చెత్త వేస్తే రూ.5 లక్షల జరిమానా!
► బెళ్లందూరు చెరువులో డ్రోన్ కెమెరాలతో నిఘా
► చెరువు ప్రక్షాళన పనులు పరిశీలించిన అధికారులు
సాక్షి, బెంగళూరు: నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం, బీబీఎంపీ బెళ్లందూరు చెరువు పునరుద్ధరణ చర్యలను ప్రారంభించిం ది. అందులో భాగంగా ఇకపై బెళ్లందూరు చెరువులో పాటు చెరువు చుట్ట పక్కల ప్రాంతాల్లో కూడా చెత్త,వ్యర్థాలు వేసే వ్యక్తులకు రూ.5 లక్షల జరిమానా విధించనున్నట్లు నగరాభివృద్ధి అసిస్టెంట్ ముఖ్య కార్యదర్శి మహేంద్ర జైన్ హెచ్చరించారు. మంగళవారం బీబీఎంపీ, బీడీఏ, జలమండలి ఆధ్వర్యంలో బెళ్లందూరు చెరువులో జరుగుతున్న స్వచ్ఛతా పనులను పర్యవేక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
చెరువు చుట్టు పక్కల ప్రాంతాల్లోని పరిశ్రమలు, అపార్ట్‌మెంట్‌ల నుంచి భారీ స్థాయిలో చెత్త, వ్యర్థాలు చెరువులో చేరడంతో రసాయనిక చర్యలు జరిగి మంటలు ఏర్పడ్డాయని తెలిపారు. చెరువు పునరుద్ధరణ పనులను చురుగ్గా సాగుతున్నాయని చెరువులో 15 వేల టన్నుల పాచి పేరుకుపోయిందని, ఇప్పటి వరకు 200 టన్నుల పాచిని వెలికితీసామన్నారు . బెళ్లందూరు చెరువుకు పూర్వవైభవం తీసుకురావడానికి కృషి చేస్తున్నామని ఇకపై చెరువులో చెత్త, వ్యర్థాలు వేసే వ్యక్తులకు రూ.5 లక్షల జరిమానా విధించనున్నట్లు తెలిపారు.
అదేవిధంగా చెరువులో చెత్త,వ్యర్థాలను వేసే వ్యక్తులను కనిపెట్టడానికి చెరువు చుట్టూ ఏడు ప్రాంతాల్లో సీసీ కెమెరాలను అమర్చనున్నట్లు తెలిపారు. అదేవిధంగా డ్రోన్ కెమెరాల సహాయంతో చెరువును ఎల్లవేళలా పర్యవేక్షిస్తుంటామని తెలిపారు. కార్యక్రమంలో బీడీఏ కమిషనర్ రాకేశ్ సింగ్ తదితర వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. బెళ్లందూరు చెరువులో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంపై అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరగడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బెళ్లం దూరు చెరువు పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలంటూ కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.