ఉప ఎన్నిక సందర్భంగా అధికార, ప్రతిపక్షాల పర్యటనలతో హోరెత్తిపోయిన ఆర్కేనగర్‌లో గురువారం ప్రచారానికి తెరపడనుంది. 27వ తేదీన పోలింగ్ కారణంగా గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రచారాన్ని నిలిపివేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సందీప్ సక్సేనా ప్రకటించారు.
చెన్నై :చెన్నైలోని ఆర్కేనగర్ ఉప ఎన్నికలో అన్నాడీఎంకే అభ్యర్థిగా పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత, సీపీఐ అభ్యర్థిగా మహేంద్రన్ ప్రధాన పార్టీల నుంచి రంగంలో ఉన్నారు. వీరిద్దరుకాక మరో 26 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీచేస్తున్నారు. అమ్మ తరపున మంత్రులు, 50 మంది ప్రచార బృందం పెద్ద ఎత్తున ప్రచారం జరుపుతోంది. సీపీఐ అభ్యర్థి సైతం తన వంతు ప్రచారం సాగిస్తున్నారు.
అభ్యర్థి హోదాలో జయలలిత ఈనెల 22వ తేదీన నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. 27 వ తేదీన పోలింగ్ సందర్భంగా గురువారం సాయంత్రానికి ప్రచారం ముగించాలని, అలాగే ఇతర ప్రాంతాల నుంచి వ చ్చిన వారంతా ఆర్కేనగర్ విడిచి వెళ్లాలని సందీప్ సక్సేనా ఆదేశించారు. ఎన్నికలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు పది కంపెనీల పారా మిలిటరీ దళాలు బందోబస్తులో ఉన్నాయని, వీరుగాక వెయ్యి మంది రాష్ట పోలీసులు, 1150 మంది ఎన్నికల సిబ్బంది, ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు పనిచేస్తున్నారని తెలిపారు.
అన్నదాతల ఆందోళన: ఆర్కేనగర్ నియోజకవర్గంలో గురువారం అన్నదాతలు ఆకస్మిక ఆందోళన చేపట్టి పోలీసులను పరుగులు పెట్టించారు. తండయార్‌పేట-తిరువత్తియూర్ రోడ్డులోని కార్పొరేషన్ మండల కార్యాలయం వద్ద ఉదయం 9 గంటల నుంచి రైతులు గుమికూడడం ప్రారంభించారు. మీరు ఎవరు, ఏం చేస్తున్నారని పోలీసులు ప్రశ్నించగా, ఊరికినే నిలుచున్నా తప్పా అని ఎదురు ప్రశ్నించారు. 10 గంటల సమయానికి సుమారు వందమంది రైతులు గుంపుగా చేరి మండల కార్యాలయంలోకి చొరబడే ప్రయత్నం చేశారు. మీకు ఏమి కావాలని పోలీసులు ప్రశ్నించగా, ముఖ్యమంత్రి దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లేందుకే ఆమె పోటీ చేస్తున్న ఆర్కేనగర్‌లో వినతి పత్రం సమర్పిస్తున్నామని బదులిచ్చారు.
వినతి పత్రాలు ఇక్కడ ఇవ్వకూడదని పోలీసులు వారికి అడ్డుతగలడంతో అకస్మాత్తుగా రోడ్లపై పడుకున్నారు. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్నదాతల ఆందోళనతో సుమారు అరగంటపాటు ట్రాఫిక్ స్తంభించి పోయింది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి ట్రాఫిక్‌ను పునరుద్దరించారు. ఆర్కేనగర్ పరిధిలో బుధవారం రాత్రి వాహనాల తనిఖీల్లో పోలీస్ పేరుతో ఉన్న వాహనం నుండి ఫ్లైయింగ్ స్వ్కాడ్ అధికారులు రూ.2 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరిగింది.
దీంతో ఆర్కేనగర్ నుంచి స్వతంత్య్ర అభ్యర్థులుగా పోటీచేస్తున్న వసంతకుమార్, ఎమ్‌ఎల్ రవి, పాల్‌రాజ్, తదితర 9 మంది అభ్యర్థులు గురువారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తండయార్‌పేటలోని కార్పొరేషన్ మండల కార్యాలయంలో ఫిర్యాదు చేయడానికి దూసుకెళ్లారు. పోలీసులు సర్దిచెప్పి పంపివేశారు. అలాగే ప్రచార సమయంలో తనపై రాళ్లు రువ్వారని మరో స్వతంత్య్ర అభ్యర్థి ట్రాఫిక్ రామస్వామి ఫిర్యాదు చేశారు. ఇతని ఫిర్యాదు స్వీకరించక పోవడంతో ధర్నాకు దిగాడు.
4రోజులు టాస్మాక్ సెలవు :
ఆర్కేనగర్ ఉప ఎన్నిక పోలింగ్, లెక్కింపు సందర్బంగా నాలుగురోజుల పాటూ టాస్మాక్ దుకాణాలకు, బార్లకు సెలవు ప్రకటించారు. 25వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి 27వ తేదీ రాత్రి వరకు, అలాగే లెక్కింపురోజైన 30వ తేదీ రాత్రి వరకు శలవు దినాలను అమలుచేయనున్నారు.
‘అమ్మగెలుపు-తెలుగోడి గెలుపు’ కేతిరెడ్డి ప్రచారం:
తెలుగువారు అత్యధికంగా నివసించే ఆర్కేనగర్ నియోజకవర్గంలో తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అన్నాడీఎంకే తరపున ఈనెల 13 వ తేదీ నుంచి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక్కడి తెలుగు ప్రజలంతా తమ నూరుశాతం ఓట్లను రెండాకుల చిహ్నంపై వేసి అమ్మను అఖండమెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. అమ్మ గెలుపు తెలుగోడి గెలుపు అనే నినాదంతో కరపత్రాలు పంచుతూ వాడవాడలా ప్రచారం నిర్వహించారు. అమ్మను గెలిపిస్తే రాష్ట్రం మరిన్ని మంచి పథకాలతో ముందుకు దూసుకుపోతుందని అన్నారు.
ఏఐటీఎఫ్ ప్రచారం:
ఆలిండియా తెలుగు ఫెడరేషన్ అధ్యక్షులు డాక్టర్ సీఎంకే రెడ్డి నేతృత్వంలో పలు తెలుగు సంఘాల ప్రముఖులు గురువారం ఆర్కేనగర్‌లో ప్రచారం నిర్వహించారు. అమ్మను గెలిపించడం ద్వారా రాష్ట్ర ప్రగతికి బాటలు వేయాలని పేర్కొంటూ అన్నాడీఎంకే తరపున ప్రచారం జరిపారు. చెన్నైపురి ట్రస్ట్ చైర్మన్ తంగుటూరి రామకృష్ణ, టామ్స్ అధ్యక్షులు గొల్లపల్లి ఇజ్రాయేల్, ద్రవిడ దేశం అధ్యక్షులు కృష్ణారావు, దక్షిణభారత తెలుగు సంక్షేమం సంఘం అధ్యక్షులు దోర్నాదుల సత్యనారాయణ, మెహతానగర్ తెలుగు ప్రముఖులు ప్రకాష్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు.
నేటితో ప్రచారానికి తెర
Published Thu, Jun 25 2015 8:20 AM | Last Updated on Sun, Sep 3 2017 4:21 AM
Advertisement