స్వాతిని నేనొక్కడే హత్య చేశా
రామ్‌కుమార్ సంచలన వాంగ్మూలం
కేకే.నగర్: ఇన్ఫోసిస్ ఉద్యోగి స్వాతిని హత్య చేసింది తానొక్కడినేనని ఇందులో మరెవరికీ సంబంధం లేదని హత్య కేసు నిందితుడు రామ్‌కుమార్ సంచలన వాంగ్మూలం ఇచ్చాడు. చెన్నై నుంగంబాక్కం రైల్వేస్టేషన్‌లో చూలైమేడుకు చెందిన మహిళా ఇంజినీర్ స్వాతి గత నెల 24వ తేదీ హత్యకు గురైన సంఘటన తెలిసిందే. ఈ హత్యకు కారణమైన సెంగోట్టై సమీపంలో గల మీనాక్షిపురానికి చెందిన రామ్‌కుమార్ (24)ను అరెస్టు చేసి జైలులో ఉంచారు. రామ్‌కుమార్‌ను పోలీసులు కస్టడీలో ఉంచి మూడు రోజులు విచారణ జరపటానికి ఎగ్మూర్ కోర్టు అనుమతి ఇచ్చింది.
గత 13వ తేదీ బుధవారం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు విచారణ జరిపారు. స్వాతితో ఎలా పరిచయం ఏర్పడింది?, ఆమెను హత్య చేయడానికి వేరే ఎవరైనా సహాయం చేశారా? వంటి పలు రకాల ప్రశ్నలు వేశారు. ఆ సమయంలో అతడిచ్చిన వాంగ్మూలంలోని వివరాలు ఇలా ఉన్నాయి. ఫేస్‌బుక్ ద్వారా స్వాతి తనకు పరిచయమైందని, ఆమెపై ప్రేమతో నేరుగా చూడడానికి చెన్నైకు వచ్చినట్లు తెలిపాడు. తన రూపాన్ని చూసి స్వాతి అసహ్యంచుకుని అవమానంగా మాట్లాడిందని, నా ప్రేమను నిరాకరించడమే కాకుండా నన్ను, నా కుటుంబాన్ని కించపరిచే విధంగా మాట్లాడడంతో ఈ హత్య చేసినట్లు రామ్‌కుమార్ ఒప్పుకున్నాడు.
స్వాతిని బెదిరించాలని కత్తితో వచ్చానని ఆమె నన్ను అసహ్యంగా తిట్టడంతో భరించలేక హత్య చేశానని ఇందులో మరెవరికీ సంబంధం లేదని రామ్‌కుమార్ తెలిపాడు. రామ్‌కుమార్ వద్ద పోలీసులు విచారణ శుక్రవారంతో పూర్తికావడంతో ఎగ్మూర్ నేర విభాగ న్యాయస్థానంలోని న్యాయమూర్తి గోపీనాథ్ సమక్షంలో పోలీసులు అతడిని హాజరు పరిచారు. అతడు ఇచ్చిన వాంగ్మూలాన్ని, వీడియో సీడీని న్యాయమూర్తికి సమర్పించారు. న్యాయమూర్తి గోపీనాథ్ రామ్‌కుమార్ వద్ద సుమారు అరగంట సేపు ప్రత్యేకంగా విచారణ జరిపారు. అనంతరం అతడిని గట్టి బందోబస్తు నడుమ పుళల్ జైలులో నిర్బంధించారు.