గిట్టుబాటు ధరలు, పంటరుణాలు దక్కక ఇటీవల ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను పరమార్శించడానికి ...
బెంగళూరు: గిట్టుబాటు ధరలు, పంటరుణాలు దక్కక ఇటీవల ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను పరమార్శించడానికి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ త్వరలో కర్ణాటక వ్యాప్తంగా పర్యటిస్తారని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ రాజకీయ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. బెంగళూరులోని పార్టీ కార్యాలయంలో కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌తో కలిసి శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కొన్ని కారణాల వల్ల పర్యటన తేదీలు ఖరారు కాలేదని అయితే రాహుల్ గాంధీ పర్యటనపై త్వరలో స్పష్టత వస్తుందని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం వైఫల్యాలు ఏడాదిలోపే తేటతెల్లమయ్యిందన్నారు. అనేక అక్రమాలకు పాల్పడిన లలిత్‌మోదీని ఎందుకు రక్షించడానికి ప్రయత్నిస్తున్నారని ఈ సందర్భంగా బీజేపీ నాయకులను దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు. బెంగళూరు నగరం అభివృద్ధి పథంలో పయనించాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.