సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా బంగారద మనుష్య!
- సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా
సాక్షి, బెంగళూరు : కన్నడ సినీ రంగంలో డెబ్బైయవ దశకంలో ట్రెండ్‌ను సృష్టించిన సినిమా ‘బంగారద మనుష్య’. కన్నడ కంఠీరవుడు డాక్టర్ రాజ్‌కుమార్, ప్రముఖ నటి భారతి జంటగా నటించిన ఈ సినిమాకు సిద్ధలింగయ్య దర్శకత్వం వహించారు.
ప్రముఖ రచయిత టీకే రామారావ్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకోవడంతో పాటు చదువుకున్న వారు కూడా వ్యవసాయ రంగంలోకి రావాల్సిన ప్రాధాన్యతను చాటిచెప్పింది. ఈ సినిమా విడుదల 42 ఏళ్లు గడిచిపోయిన తర్వాత ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా.. అందుకో కారణం ఉందండోయ్. త్వరలోనే ఈ సినిమా తమిళంలో రీమేక్ అయి రానుందని గాంధీ వర్గాల సమాచారం.
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా ‘బంగారద మనుష్య’ తమిళంలో రీమేక్ కానుంది. ప్రస్తుతం ‘లింగా’ సినిమా షూటింగ్‌లో రజనీ బిజీగా ఉన్నారు. అయితే లింగా కంటే ముందుగానే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. ఈ విషయంపై రజనీకాంత్ ఆప్తమిత్రుడు రాజ్ బహద్దూర్ మాట్లాడుతూ....‘1972లో నేను బస్‌డ్రైవర్‌గా రజనీ అదే బస్‌కు కండక్టర్‌గా ఉన్న సమయంలో ‘బంగారద మనుష్య’ సినిమా విడుదలైంది. అప్పట్లో మేమిద్దరం కలిసి ఆ సినిమా చూశాం.
మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆ సినిమాను రజనీకాంత్‌తో రీమేక్ చేయించాలని నేను అనుకున్నాను. ఇదే విషయాన్ని రజనీకాంత్ వద్ద ప్రస్తావించినపుడు మళ్లీ మేమిద్దరం కలిసి ఆ సినిమా చూశాం. ఈ సినిమా రీమేక్‌లో కథానాయకుడిగా కనిపించేందుకు రజనీ కూడా ఆసక్తి కనబరుస్తున్నారు’ అని తెలిపారు. ప్రస్తుతం రజనీ ‘లింగా’ సినిమాతో బిజీగా ఉండడం వల్ల బహుశా వచ్చే ఏడాది ‘బంగారద మనుష్య’ రీమేక్ వర్షన్ సెట్స్ పకి వెళ్లే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.