రంగుల కేలి కి రేడినా
ముంబై: సహజమైన రంగులతో హోలీ జరుపుకునే రోజులు పోయాయి. ఇప్పుడంతా ఎక్కడ చూసినా సింథటిక్ రంగులతో ఆడుతున్నవారే కనిపిస్తున్నారు. ఇవి హానికరమైనవని తెలిసి కూడా వీటితోనే ఆటలాడుకుంటూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు.
వీటిని ఉపయోగించడం వల్ల చర్మసంబంధమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశం మాత్రమే కాకుండా ఒక్కోసారి కంటిచూపు పోయే ప్రమాదముందని తెలిసినా ఈ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడంలేదు. హోలీ వేడుక తర్వాత చాలా మందిలో కళ్ల మంటలు, రకరకాల అలర్జీలు, చూపు మందగించడం వంటి సమస్యలతో బాధపడుతూ తమ వద్దకు వస్తున్నవారి సంఖ్య ఏటా పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు ఈ రంగులతో హోలీ ఆడడం వల్ల కేన్సర్ వచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు. అందుకోసమే హోలీ వేడుక సంతోషంగా జరుపుకోవాలన్నా, ఆ జ్ఞాపకాలు ఏడాదంతా ఉండాలన్నా కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముందని చెబుతున్నారు.
సహజ రంగులతోనే సిసలైన హోలీ...
సహజమైన రంగులతో హోలీ ఆడడం వల్ల ఎటువంటి సమస్యలు ఎదురుకావని, పైగా ఒంటికి అంటుకున్న రంగులు త్వరగా కడిగేసుకోవచ్చనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే సాధ్యమైనంతగా సహజమైన రంగులతో హోలీ జరుపుకోవడమే ఉత్తమం. ఇప్పటికీ పల్లెల్లో గోగు పువ్వును నీళ్లల్లో ఉడికించడం ద్వారా వచ్చే రంగునీళ్లతో హోలీ ఆడతారు. ఇలా హోలీ ఆడడం వల్ల గోగు పువ్వులోని ఔషధ గుణాలు ఒంటికి మేలు చేస్తాయని కూడా చెబుతారు. ఇక పొడి రంగులైన గులాల్ వంటి వాటితో హోలీ ఆడడం అన్ని విధాలుగా ఉత్తమమైనదే. అయితే ఇవి కూడా సహజంగా తయారైనవై ఉండేవిధంగా చూసుకోవాలి.
కంటికి రక్షణగా కళ్లద్దాలు..
ఏ రంగులతో హోలీ ఆడినా చలువ కళ్లద్దాలను ధరించడం అన్ని విధాలా శ్రేయస్కరం. హోలీ అంటే శరీరంలో అంగుళం కూడా వదలకుండా రంగు పూస్తుంటారు. ఇలాంటి సమయాల్లో కంట్లో రంగుపడితే రకరకాల సమస్యలు తలెత్తే అవకాశముంది. పొడి రంగులు పడినా ప్రమాదమే. వీటన్నింటినుంచి కళ్లను కాపాడుకోవాలంటే చలువ కళ్లద్దాలు ధరించడమే పరిష్కారమని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఒకవేళ కంటికి అద్దాలు లేని సమయంలో అకస్మాత్తుగా ఎవరైనా రంగు పూసేందుకు వస్తే ముందుగా కళ్లను మూసుకోవాలని, పెదాలకు కూడా రంగులు అంటకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.
బయటకెళ్లినప్పుడు మరికాస్త...
హోలీ రోజు బయటకెళ్లినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే కొత్త కొత్త సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది. హోలీని పురస్కరించుకొని ఎవరేది చేసినా వేడుకలో భాగంగానే భావిస్తారు. దీంతో ఎదుటివారిపై ఎటువంటి చర్య తీసుకునే అవకాశం లేదు. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండడమే ఉత్తమం. హానికరమైన రంగునీళ్లతో నింపిన బుడగలను మనపైకి విసిరే కొత్త సంస్కృతి ఈ మధ్య పుట్టుకొచ్చింది. దీని నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి.. కార్లు, బస్సుల్లో వెళితే కిటికీ అద్దాలు మూసుకోవాలి. బైక్‌పై వెళ్లినప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలి. కాలినడకన వెళ్లినప్పుడు ఆకతాయిల కదలికలను గమనించాలి.
ముందుజాగ్రత్తే మందు...
హోలీ తర్వాత ఒంటికి అంటుకున్న రంగులను వదిలించుకోవడం పెద్ద కసరత్తే. రకరకాల సబ్బులు, షాంపూలు వంటివి చర్మానికి రుద్ది మరిన్ని సమస్యలు కొనితెచ్చుకుంటారు. దీనికి పరిష్కారం రంగు పడకముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం. కోల్డ్‌క్రీమ్స్ వంటి వాటిని మందంగా ఒంటికి పట్టించడం ద్వారా చర్మానికి రంగు అంటకుండా చూసుకోవచ్చు. లేదంటే కొబ్బరి నూనె ముందుగా రాసుకొని బయటకు వెళ్లినా ఫలితముంటుంది. నీళ్ల రంగు ఒంటి మీద పడినా చర్మానికి రంగు పట్టుకోకుండా ఉంటుంది. ఒకవేళ రంగు అంటినా కడిగేసుకోవడం కూడా సులువే. అంతేకాక చర్మాన్ని పూర్తిగా కప్పివే సే దుస్తులు ధరించడం ఉత్తమం.