పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ
రెండున్నరేళ్లలో రాజధాని పనులు పూర్తి చేస్తాం
పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం మూడు దశల్లో నిర్మాణం.. రూ.48 వేల కోట్లతో మొదటి దశ పనులు చేపట్టాం
గతంలోనే రూ.9 వేల కోట్లు చెల్లించాం
రెండో దశలో గన్నవ అమరావతి మెట్రో రైల్
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి అభివృద్ధి పనులను రెండున్నరేళ్లలో పూర్తి చేస్తామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. పాత మాస్లర్ ప్లాన్ ప్రకారమే రాజధానిలో నిర్మాణాలు చేపడతామన్నారు.మూడు దశల్లో రాజధాని పనులు పూర్తి చేసేందుకు రూ.లక్ష కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు మంత్రి వెల్లడించారు. ఆదివారం ఉదయం వెలగపూడిలోని సచివాలయం రెండో బ్లాక్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రపంచంలో ఐదు అత్యుత్తమ రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దే లక్ష్యంతో అమరావతి నిర్మాణాన్ని చేపట్టినట్లు చెప్పారు. అత్యుత్తమ డిజైన్ రూపొందించి సింగపూర్, చైనా, జపాన్, రష్యా, మలేసియా తదితర దేశాలను సందర్శించామన్నారు. అమరావతి నిర్మాణాన్ని మూడు దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించామని, తొలిదశలో భాగంగా రూ.48 వేల కోట్లతో మంత్రులు, కార్యదర్శులు, అధికారులు, ఉద్యోగులకు నివాస భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన పనులు చేపట్టామన్నారు.
తొలిదశ పనులకు గతంలోనే టెండర్లు పిలిచి దాదాపు రూ.9 వేల కోట్ల చెల్లింపులు కూడా చేసినట్లు తెలిపారు. ఈ నిర్మాణాలు దాదాపు 90 శాతం పూర్తైనట్లు పేర్కొన్నారు. తొలి దశలో సిటీ నిర్మాణం పూర్తి చేసి రెండో దశలో మెట్రో రైల్ నిర్మాణ పనులు చేపడతామని ప్రకటించారు. రాజధాని విషయంలో గతంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్‌నే ఇప్పుడూ అమలు చేస్తామని, అయితే అంచనా వ్యయాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పరిశీలించాల్సి ఉందన్నారు.
217 చ.కి.మీ మేర అమరావతి నిర్మాణం
రాజధానిలో ల్యాండ్ పూలింగ్ కోసం 2015 జనవరి 1న నోటిఫికేషన్ ఇవ్వగా అదే ఏడాది ఫిబ్రవరి 28 నాటికి ఎలాంటి వివాదాలు లేకుండా 34 వేల ఎకరాలను రైతులు ప్రభుత్వానికి ఇచ్చారని మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. మొత్తం 217 చ.కి.మీ విస్తీర్ణంలో అమరావతి నిర్మాణాన్ని చేపడతామని, సుమారు 3,600 కి.మీ మేర రోడ్లు నిరి్మస్తామని వివరించారు.
రూ.48 వేల కోట్లతో చేపట్టిన ఈ తొలిదశ పనులు పూర్తవగానే రెండో దశలో గన్నవరం విమానాశ్రయాన్ని అమరావతితో కలుపుతూ మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఈ ఖర్చు గత మాస్టర్ ప్లాన్ ప్రకారం అంచనా వేశామని, మరోసారి టెండర్లు పిలిచి సవరించే అవకాశం ఉందన్నారు. అధికారులతో సమీక్షించి 15 రోజుల్లో దీనిపై పూర్తి సమాచారాన్ని ప్రజలకు తెలియ చేస్తామన్నారు.
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారాయణకు పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్షి్మ, సీడీఎంఏ శ్రీధర్, సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, అదనపు కమిషనర్ కట్టా సింహాచలం, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్, సీఆర్డీఏ చీఫ్ ఇంజనీర్లు ఎన్వీఆర్కే ప్రసాద్, సీహెచ్ ధనుంజయ్ తదితరులు శుభాకాంక్షలు తెలియచేశారు.
అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై అంచనాలకు ఆదేశం
అన్న క్యాంటీన్లను మూడు వారాల్లోగా వంద చోట్ల పునరుద్ధరిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. సీఎం చంద్రబాబు తొలి ఐదు సంతకాల్లో అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ కూడా ఉందన్నారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో 203 క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించగా 184 చోట్ల ప్రారంభించినట్లు చెప్పారు. వాటిని తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు రెండు మూడు రోజుల్లో అంచనాలు అందజేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment