రీ ఎగ్జామ్‌కు ప్రశ్నపత్రమే తయారు కాలేదు !
రెండోసారి లీకుకు అదే మార్గం
తేటతెల్లమవుతున్న పీయూసీ బోర్డు నిర్లక్ష్యం
దర్యాప్తులో బయట పడుతున్న వాస్తవాలు
లీకు వీరుడి కోసం గాలింపు
బెంగళూరు: తప్పును సరిదిద్దుకోక పోవడమంటే ఇదేనేమో?! పీయూసీ బోర్డు అధికారులు ప్రశ్నపత్రం ముద్రణలో కనీస జాగ్రత్తలు తీసుకోక పోవడం రెండోసారి కూడా పశ్నపత్రం లీకైనట్లు సీఐడీ అధికారుల దర్యాప్తులో తేలింది. ఈ ఏడాది మార్చి 21న జరగాల్సిన ద్వితీయ పీయూసీ ప్రశ్నపత్రం లీక్ కావడంతో అదే నెల 31న రీ ఎగ్జామ్ నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇందుకోసం పీయూసీ బోర్డు నూతన ప్రశ్నపత్రమే రూపొందించనే లేదు. మార్చి 21న నిర్వహించడానికి రూపొందించిన ప్రశ్నపత్రాల సెట్‌లోనే ఒక సెట్‌ను తీసుకుని తొలుత ఏ చోట ముద్రించారో అదే ప్రింటింగ్ ప్రెస్‌లో ముద్రించారని సీఐడీ దర్యాప్తులో తేలింది.
దీంతో లీకు వ్యవహారం మరింత తేలికైందని దర్యాప్తు బృందంలోని ఓ అధికారి అభిప్రాయపడ్డారు. ‘సాధారణంగా ఏదేని ప్రశ్నపత్రం లీక్ అయిన సందర్భంలో రీ ఎగ్జామ్ నిర్వహించడానికి నూతన బృందం ఏర్పాటు చేసి కొత్తగా ప్రశ్నపత్రం రూపొందిస్తారు. అంతేకాకుండా మొదటిసారి ఎక్కడైతే ముద్రించారో అక్కడ కాకుండా మరోచోట ప్రశ్నపత్రాన్ని ముద్రిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే అంతకు ముందు ప్రశ్నపత్రం రూపొందించిన నిపుణులతో పాటు ముద్రణ చేసే సాధారణ గుమస్తా వరకూ అందరినీ మార్చేస్తారు. ఇది రీ ఎగ్జామ్ నిర్వహణకు ప్రాథమిక సూత్రం. ఈ కనీస జాగ్రత్తలు కూడా తీసుకోక పోవడం వల్లే రెండోసారి కూడా ప్రశ్నప్రతం సులభంగా అక్రమార్కుల చేతికి వచ్చింది.’ అని వివరించారు.
ఈసారి తాలూకా ట్రెజరీలో కాక జిల్లా ట్రెజరీలో
రెండుసార్లు ఒకే విషయానికి సంబంధించిన ప్రశ్నపత్రం లీకై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండటంతో రాష్ట్ర ప్రథమిక విద్యాశాఖ మంత్రి కిమ్మెనరత్నాకర్ అన్నీ తానై ఈనెల 12న జరిగనున్న రసాయనశాస్త్రం పరీక్ష పనులను పర్యవేక్షిస్తున్నారు. అందులో భాగంగా అత్యంత సమర్థులు, నిజాయితీ పరులై దాదాపు 15 ఏళ్లు అనుభవం కలిగిన లెక్చర్లతో పశ్నపత్రాన్ని రూపొందిస్తున్నారు. అంతేకాకుండా గతంలో ముద్రించిన చోట కాక రహస్య ప్రాంతంలో ప్రశ్నపత్రాల ముద్రణ జరగనుంది. ప్రశ్నపత్రాలు రవాణా అయ్యే వాహనంలో పోలీసు సిబ్బంది ఉండేలా జాగ్రత్త తీసుకోనున్నారు. ముఖ్యంగా పశ్నపత్రాలను తాలూకా ట్రెజరీల్లో కాక జిల్లా ట్రెజరీల్లో భద్రపరిచి పరీక్ష జరిగే రోజు ఉదయం మాత్రమే పరీక్ష కేంద్రాలకు తరలించనున్నారు. ఇక ఎన్నికల స్థాయిలో ఉన్నతాధికారులతో పర్యవేక్షణ బృందాలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. దీంతో ఈసారి పరీక్షలో అవకతవకలకు ఆస్కారం ఉండబోదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
సూత్రధారి దొరికాడు!
ద్వితీయ పీయూసీ రసాయనశాస్త్ర పరీక్ష పత్రం లీకు వెనుక ఉన్న సూత్రధారి దొరికాడని తెలుస్తోంది. బెంగళూరులోని రాజాజీనగర్‌కు చెందిన కిరణ్ రాజకీయ పలుకుపడితో పీయూ బోర్డులో ఏ పనైనా ఎవరికైనా కొన్ని ‘కానుకలు’ తీసుకుని చేసి పెడుతుంటాడని అంతనే ఈ లీకు వెనుక సూత్రధారి అని తెలుస్తోంది. రెండుసార్లు పశ్నపత్రం లీకు వెనుక ఇతని హస్తం ఉందని తెలుస్తోంది. ఇతని చేతికి అందిన ప్రశ్నపత్రాన్ని నగరంలోని ఓ ప్రైవేటు కళాశాల యజమాని మంజునాథ్‌కు చేరింది. అతని నుంచి రాష్ట్ర ప్రజాపనుల శాఖలో ఇంజనీర్లుగా పనిచేస్తున్న ఇద్దరికి చేరి...పీయూసీ చదువుతున్న వీరి పిల్లల ద్వారా రాష్ట్రంలోని మిగిలిన విద్యార్థులకు చేరినట్లు సీఐడీ దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం మంజునాథ్, సదరు ఇద్దరు ఇంజనీర్లు సీఐడీ అదుపులో ఉండగా కిరణ్ కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది.