పరిహారంపై ఆంక్షలు తగునా!
షోలాపూర్: కరువు కారణంగా అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలు నష్టపరిహారం పొందే విషయంలో ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించడంతో రైతు కుటుంబాలు ఆందోళన చెందుతున్నారు. సరైన పత్రాలు, ఆత్మహత్యకు సరైన కారణాలు లేవనే సాకుతో సహాయం అందించేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. లేదంటే మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని, పత్రాలు సమర్పించాలని చెబుతున్నారు. చిన్న చిన్న కారణాలు, తప్పిదాల వల్ల అనేక మందిని ఆర్థిక సాయం పొందే విషయంలో అనర్హులుగా ప్రకటిస్తున్నారు.
దీంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో రైతుల కుటుంబాలు ఉన్నాయి. జిల్లాలో తొమ్మిది మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా ఆరుగురిని మాత్రమే అర్హులుగా ప్రకటించారు. మిగిలిన ముగ్గురిలో ఇద్దరు రైతుల ఆత్మహత్యలు నియమ, నిబంధనలకు లోబడి లేవని, మరొకరి కుటుంబాన్ని విచారణ పేరుతో సాయం అందించేందుకు నిరాకరించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు లేదా వారి వారసులకు ప్రభుత్వం లక్ష రూపాయలు నష్టపరిహారం ప్రకటించింది.
అందులో రూ.30 వేలు నగదు, మిగిలిన రూ.70 వేలు నెల వారీగా అందజేయనున్నారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు బుధవారం కలెక్టర్ కార్యాలయంలో సిద్ధం చేశారు. కానీ అధికారులు చిన్న చిన్న కారణాలకే అనర్హులుగా ప్రకటించడం సమంజసం కాదని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు సరైన జాబితా రూపొందించి అర్హులకు నష్టపరిహారం అందజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.