రికార్డులకెక్కని చావులు
పరిహారం అందని అన్నదాతల కుటుంబాలు
- 16 ఏళ్ల నుంచి పరిశీలనలో 1191
- 642 మంది కుటుంబాలే అర్హులట
- సర్కారుకు నివేదించినజిల్లా యంత్రాంగం
కరీంనగర్ అగ్రికల్చర్ : వాతావరణ ప్రతికూల పరిస్థితులు.. కరువు.. అప్పులు అన్నదాతను చుట్టుముట్టి విధిలేని పరిస్థితుల్లో తనకు తానే మరణశాసనం రాసుకుంటుంటే అధికారులకు మాత్రం అవేమీ పట్టడంలేదు. 16 ఏళ్లలో 1,191 మంది రైతుల బలవన్మరణానికి పాల్పడితే.. 642 మందిని మాత్రమే అర్హులుగా నివేదిక సిద్ధం చేసి మిగిలిన 549 మందిని మరోసారి చంపేశారు. 642 కుటుంబాలకు రూ.1.50 లక్షల చొప్పున 9.63 కోట్ల పరిహారం మంజూరు చేయాలని కోరుతూ జిల్లా యంత్రాంగం శనివారం ప్రభుత్వానికి నివేదించింది. ఆత్మహత్యలు రికార్డులకెక్కకపోవడం.. విచారణకు నియమించిన త్రీమెన్ కమిటీ మొక్కుబడిగా పనిచేయడం... ప్రభుత్వానికి నివేదికలో ఆలస్యం.. వెరసి ఏళ్లుగా సర్కారు సాయమందక బాధిత కుటుంబాలు దైన్య స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి.
ఏళ్లుగా సాగులో, దిగుబడిలో అగ్రస్థానంలో నిలుస్తున్న జిల్లా వ్యవసాయరంగం తీరు వెలుగునీడలుగా సాగుతోంది. ప్రకృతి ప్రకోపం, వర్షాభావం, కరెంటు కోతలతో పంటలు నష్టపోయి అన్నదాతను అప్పులు వెంటాడుతున్నాయి. ఏటే టా బలవన్మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన రేకెత్తిస్తుండగా.. అధికార యంత్రాంగం మాత్రం ఇదంతా తేలిక గా తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది. 2014లో ఇప్పటివరకు 22 మందికి పైగా రైతులు అప్పులు, ఆర్థిక ఇబ్బందుల తో ఆత్మహత్య చేసుకోగా... ఇప్పటివరకు రికార్డులకు ఎక్కకపోవడం విస్మయం కలిగిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలనే తలంపుతో 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి 421 జీవో అమల్లోకి తెచ్చారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుం బానికి రూ.1.50 లక్షల సాయమందించడం ఈ జీవో ముఖ్య ఉద్దేశం. విపత్తులు, పంట నష్టం, అప్పులబాధ తాళలేక జిల్లాలో 1995 నుంచి 2012 వరకు 4,324మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా.. ప్రభుత్వ సాయం కేవలం 624 మందికే అందింది.
2010 నుంచి 2013 వరకు ప్రభుత్వం అధికారికంగా 167 కేసులకు సంబంధించి 110 మంది అర్హులుగా తేల్చి విడతల వారీగా 2014 ఆగస్టు వరకూ పరిహారాన్ని మంజూరు చేసింది. రికార్డులకెక్కని ఆత్మహత్యలు వేలల్లో ఉండడం అధికార యంత్రాంగం అలసత్వానికి అద్దంపడుతోంది. ఏటా ఆత్మహత్యలు చేసుకున్న వారికి ఆ యేడు పరిహారం అందడం లేదు.
కాలయాపనకే త్రిసభ్య కమిటీ
క్షేత్రస్థాయిలో రైతుల ఆత్మహత్యలను గుర్తించి పరిహారమివ్వడంలో యంత్రాంగం అలసత్వం ప్రదర్శిస్తోంది. ప్రభుత్వం వేసిన త్రిసభ్యకమిటీ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతు కుటుంబాలకు పరిహారం దక్కడంలేదు. సంబంధిత ఆర్డీవో, మండల వ్యవసాయాధికారి, డీఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన త్రిసభ్యకమిటీ కాలయాపనకే పరిమితమవుతోంది. వ్యవసాయాధికా రి, ఎస్సై, తహశీల్దార్, ఆర్డీవో, డీఎస్పీ, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికల పేరిట కాలయాపన చేస్తూ రైతు ఆత్మహత్యలను నిర్ధారించడంలో ఏళ్ల తరబడి జాప్యం జరుగుతోంది. దీంతో అర్హులైన రైతు కుటుంబాలకు పరిహారం దక్కడం లేదు.
రైతు ఆత్మహత్యలకు, సర్కారు నివేదికలకు పొంతన కుదరడం లేదు. 2011-13 మధ్య కాలంలో ఆత్మహత్య చేసుకున్న రైతు ల వివరాలను నమోదు చేయడంలో విచారణ పేరిట అలసత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఏడాది గడిచిపోగా ఇప్పటికీ నివేదిక రూపొందించకపోవడం అధికారుల అలసత్వానికి నిదర్శనం. ఆ రెండేళ్లలో వందలాది మంది రైతులు మృతి చెందగా.. 33 మంది కుటుంబాలే అర్హులంటూ పరిహారం ప్రకటించారు. వీరిలో 11 మందికి మాత్రం ఆ మొత్తం విడుదల కాగా 22 కుటుంబాలకు ఇప్పటికీ అందలేదు. ఏ యేడు కాయేడు ఆత్మహత్యలు.. అందిన పరిహారాన్ని కూడా సం బంధిత అధికారులు గోప్యంగా ఉంచుతుండడం అనుమానాలకు తావిస్తోంది.