సాక్షి, మంచిర్యాల : సామాన్యుల కోసం చేపడుతున్న కార్యక్రమాలు అధికారులు, పాలకుల తీరుతో నీరుగారి పోతున్నాయి. లక్ష్యం నెరవేరడం మాట దేవుడెరుగు మొక్కుబడిగా సాగుతున్నాయి. ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా ప్రజలకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. గత నెల 23 నుంచి 30 వరకు జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో పారిశుధ్య వారోత్సవాలు జరిగాయి. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం కింద పనులు చేపడతామని పురపాలక వర్గాలు ప్రకటించాయి.
ఇందులో భాగంగా మురికి కాల్వలు శుభ్రం చేయడం, చెత్తను తొలగించడం, శివారు కాలనీల్లో మురుగునీటి వ్యవస్థను చక్కదిద్దడం, రోడ్ల వెంట చెత్తకుండీలు ఏర్పాటు చేయడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని ఆర్భాటంగా ప్రారంభించిన పురపాలకవర్గాలు ఆదిలో కొంత క్రియాశీలంగానే పనులు చేపట్టాయి. అయితే తర్వాత యథావిధిగా అలసత్వాన్ని ప్రదర్శించాయి. ప్రధాన ప్రాంతాల్లో నుంచి తొలగించిన చెత్త శివారు కాలనీల్లో వేయడంతో సదరు కాలనీ వాసులు ఈ తీరుపై నిరసన వ్యక్తం చేశారు.
మునిసిపాలిటీ వర్గాలతో వాదనలకు దిగిన ఘటనలు పలుచోట్ల జరిగాయి. పా రిశుద్ధ వారోత్సవాలతోపాటు సాధారణ సమయంలోనూ సేకరించిన చెత్తను మంచిర్యాల మున్సిపాలిటీ అధికారులు సమీపంలోని బైపాస్ రోడ్డులో పారబోసేవారు. స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం దాటిన తర్వాత ఉన్న నివాసాల సమీప స్థలం ఈ తంతుకు వేదికగా మారింది. ఈ వ్యవహారం స్థానికులను ఇబ్బందులకు గురిచేయడంతో వారు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఒకవైపు రోడ్డు చుట్టూ మొరం పోస్తూ, మొక్కలు నాటుతుంటే అదే రోడ్డుకు ఇవతల వైపు చెత్త పారబోయటం ఏంటని ప్రశ్నించారు.
శాశ్వత చెత్త డంపింగ్ యార్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలాఉంటే జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌తోపాటు వాణిజ్య కేంద్రమైన నిర్మల్‌లోనూ పారిశుధ్యం షరామామూలుగా అ ధ్వానంగానే ఉంది. మరో మూడు మున్సిపాలిటీల్లోనూ పారిశుద్ధ వా రోత్సవాల ఫలితంతో సదరు మున్సిపాలిటీలు పూర్తి స్థాయిలో బాగుపడ్డ దాఖలాలు లేవు. అదికారులను ఈ విషయమై సంప్రదించగా పారిశుధ్య వారోత్సవాల సమయంలో వరుసగా వచ్చిపడ్డ పలు పనుల ఒత్తిడిలతో పూర్తిస్థాయిలో దృష్టిపెట్టలేదని పేర్కొంటున్నారు.
శాశ్వత డంపింగ్‌యార్డులతో పరిష్కారం
తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు ఇటీవల పురపాలక వర్గాలతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో నీటి సరఫరాతోపాటు పారిశుధ్యం ముఖ్య అంశంగా చర్చకొచ్చింది. రాబోయే వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అదే సమయంలో శాశ్వత చెత్త డంపింగ్‌యార్డులు ఏర్పాటు చేసేందుకు స్థలాలను గుర్తించాలని అధికారులను సూచించారు. అయినా ఇప్పటికీ ఒకటి రెండు చోట్ల కూడా ఈ స్థల గుర్తింపు జరగలేదని తెలుస్తోంది. శాశ్వత డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసి, పారిశుధ్యం, చెత్త తరలింపుపై శ్రద్ధ తీసుకొని తమ ఇక్కట్లు తొలగించాలని పుర ప్రజలు కోరుకుంటున్నారు.
మొక్కుబడిగా పారిశుధ్య వారోత్సవాలు
Published Mon, Jul 28 2014 12:14 AM | Last Updated on Sat, Sep 2 2017 10:58 AM
Advertisement
Advertisement