రజనీ సాయం చేశారు
రజనీ మురుగన్ చిత్రానికి సూపర్‌స్టార్ రజనీకాంత్ పెద్ద సాయం చేశారని ఆ చిత్ర నిర్మాత ప్రముఖ దర్శకుడు లింగుస్వామి తెలిపారు. ఈయన తన తిరుపతి బ్రదర్స్ పతాకంపై నిర్మిస్తున్న తాజా చిత్రం రజనీమురుగన్. శివకార్తికేయన్, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ చిత్రంలో రాజాకిరణ్, సముద్రకని, సూరి తదితరులు ముఖ్యపాత్రలు ధరించారు. వరుత్త పడాద వాలిబర్ సంఘం చిత్ర ఫేమ్ పొన్‌రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని అందించారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం సాయంత్రం చెన్నైలో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత లింగుస్వామి మాట్లాడుతూ ఇటీవల ఎదుర్కొన్న సమస్యల గురించి చాలా చెప్పాలన్నారు. అయితే అంతకంటే ముందు రజనీమురుగన్ చిత్రం గురించి మాట్లాడే తీరాలని అన్నారు.
ఈ చిత్ర కథా చర్చలు చాలా జాలీగా సాగాయన్నారు. జీవితంలో చాలామంది ఉత్తమ విలన్లు వస్తుంటారు. మీరు ఇదే సంతోషంతో ఉండాలని చిత్ర దర్శకుడు పొన్‌రామ్‌కు చెప్పానన్నారు. తనకు చాలా సమస్యలు ఉండవచ్చునని అవన్నీ ఎదుర్కొనే వచ్చానని అన్నారు. మైనా చిత్ర విజయానికి ముందే కుంకీ చిత్రం చేయడానికి రెడీ అయ్యాను. అలాగే వరుత్త పడాద వాలిబర్ చిత్రం విడుదలకు ముందే ఈ చిత్రం ఒప్పందం జరిగిందని తెలిపారు. ఇదంతా నమ్మకంతో చేసినదేనని అన్నారు. ఈ చిత్రానికి రజనీమురుగన్ అని పేరు పెట్టాలనుకున్నప్పుడు నటుడు రజనీకాంత్ అనుమతిస్తారా? అనే సందేహం కలిగిందన్నారు. కారణం తన పేరును టైటిల్ వాడుకోవడానికి ఆయన అంగీకరించరన్న దానికి ఇంతకుముందు జరిగిన సంఘటనలే ఉదాహరణ అన్నారు.
అయినా ఒకసారి రజనీకాంత్ ను కలిసి వివరిద్దాం అని ఫోన్ ద్వారా సంప్రదించానన్నారు. ఆయన్ని కలవాలన్న విషయాన్ని తెలిసిన రజనీ తన సమయాన్ని వృథా చేయడం ఇష్టంలేక ఫోన్ ద్వారానే మాట్లాడి విషయం అడిగారన్నారు. తానప్పుడు రజనీమురుగన్ టైటిల్ గురించి చెప్పి ఇది దర్శకుడి గురువు రాజేష్ చేసిన ఒరు కల్‌ఒరు కన్నాడి చిత్రంలోని ఒక పాత్ర పేరు అని, ఈ టైటిల్‌తో మీ ఇమేజ్‌కు ఎలాంటి భంగం కలగదని చెప్పి చూడగా ఆయన మధ్యలోనే కట్ చేసి ఆ టైటిల్‌కు తన అనుమతి కావాలి అంతేగా పెట్టుకోండి అంటూ ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా అనుమతించి చాలా పెద్ద సాయం చేశారని లింగుస్వామి అన్నారు.