- కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం
సాక్షి, బెంగళూరు: కావేరీ నీటి పంపిణీ విషయమై నిర్వహణా మండలి ఏర్పాటు చేయాలనే కేంద్రం నిర్ణయంపై కన్నడ సంఘాలు భగ్గుమన్నాయి. నీటి నిర్వహణ మండలిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని చెబుతూ కన్నడ చళువళి వాటాల్ పార్టీ అధ్యక్షుడు వాటాళ్ నాగరాజ్ ఆధ్వర్యంలో రాజ్‌కుమార్ అభిమానుల సంఘం అధ్యక్షుడు సా.రా.గోవిందు తదితరులు శనివారం ఆందోళన నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్దం చేశారు.
వాటాళ్ నాగరాజు మాట్లాడుతూతమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఒత్తిళ్లకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ తలొగ్గడం సమంజసంగా లేదని విమర్శించారు. నీటి నిర్వహణా మండలి ఏర్పాటైతే కావేరితో పాటు రాష్ట్రంలోని ఇతర జలాశయాలు కూడా మండలి పరిధిలోకి వెళ్తాయని, తద్వారా కర్ణాటకకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఒక వేళ కేంద్రం నీటి నిర్వహణ మండలి ఏర్పాటుకు ముందుకు వెళ్తే రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులందరూ రాజీనామాలు చేసి కన్నడ సంస్థల ఆధ్వర్యంలో కర్ణాటక బంద్, జైల్ భరో వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. నీటి ని ర్వహణా మండలి ఏర్పాటు చేయకుండా నరేంద్ర మోడీపై ఒత్తిడి తెచ్చేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అఖిల పక్ష సభ్యులతో కలిసి ఢిల్లీ వెళ్లాలని నిర్ణయిం చడం ఆహ్వానించదగ్గ పరిణామమని పేర్కొన్నారు.