సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కర్ణాటక పాడి సమాఖ్య (కేఎంఎఫ్) అధ్యక్షుడుగా దావణగెరె జిల్లా హరపనహళ్లి ఎమ్మెల్యే ఎంపీ. రవీంద్ర ఎన్నిక కావచ్చని తెలిసింది. దివంగత మాజీ మంత్రి ఎంపీ ప్రకాశ్ తనయుడైన రవీంద్రను అభ్యర్థిగా ఎంపిక చేయడంపై సహకార శాఖ మంత్రి హెచ్‌ఎస్. మహదేవ ప్రసాద్ నివాసంలో రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివ కుమార్, న్యాయ శాఖ మంత్రి టీబీ. జయచంద్రలు సోమవారం రాత్రి సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ నాయకుడు పీ. నాగరాజ్ కూడా ఆ పదవిని ఆశిస్తున్నందున, వెంటనే నిర్ణయం తీసుకోలేక పోయినట్లు తెలిసింది. రాష్ట్రంలో మొత్తం 13 ప్రధాన పాడి సంఘాలకు డెరైక్టర్లు ఉండగా, వీరిలో 11 మంది కాంగ్రెస్ వారే.
ఇద్దరి మధ్య పోటీ ఉన్నందున బుధవారం కేఎంఎఫ్ అధ్యక్ష అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటిస్తామని సమావేశం అనంతరం మహదేవ ప్రసాద్ తెలిపారు. గతంలో కేఎంఎఫ్ అధ్యక్షుడిగా గాలి సోమశేఖర రెడ్డి కొనసాగగా, ఆయన పదవీ కాలం జులై 15తో ముగిసింది. సుమారు 20 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌కు ఈ పదవి దక్కనుంది. కాగా అధ్యక్ష అభ్యర్థి ఎంపికపై తమ పార్టీ మద్దతుదార్లయిన డెరైక్టర్ల అభిప్రాయాలను సేకరించినట్లు మహదేవ ప్రసాద్ తెలిపారు.
కేఎంఎఫ్ అధ్యక్షుడిగా రవీంద్ర?
Published Tue, Sep 16 2014 3:18 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 PM
Advertisement
Advertisement