ఆన్‌లైన్‌లో అద్దె వసూలు
ఏప్రిల్ 1 నుంచి అమలు
ప్రత్యేక వెబ్‌సైటు ప్రారంభం
భువనేశ్వర్:
ప్రభుత్వ క్వార్టర్ల అద్దె ఆన్ లైన్‌లో వసూలు చేసేందుకు ఒడిశా సర్కార్ నిర్ణయించింది. ప్రభుత్వ సాధారణ పాలనా విభాగం(జీఏ) ఆధ్వర్యంలో ఈ–క్వార్టరు వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ విధానం అమలవుతుంది. ప్రతి నెల ప్రభుత్వ సిబ్బంది చెల్లించాల్సిన క్వార్టరు అద్దెను కొత్త వ్యవస్థ ప్రకారం ఆన్‌లైన్‌లో వసూలు చేస్తారు. జీతాల చెల్లింపునకు ముందు క్వార్టరు అద్దెను ఆన్‌లైన్‌లో మినహాయిస్తారు. పాత విధానంలో నెలవారీ అద్దె చెల్లింపు వ్యవస్థను మార్చితో ముగిస్తారు. ప్రభుత్వ క్వార్టర్ల నిర్వహణ, కేటాయింపు, రద్దు వగైరా అంశాల్లో పారదర్శకతకు కొత్త వ్యవస్థ దోహదపడుతుంది.
ప్రభుత్వ సాధారణ పాలనా విభాగం(జీఏ) క్వార్టర్ల అద్దె వసూలుకు ప్రత్యేక వెబ్‌సైటు ప్రారంభించింది. ఈ సైటు ఆధ్వర్యంలో ఆన్‌లైన్ అద్దె వసూలు ప్రక్రియ నిర్వహిస్తారు. పాత విధానంలో ప్రభుత్వ క్వార్టరు అద్దె వసూలు ప్రక్రియని మార్చి నెలతో ముగించేందుకు అనుబంధ విభాగాలకు సాధారణ పాలనా విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్‌లైన్ వ్యవస్థలో ప్రతి నెల 20వ తేదీ సరికి చెల్లించాల్సిన జీతం నుంచి క్వార్టరు అద్దెను సర్దుబాటు చేస్తారు. సిబ్బంది బదిలీ, విరామం, అకాల మరణం వగైరా అంశాల్ని ఈ సైటులో పదిలపరుస్తారు. దీని వలన ప్రభుత్వ క్వార్టర్ల అక్రమ నిలుపుదల, అద్దె బకాయి వంటి సమస్యలు నివారించడం సాధ్యం అవుతుంది. అర్హులైన సిబ్బందికి సకాలంలో క్వార్టర్లని కేటాయించేందుకు వీలవుతుంది. ప్రభుత్వ వసతి నిర్వహణలో పూర్తిస్థాయి పారదర్శకతకు వీలవుతుంది.