చెత్త పాలేనా..!
మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ :
చెత్త సేకరణకు ఉపయోగించే రిక్షాలు, డంపర్‌బిన్‌లు మూలనపడ్డాయి. అయినా వాటి విషయమై పట్టించుకునే వారే కరువయ్యారు. పురపాలక సంఘంలోని కీలక విభాగమైన పారిశుధ్య విశాగం అధికారుల మెతక వైఖరి కారణంగా పారిశుధ్యం పడకేస్తోంది. గతంలో పట్టణంలో చెత్త సేకరణకు ట్రైసైకిళ్లు వినియోగించే వారు. వాటిని నాలుగేళ్ల క్రితం కొనుగోలు చేయగా.. ఇప్పుడు మరమ్మతుకు నోచుకోక ఒక్కొక్కటిగా మూలనపడుతున్నాయి. వాటి స్థానంలో కొత్తవీ కొనుగోలు చేయడం లేదు.
ఫలితంగా కార్మికులు చెత్త సేకరించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సైకిళ్ల ద్వారా సేకరించిన చెత్తను డంపర్ బిన్‌లో వేస్తారు. దీంతో కొన్ని డంపర్ బిన్‌లు తప్పు పట్టి స్క్రాప్‌లోకి వెళ్లాయి. మరికొన్ని ఆయా వార్డుల్లో రంధ్రాలు పడి దర్శనమిస్తున్నాయి. వాటిలో వేసిన చెత్త అంతా కింద పడిపోతోంది. ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించడం తప్పనిసరి కావడంతో పనికి రాకుండా పోయిన, తప్పు పట్టిన రిక్షాలను వాడే పరిస్థితి నెలకొంది. 32 వార్డుల్లో కనీసం ఒక్క వార్డుకైనా సరైన రిక్షా లేదు. కొన్ని సైకిళ్ల రేకులు, టైర్లు, ట్యూబ్‌లు పాడైపోయాయి. మరమ్మతుకు నోచుకోకపోవడంతో అవి నిరుపయోగంగా ఉన్నాయి. కొన్ని సైకిళ్లు, బండ్లు ఇప్పటికే స్క్రాప్ కింద విక్రయించారు.
కొత్త డంపర్ బిన్‌ల ఊసే లేదు..
ఐహెచ్‌డీపీ కింద 2009లో రూ.20 లక్షలతో 28 డంపర్ బిన్‌లు, ఒక డంపర్ ప్లేజర్ కొనుగోలు చేశారు. అదే ఏడాదిలో దాదాపు రూ.10 లక్షలతో అదనంగా డంపర్ బిన్‌లను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇందులో 13 డంపర్ బిన్‌లు ఉండగా.. ఇవి కూడా పూర్తిగా తుక్కు దశకు చేరాయి. ఇక మిగతా అన్నీ కూడా స్క్రాప్‌లోకి వెళ్లాయి. ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించేందుకు గాను 12వ ఆర్థిక సంఘం ప్రణాళిక కింద రూ.2.64 లక్షలతో కొనుగోలు చేసిన 22 మూడు చక్రాల సైకిళ్లు(రిక్షాలు) కూడా తుప్పుపట్టాయి. 32 వార్డుల్లో ఏర్పాటు చేసిన డంపర్‌బిన్‌ల పరిస్థితి అధ్వానంగా మారింది. ఐదేళ్లుగా కొత్తవి కొనుగోలు చేయడం లేదు. పట్టణం రోజు రోజుకు విస్తరిస్తుండగా మరో వైపు చెత్త కూడా విపరీతంగా పెరుగుతోంది. డంపర్‌బిన్లను నూతనంగా ఏర్పాటు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. డంపర్ బిన్‌లను మరమ్మతు చేసే వైపూ దృష్టి సారించడం లేదు. చెత్తకుప్పలతో దోమలు వృద్ధి చెంది దుర్వాసన వెదజల్లుతోంది. అధికారులు స్పందించి చెత్త సేకరణ రిక్షాలు, డంపర్‌బిన్‌లు ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.