కడ కోడి మాంసం వలన ఎలాంటి నష్టం జరగలేదని వెల్లడించారు. ప్రజలు వదంతులను నమ్మకుండా కోడి మాంసం, గుడ్లు తినాలని కోరారు. కరోనా వదంతుల వల్లే ఇప్పటి వరకు పౌల్ట్రీకి దాదాపు రూ. 500 కోట్లు నష్టం వాటిల్లిందని తెలిపారు.

వదంతులు సృష్టించిన ఆడిటర్‌ అరెస్ట్‌
సేలం: కోడి మాంసం, గుడ్లు తింటే కరోనా వస్తుందంటూ సామాజిక మాధ్యమాల్లో వదంతులు సృష్టించిన ఆడిటర్‌ బాబు శరవణన్‌ (40)ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోడి మాంసం, కోడి గుడ్లు తింటే కరోనా వ్యాపిస్తుందంటూ శరవణన్‌.. సోషల్‌ మీడియాలో వీడియో షేర్‌ చేశాడు. ఇది వైరల్‌గా మారడంతో తమిళనాడు ఫౌల్ట్రీ రైతు సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాంగిలి సుబ్రమణ్యం.. నల్లిపాళయం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు సోమవారం రాత్రి శరవణన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. (కరోనా: తెర వెనుక హీరోపై ప్రశంసలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement