the worst
-
పేరుకే భాగ్యనగర్! అన్నీ అసౌకర్యాలే
► కంపుకొడుతున్న డ్రెయినేజీలు ► గతుకులమయమైన రోడ్డు ► ఫాగింగ్‌పై పట్టింపు కరువు కరీంనగర్‌కల్చరల్: పేరు గొప్ప..ఊరు దిబ్బ అన్నట్టుగా ఉందీ ఆ ప్రాంత పరిస్థితి. స్మార్ట్‌సిటీలో భాగమైన 42వ డివిజన్ పరిధిలోని భాగ్యనగర్‌లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. ఆ ప్రాంతంలో రోజురోజుకు విషజ్వరాలు ప్రబలుతున్న పట్టించుకునే వారు కరువయ్యారు. డ్రెయినేజీలు లేక రోడ్డుపైనే మురుగునీరు పారుతున్న ఆ ప్రాంతం వైపు చూసేందుకు అధికారులు తీరడం లేదు. పారిశుధ్య నిర్వహణకే లక్షలు వెచ్చిస్తున్నామని గొప్పగా చెప్పుకునే కార్పొరేషన్ అధికారులకు భాగ్యనగర్‌ను చూస్తే వారి పనితీరు తెలిసిపోతుంది. అధ్వానం 42వ డివిజన్ పరిధిలోని భాగ్యనగర్‌లో డ్రెయినేజీలు కనిపించవు. మురుగునీరు రోడ్డుపైనే ప్రవహించాల్సిందే. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆ కాలనీవాసుల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. దోమలు పెరిగి ఇప్పటికే పలువురు విషజ్వరాల బారిన పడ్డారు. పత్తా లేని ఫాగింగ్ దోమల నివారణకు చేసే ఫాగింగ్ గురించి అధికారులు పట్టించుకోవడం లేదు. కాలనీలో చాలా ఖాళీ ప్లాట్లు ఉండడంతో విపరీతంగా చెట్లు పెరిగి దోమలు విజృంబిస్తున్నాయి. దోమల నివారణకు ఉపయోగపడే ఫాగింగ్ ఆరు నెలలుగా చేసిన దాఖలాలు లేవు. కనీసం దుర్వాసన వెదజల్లుతున్న ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లడం లేదు. ఇప్పటికైనా పారిశుధ్య నిర్వహణపై శ్రద్ధ తీసుకోవాలని భాగ్యనగర్ వాసులు కోరుతున్నారు. భరించలేకపోతున్నం తలుపు తెరిచిపెడితే మోరీల కంపు భరించలేకపోతున్నం. సాయంత్రం అయితే దోమలు. మోరీల నిండా పందులు. అధికారులకు ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకునే వారు కరువయ్యారు. ఇక్కడి కంటే ఊల్లె ఉండడమే మేలు. డ్రెయినేజీలు లేవు, రోడ్లు సరిగా లేవు. దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. – కాసనగొట్టు శ్రీధర్ దోమలతో వేగలేం దోమలతో వేగలేకపోతున్నాం. వర్షాకాలం ప్రారంభమైందంటే చాలు భయమేస్తుంటుంది. చిన్నచిన్న గుంతల్లో వర్షపునీరు నిలిచి దోమలు పెరుగుతున్నాయి. పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి. రాత్రి నిద్రపోలేకపోతున్నాం. వెంటనే దోమల నివారణ చర్యలు చేపట్టాలి. పరిసరాలు కంపు వాసన వస్తున్నాయి. – రామకృష్ణ కంపుకొడుతున్నాయి పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉంది. ఎక్కడికక్కడ మురికినీరు నిలిచి పరిసరాలు కంపుకొడుతున్నాయి. చాలా చోట్ల డ్రెయినేజీలు లేకపోవడంతో రోడ్డుపైనే మురుగునీరు ప్రవహిస్తుంది. నివాసాల మధ్యే మురుగునీరు చేరి దుర్వాసన వస్తుంది. ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. –జి.సబిత -
చెత్త వేస్తే రూ.5 లక్షల జరిమానా!
► బెళ్లందూరు చెరువులో డ్రోన్ కెమెరాలతో నిఘా ► చెరువు ప్రక్షాళన పనులు పరిశీలించిన అధికారులు సాక్షి, బెంగళూరు: నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం, బీబీఎంపీ బెళ్లందూరు చెరువు పునరుద్ధరణ చర్యలను ప్రారంభించిం ది. అందులో భాగంగా ఇకపై బెళ్లందూరు చెరువులో పాటు చెరువు చుట్ట పక్కల ప్రాంతాల్లో కూడా చెత్త,వ్యర్థాలు వేసే వ్యక్తులకు రూ.5 లక్షల జరిమానా విధించనున్నట్లు నగరాభివృద్ధి అసిస్టెంట్ ముఖ్య కార్యదర్శి మహేంద్ర జైన్ హెచ్చరించారు. మంగళవారం బీబీఎంపీ, బీడీఏ, జలమండలి ఆధ్వర్యంలో బెళ్లందూరు చెరువులో జరుగుతున్న స్వచ్ఛతా పనులను పర్యవేక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. చెరువు చుట్టు పక్కల ప్రాంతాల్లోని పరిశ్రమలు, అపార్ట్మెంట్ల నుంచి భారీ స్థాయిలో చెత్త, వ్యర్థాలు చెరువులో చేరడంతో రసాయనిక చర్యలు జరిగి మంటలు ఏర్పడ్డాయని తెలిపారు. చెరువు పునరుద్ధరణ పనులను చురుగ్గా సాగుతున్నాయని చెరువులో 15 వేల టన్నుల పాచి పేరుకుపోయిందని, ఇప్పటి వరకు 200 టన్నుల పాచిని వెలికితీసామన్నారు . బెళ్లందూరు చెరువుకు పూర్వవైభవం తీసుకురావడానికి కృషి చేస్తున్నామని ఇకపై చెరువులో చెత్త, వ్యర్థాలు వేసే వ్యక్తులకు రూ.5 లక్షల జరిమానా విధించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా చెరువులో చెత్త,వ్యర్థాలను వేసే వ్యక్తులను కనిపెట్టడానికి చెరువు చుట్టూ ఏడు ప్రాంతాల్లో సీసీ కెమెరాలను అమర్చనున్నట్లు తెలిపారు. అదేవిధంగా డ్రోన్ కెమెరాల సహాయంతో చెరువును ఎల్లవేళలా పర్యవేక్షిస్తుంటామని తెలిపారు. కార్యక్రమంలో బీడీఏ కమిషనర్ రాకేశ్ సింగ్ తదితర వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. బెళ్లందూరు చెరువులో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంపై అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరగడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బెళ్లం దూరు చెరువు పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలంటూ కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. -
ఎట్టకేలకు క్లోజ్
మండూరు డంపింగ్ యార్డ్‌కు తాళమేసిన అధికారులు బెంగళూరు: నగరంలో సేకరిస్తున్న చెత్తను ఇక మీద మండూరులో వేయరాదని బీబీఎంపీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గురువారం రాత్రి 10.45 గంటల సమయంలో మండూరుకు వెళ్లిన పాలికె ఇంజనీర్లు అక్కడ డంపింగ్ యార్డ్‌కు చెత్తను తీసుకు వెళ్లిన సుమారు 50 లారీల డ్రైవర్లకు శుక్రవారం నుంచి ఇక్కడికి చెత్త తీసుకురాకూడదని సూచించారు. మండూరు చెత్త డంపింగ్ యార్డ్ పరిశీలిస్తున్న పాలికె జాయింట్ కమిషనర్లు దర్పణ్ జైన్, డాక్టర్ యతీష్ కుమార్ ఆదేశాల మేరకు మండూరు యార్డ్‌కు తాళం వేశారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి మండూరులో చెత్త వెయ్యనియ్యబోమని పాలికె అధికారులు గతంలోనే మాట ఇచ్చారు. ఇంతకు ముందు అనేక సార్లు పాలికె అధికారులు మాట తప్పి మండూరులోనే చెత్త వేస్తూ కాలం వెళ్లదీశారు. ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు భావించారు. అయితే పాలికె అధికారులు చెప్పిన గడువు కంటే 10 రోజులు ముందుగానే మండూరు చెత్త డంపింగ్ యార్డ్‌కు తాళం వేశారు. మండూరులో ఇంత కాలం వేస్తున్న చెత్తను ఇక ముందు కేసీడీసీ, లక్ష్మిపుర, టెర్రాఫాం డంపింగ్ యార్డ్‌లో వేయాలని పాలికె అధికారులు సూచించారు. గ్రామస్తుల సంబరాలు పాలికె జాయింట్ కమిషనర్లు దర్పణ్ జైన్, డాక్టర్ యతీష్ కుమార్‌లు గురువారం రాత్రి మండూరు గ్రామ పెద్దలకు ఫోన్ చేశారు. శుక్రవారం నుంచి మండూరులో చెత్త వేయబోమని చెప్పడంతో మండూరు, చుట్టు పక్కల గ్రామాల్లో నివాసం ఉంటున్న వారు సంబరాలు చేసుకున్నారు. శుక్రవారం గ్రామ పెద్దలు మండూరు ప్రజలకు స్వీట్లు పంచిపెట్టారు. ఇంత కాలం తామూ చేసిన పోరాటాలకు ఈ రోజు న్యాయం జరిగిందని మండూరు గ్రామ పెద్దలలో ఒకరైన శ్రీనివాస్‌గౌడ చెప్పారు. మండూరు యార్డ్‌లో 10 లక్షల టన్నుల చెత్త ఇంత కాలం బెంగళూరులోని చెత్తను మండూరు డంపింగ్ యార్డ్‌కు తరలించడంతో అక్కడ దాదాపు 10 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయింది. చెత్త మీద కంపోస్టు మందులు చల్లారు. ఈ చెత్తను ఎరువులుగా తయారు చేయాలంటే ఒక సంవత్సరం కంటే ఎక్కువ సమయంలో పడుతుందని గ్రామస్తులు అంటున్నారు. ఈ చెత్తను వేరే ప్రాంతాలకు తరలించాలంటే రెండు మూడు నెలలు పడుతుందని బీబీఎంపీ అధికారులు అంటున్నారు. -
‘సిటి..జెన్’తో సమస్యల పరిష్కారం
ఫిర్యాదుల స్వీకరణకు జీహెచ్ ఎంసీ కొత్త విధానం మైక్రోసాఫ్ట్ సహకారంతో కొత్త యాప్ హైదరాబాద్: రహదారులపై గుంతలు కనిపించాయా?... నిండిపోయినా కుండీ నుంచి చెత్తను తొలగించలేదా?... వీధి కుక్కలతో బెంబేలెత్తుతున్నారా?... ఇలా సమస్య ఏదైనా మీ దృష్టికి వస్తే యాప్ ఆన్ చేసి స్మార్ట్ ఫోన్‌తో ‘క్లిక్’ మనిపించండి. దాన్ని ‘సేవ్’ చేసి వచ్చే ఆప్షన్ల నుంచి ‘సెండ్’ కొట్టండి. అంతే.. ఆ సమస్య జీహెచ్ఎంసీ ఫిర్యాదుల కాల్‌సెంటర్‌కు చేరుతుంది. వెంటనే దాన్ని పరిష్కరించే సంబంధిత అధికారికి ఫిర్యాదు సెంటర్ నుంచి సందేశాలు వెళ్తాయి. వారు ఆ సమస్యను పరిష్కరిస్తారు. వినూత్న తరహాలో ఫిర్యాదులను స్వీకరించే ఈ సరికొత్త విధానాన్ని జీహెచ్ఎంసీ త్వరలో అందుబాటులోకి తేనుంది. ‘సిటి ..జెన్’గా వ్యవహరించే ఈ పథకాన్ని మైక్రోసాఫ్ట్ సహకారంతో రూపొందించిన యాప్‌తో అమల్లోకి తీసుకురానుంది. ఈనెల 22న దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. అవసరమైన సాంకేతిక సహకారాన్ని మైక్రోసాఫ్ట్ ఉచితంగానే అందజేస్తుందన్నారు. ఒక్క ఫొటోతోనే సదరు సమస్య ఎక్కడుందో.. ఏ ప్రదేశంలోదో కూడా జీపీఎస్ ద్వారా తెలిసిపోతుందన్నారు. -
మొక్కుబడిగా పారిశుధ్య వారోత్సవాలు
సాక్షి, మంచిర్యాల : సామాన్యుల కోసం చేపడుతున్న కార్యక్రమాలు అధికారులు, పాలకుల తీరుతో నీరుగారి పోతున్నాయి. లక్ష్యం నెరవేరడం మాట దేవుడెరుగు మొక్కుబడిగా సాగుతున్నాయి. ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా ప్రజలకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. గత నెల 23 నుంచి 30 వరకు జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో పారిశుధ్య వారోత్సవాలు జరిగాయి. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం కింద పనులు చేపడతామని పురపాలక వర్గాలు ప్రకటించాయి. ఇందులో భాగంగా మురికి కాల్వలు శుభ్రం చేయడం, చెత్తను తొలగించడం, శివారు కాలనీల్లో మురుగునీటి వ్యవస్థను చక్కదిద్దడం, రోడ్ల వెంట చెత్తకుండీలు ఏర్పాటు చేయడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని ఆర్భాటంగా ప్రారంభించిన పురపాలకవర్గాలు ఆదిలో కొంత క్రియాశీలంగానే పనులు చేపట్టాయి. అయితే తర్వాత యథావిధిగా అలసత్వాన్ని ప్రదర్శించాయి. ప్రధాన ప్రాంతాల్లో నుంచి తొలగించిన చెత్త శివారు కాలనీల్లో వేయడంతో సదరు కాలనీ వాసులు ఈ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. మునిసిపాలిటీ వర్గాలతో వాదనలకు దిగిన ఘటనలు పలుచోట్ల జరిగాయి. పా రిశుద్ధ వారోత్సవాలతోపాటు సాధారణ సమయంలోనూ సేకరించిన చెత్తను మంచిర్యాల మున్సిపాలిటీ అధికారులు సమీపంలోని బైపాస్ రోడ్డులో పారబోసేవారు. స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం దాటిన తర్వాత ఉన్న నివాసాల సమీప స్థలం ఈ తంతుకు వేదికగా మారింది. ఈ వ్యవహారం స్థానికులను ఇబ్బందులకు గురిచేయడంతో వారు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఒకవైపు రోడ్డు చుట్టూ మొరం పోస్తూ, మొక్కలు నాటుతుంటే అదే రోడ్డుకు ఇవతల వైపు చెత్త పారబోయటం ఏంటని ప్రశ్నించారు. శాశ్వత చెత్త డంపింగ్ యార్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలాఉంటే జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌తోపాటు వాణిజ్య కేంద్రమైన నిర్మల్లోనూ పారిశుధ్యం షరామామూలుగా అ ధ్వానంగానే ఉంది. మరో మూడు మున్సిపాలిటీల్లోనూ పారిశుద్ధ వా రోత్సవాల ఫలితంతో సదరు మున్సిపాలిటీలు పూర్తి స్థాయిలో బాగుపడ్డ దాఖలాలు లేవు. అదికారులను ఈ విషయమై సంప్రదించగా పారిశుధ్య వారోత్సవాల సమయంలో వరుసగా వచ్చిపడ్డ పలు పనుల ఒత్తిడిలతో పూర్తిస్థాయిలో దృష్టిపెట్టలేదని పేర్కొంటున్నారు. శాశ్వత డంపింగ్‌యార్డులతో పరిష్కారం తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు ఇటీవల పురపాలక వర్గాలతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో నీటి సరఫరాతోపాటు పారిశుధ్యం ముఖ్య అంశంగా చర్చకొచ్చింది. రాబోయే వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అదే సమయంలో శాశ్వత చెత్త డంపింగ్‌యార్డులు ఏర్పాటు చేసేందుకు స్థలాలను గుర్తించాలని అధికారులను సూచించారు. అయినా ఇప్పటికీ ఒకటి రెండు చోట్ల కూడా ఈ స్థల గుర్తింపు జరగలేదని తెలుస్తోంది. శాశ్వత డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసి, పారిశుధ్యం, చెత్త తరలింపుపై శ్రద్ధ తీసుకొని తమ ఇక్కట్లు తొలగించాలని పుర ప్రజలు కోరుకుంటున్నారు. -
కంపు.. ఆర్టీసీకి ఇంపు!
కాంప్లెక్స్‌లలో దుర్గంధం కమ్ముకున్నా పట్టించుకోని యాజమాన్యం వేల మంది వస్తున్నా కనీస సౌకర్యాలు కరువు నిర్వహణలోపంతో పరిస్థితి దయనీయం చోడవరం,న్యూస్‌లైన్ : బస్సుల కోసం నిరీక్షించేవారికి అదనంగా, ఉచితంగా దుర్గంధం సరఫరా చేయాలన్నది ఆర్టీసీ ఆశయం కాబోలు.. జిల్లాలోని వివిధ డిపోల్లో అధ్వానపు మరుగుదొడ్ల ద్వారా ఆ పని విజయవంతంగా నెరవేరుస్తోంది. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే ఆర్టీసీ కాంప్లెక్స్‌లలో పరిస్థితి దుర్భరంగా ఉంది. ప్రయాణికుల నుంచి దండిగా డబ్బు వసూలు చేస్తున్న ఆర్టీసీ వారికి కనీస సౌకర్యాలు కల్పించడపై చూపడం లేదని అంతా మొత్తుకుంటున్నా పరిస్థితి యథావిధిగా కొనసాగుతోంది. జిల్లాలో ఏ ఆర్టీసీ కాంప్లెక్స్ అయి నా ఈ దయనీయ పరిస్థితికి అద్దం పడుతోం ది. ఏటికేడూ చార్జీలు పెంచుతున్నప్పటికీ ఆర్టీ సీ కాంప్లెక్స్‌ల నిర్వహణ అధ్వానంగా ఉంది. గ్రామీణ జిల్లాలోని కాంప్లెక్స్‌ల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. జిల్లాలో 11 డిపోలు ఉండ గా 9 ప్రధాన కాంప్లెక్స్‌లు ఉన్నాయి. వీటిపా టు పలు మండల కేంద్రాల్లో కూడా కాంప్లెక్స్‌లు ఉన్నాయి. ముఖ్యంగా చోడవరం, అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం, పాడేరు, పాయకరావుపేట ఆర్టీసీ కాంప్లెక్సుల్లో ప్రయాణికుల అవస్థ చెప్పనలవి కాకుండా ఉంది. ప్రధానంగా మరుగుదొడ్ల సమస్య వేధిస్తోంది. వాటి నిర్వహణ దయనీయంగా ఉంది. నీటి సౌకర్యం లేక, పరిశుభ్రత కానరాక వాతావరణం బీభత్సంగా ఉంది. చోడవరంతోపాటు పలు కాంప్లెక్స్‌లలో మరుగుదొడ్లు దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. ప్రయాణికులు ముక్కుమూసుకొని కాంప్లెక్స్‌లో కూర్చోవాల్సి వస్తోం ది. ఇక మహిళా ప్రయాణికుల పరిస్థితి చెప్పనలవి కాకుండా ఉంది. కాంప్లెక్స్‌లను పూర్తిగా వ్యాపార దృక్పథంతో నిర్వహిస్తుండగా ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించాలన్న విషయాన్నే ఆర్టీసీ అధికారులు మరిచిపోయారు. బెంచీలు అరకొరగా ఉంటే, ఫ్యాన్లు ఎక్కడో ఒకటీఅరా కనిపిస్తాయి. వేసవిలో పరిస్థితి మరీ కలవరపరుస్తోంది. మంచినీటి సమస్య పీడిస్తోంది. కొన్ని చోట్ల కలుషిత నీటినే తాగునీటిగా సరఫరా చేస్తున్నారు. దీనివల్ల ప్రయాణికులు ఎక్కువ డబ్బు పోసి వాటర్ బాటిళ్లు, ప్యాకెట్లు కొనుక్కోవాల్సి వస్తోంది. కాంప్లెక్స్‌లలోని దుకాణాల్లో ధరల పరిస్థితి దారుణంగా ఉంటోంది. కాంప్లెక్స్‌ల వద్ద రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉండడంతో ప్రయాణికులు నానా బాధలు పడుతున్నారు. ఇన్ని సమస్యలు ఉన్నా ఆర్టీసీ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ప్రయాణికులు విమర్శిస్తున్నారు.