చెన్నై: "దయచేసి నన్ను నొప్పించకండి.." అంటూ సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. రాజకీయాల్లోకి రావాలని.. మీరు తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని వస్తున్న విజ్ఞప్తులపై కొంత ఆవేదన చెందుతూ రజనీ తన నిరాసక్తతను వ‍్యక్తం చేశారు. అనారోగ్యం నుంచి కోలుకున్న అనంతరం తాను రాజకీయాల్లోకి రాను అని డిసెంబర్ 30వ తేదీన సంచలన ప్రకటన చేశారు. ఈ నిర్ణయంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. తమిళ రాజకీయ పార్టీలు కొంత ఊపిరి పీల్చుకున్నాయి. అయితే రజనీ కోలుకుని తిరిగి రాజకీయాల్లోకి వస్తారని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.
ప్రస్తుతం రజనీ కోలుకున్నారు. ఈ క్రమంలో ‘మీరు తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని.. రాజకీయాల్లోకి రావాలని’ అభిమానులు కోరుతున్నారు. విభిన్న రీతిలో ఈ విషయాన్ని రజనీకి చేరేలా చేస్తున్నారు. ఆదివారం (జనవరి 10) అభిమానులు ధర్నా చేశారు. తమ నిర్ణయం మార్చుకోవాలని.. రాజకీయాల్లోకి ప్రవేశించాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు. దీంతో రజనీకాంత్ సోమవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు.
‘‘నేను కారణాలు ముందే వివరించా. నా నిర్ణయం చెప్పేశా. ఇక ఈ విషయమై నన్ను ఇబ్బంది పెట్టొంది. రాజకీయాల్లోకి రావాలని మళ్లీ మళ్లీ అడిగి నొప్పించవద్దు.’’ అని రజనీకాంత్ ఓ లేఖ విడుదల చేశారు. గత నెలలో హైదరాబాద్ లో రజనీకాంత్ అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. అనంతరం చెన్నె వెళ్లిన తర్వాత ‘నేను రాజకీయాల్లోకి రాను’ అని చెప్పారు. ‘నా అనారోగ్యం దేవుడు చేసిన హెచ్చరిక. రాజకీయాల్లోకి వస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది’ అని రాజకీయాలకు రాం రాం చెప్పేశారు. డిసెంబర్ 31వ తేదీన ప్రకటిస్తానన్నరాజకీయ పార్టీ ఆగిపోయిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment