‘మెట్రో’ రైలు రెడీ
సాక్షి, చెన్నై :నగరంలో ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించే రీతిలో మెట్రో రైలు ప్రాజెక్టును సుమారు 15 వేల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తిరువొత్తియూరు విమ్కో నగర్ నుంచి జెమిని, సైదా పేట, గిండి మీదుగా మీనంబాక్కం వరకు 32.1 కి.మీ. దూరంలో ఓ మార్గం, సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి కోయంబేడు మీదుగా వడపళని, గిండిలను కలుపుతూ సెయింట్ థామస్ మౌంట్ వరకు 22 కి.మీల దూరం మరో మార్గంలో మెట్రో రైలు సేవలకు నిర్ణయించారు.
ఈ మార్గాల్లో పనులు శరవేగంగా జరుగుతూ వస్తున్నాయి. సెంట్రల్- కోయంబేడు - మౌంట్ మార్గంలో వంతెనల నిర్మాణం పూర్తి అయింది. ఈ మార్గంలో ఆలందూరు వరకు ట్రాక్ ఏర్పాటు పనులు ముగిశాయి. భూగర్భ మార్గం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో మార్గంలో వంతెన, భూగర్భ మార్గ నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. బ్రెజిల్‌లో రూపుదిద్దుకున్న నాలుగు బోగీలను ఇక్కడికి తెప్పించి పనులు పూర్తి చేసుకున్న కోయంబేడు - ఆలందూరు మార్గంలో ట్రయల్ రన్ నిర్విహ స్తున్నారు. ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ మార్గంలో శిక్షణ పొందిన డ్రైవర్లు ఓ రైలును నడుపుతున్నారు.
నవంబర్ నుంచి
ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ఈ మార్గంలో ఒకే సమయంలో రెండు రైళ్లను నడిపే రీతిలో అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నెలలో మొదటి వారంలో ఆలందూరు నుంచి కోయంబేడుకు, కోయంబేడు నుంచి ఆలందూరుకు కొన్ని నిమిషాల వ్యవధుల్లో రెండేసి రైళ్లను నడిపేందుకు నిర్ణయించారు. ఈ మార్గంలో రైల్వే స్టేషన్ల ఏర్పాటు పనులు ముగింపు దశకు చేరాయి. అన్ని పనులు మరో నెలన్నర రోజుల్లో ముగియనున్న దృష్ట్యా, పూర్తి స్థాయిలో ప్రజలకు ఈ మార్గంలో రైలు సేవలను అంకితం చేయడానికి మెట్రో ప్రాజెక్టు అధికారులు కసరత్లుల్లో పడ్డారు.
అక్టోబరు మొదటి వారంలో నిపుణుల పరిశీలనానంతరం నవంబర్‌లో రైలు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయమై ఆ ప్రాజెక్టు అధికారులు పేర్కొంటూ, కోయంబేడు - ఆలందూరు మార్గంలో పనులు ఇక ముగిసినట్టేనని వివరించారు. రైలు నడిపేందుకు ఈ మార్గంలో ఎలాంటి ఇబ్బందుల్లేవని, రైల్వే స్టేషన్ల పనులు మాత్రమే పూర్తి కావాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ మార్గంలో పనులు ముగియడంతో అక్టోబరులో నిపుణుల కమిటీ పరిశీలించి, ఇచ్చే సర్టిఫికెట్ ఆధారంగా నవంబర్ మొదటి వారంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, నెలాఖరులో రైలు నడిపేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
నెలాఖరులో అధికారికంగా మెట్రో రైలు ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. అన్నానగర్ - తిరుమంగళం మధ్య పనులు ముగింపు దశకు చేరాయని ప్రకటించారు. అలాగే, మరికొన్ని చోట్ల భూగర్భ పనులు శరవేగంగా సాగుతున్నాయి, భూగర్భ రైల్వే స్టేషన్ల పనులు ముగింపు దశకు చేరాయని వివరించారు. దీన్ని బట్టి చూస్తే 2015 నాటికి తొలి విడతగా మెట్రో రైలు నగరంలో పరుగులు తీయడం ఖాయం అన్నది స్పష్టం అవుతోంది.