న్యూఢిల్లీ: డిమాండ్‌కు అనుగుణంగా ధరలను నిర్ణయించే విధానం (ఫ్లెక్సీ ఫేర్)లో రైల్వే స్వల్ప మార్పులు తీసుకురానుంది. సెప్టెంబర్ 9న అమల్లోకి వచ్చిన ఈ విధానం ద్వారా రాజధాని, దురంతో, శతాబ్ది రైళ్ల టిక్కెట్ కొంటే సాధారణ ధర కన్నా గరిష్టంగా 50 శాతం వరకు ఎక్కువ చార్జీ వసూలు చేస్తున్నారు. త్వరలోనే దీనిని 40 శాతానికి తగ్గించనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 31 మధ్య ఆ రైళ్లలో 5,871 బెర్తులు ఖాళీగా మిగిలిపోవడంతో రైల్వే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఫ్లెక్సీ ఫేర్ ప్రకారం రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో ప్రతి 10 శాతం సీట్లు బుక్ అవుతున్న కొద్దీ మిగిలిన సీట్లకు చార్జీ 10 శాతం మేర పెరుగుతుంది.