మౌనమే రజనీ సమాధానం
చెన్నై : తమిళనాట ఎప్పుడు రాజకీయ వాతావరణం నెలకొన్నా అప్పుడు ప్రముఖ నటుడు రజనీకాంత్ ప్రసక్తి రాకుండా పోదు. అంతటి ప్రభావం కలిగిన వ్యక్తి సూపర్‌స్టార్ అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన అభిమానులు రాజకీయ ప్రవేశం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందొక సారి ఎన్నికల పొత్తు విషయంలో చక్రం తిప్పి ఆ కూటమికి విజయాన్ని ఆపాదించిన రజనీకాంత్ ఆపై రాజకీయాల్లోకి రావడం తథ్యం అన్న భావన చాలా మందిలో కలిగింది.
అయితే అలాంటి ఊహలను తారుమారు చేస్తూ నేటికి రాజకీయాలకు దూరం దూరం అంటూ మెయిన్‌టెయిన్ చేస్తున్న రజనీకాంత్ ఇప్పుడు మరోసారి రాజకీయ వార్తలకు కేంద్రబిందువుగా మారారు.ఆ మధ్య బీజేపీ పార్టీ రజనీకాంత్‌కు గాలం వేస్తోందనే ప్రచారం హోరెత్తింది.
గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీనే స్వయంగా సూపర్‌స్టార్ రజనీని కలవడంతో ఆ ప్రచారానికి మరింత బలం చేకూరింది.అయితే అప్పుడు రజనీ... మోదీకి శుభాకాంక్షలు మాత్రమే చెప్పి మద్దతు తెలపకుండా అందర్నీ ఆశ్చర్యపరచారు. కాగా ఇటీవల చిత్రరంగానికి రజనీ చేసిన సేవకు గాను కేంద్రప్రభుత్వం రజనీకి పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించింది.
ఇదీ రాజకీయ ఎత్తుగడలో భాగమేన ని ఒక వర్గం గళం విప్పింది. కాగా తాజాగా శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపధ్యంలో రజనీకాంత్ పేరు మరోసారి చర్చలో న లుగుతోంది.అయితే ప్రస్తుతం రెండు చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉన్న సూపర్‌స్టార్ అందులో ఒక చిత్రం కబాలి షూటింగ్‌ను మలేషియాలో పూర్తి చేసి సోమవారం రాత్రికి చెన్నైకి చేరుకున్నారు.ఆయన్ని చెన్నై విమానాశ్రయంలో కలిసిన విలేకరుల పలు ప్రశ్నలకు సమాధానం దాటవేయడం గమనార్హం.
ముఖ్యంగా రాజకీయపరమైన ప్రశ్నలకు బదులివ్వడానికి విముఖత వ్యక్తం చేశారు.ఆయన ఏమన్నారో చూద్దాం. నాకు పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించడం సంతోషమే.అందుకు కేంద్రప్రభుత్వానికి కృతజ్ఞతలు.ఈ అవార్డు నాకు ఆలస్యంగా లభిస్తోందని భావించడం లేదు. అదే విధంగా అవార్డు విషయంలో కేంద్రప్రభుత్వం తమిళులపై సవతి ప్రేమ చూపుతోందని అనుకోవడంలేదు అని పేర్కొన్నారు. రానున్న శాసన సభ ఎన్నికల గురించి వ్యాఖ్యానించమన్న ప్రశ్నకు రజనీ మౌనమే సమాధానం అనేలా అక్కడి నుంచి వెళ్లిపోయారు.