కంపు.. ఆర్టీసీకి ఇంపు! | RTC Stench .. Agreeableness making! | Sakshi
Sakshi News home page

కంపు.. ఆర్టీసీకి ఇంపు!

Published Sat, Jan 11 2014 2:07 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM

RTC Stench .. Agreeableness making!

  •  కాంప్లెక్స్‌లలో దుర్గంధం కమ్ముకున్నా పట్టించుకోని యాజమాన్యం
  •  వేల మంది వస్తున్నా కనీస సౌకర్యాలు కరువు
  •  నిర్వహణలోపంతో పరిస్థితి దయనీయం
  •  
    చోడవరం,న్యూస్‌లైన్ : బస్సుల కోసం నిరీక్షించేవారికి అదనంగా, ఉచితంగా దుర్గంధం సరఫరా చేయాలన్నది ఆర్టీసీ ఆశయం కాబోలు.. జిల్లాలోని వివిధ డిపోల్లో అధ్వానపు మరుగుదొడ్ల ద్వారా ఆ పని విజయవంతంగా నెరవేరుస్తోంది. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే ఆర్టీసీ కాంప్లెక్స్‌లలో పరిస్థితి దుర్భరంగా ఉంది. ప్రయాణికుల నుంచి దండిగా డబ్బు వసూలు చేస్తున్న ఆర్టీసీ వారికి కనీస సౌకర్యాలు కల్పించడపై చూపడం లేదని అంతా మొత్తుకుంటున్నా పరిస్థితి యథావిధిగా కొనసాగుతోంది.

    జిల్లాలో ఏ ఆర్టీసీ కాంప్లెక్స్ అయి నా ఈ దయనీయ పరిస్థితికి అద్దం పడుతోం ది. ఏటికేడూ చార్జీలు పెంచుతున్నప్పటికీ ఆర్టీ సీ కాంప్లెక్స్‌ల నిర్వహణ అధ్వానంగా ఉంది. గ్రామీణ జిల్లాలోని కాంప్లెక్స్‌ల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. జిల్లాలో 11 డిపోలు ఉండ గా 9 ప్రధాన కాంప్లెక్స్‌లు ఉన్నాయి. వీటిపా టు పలు మండల కేంద్రాల్లో కూడా కాంప్లెక్స్‌లు ఉన్నాయి. ముఖ్యంగా చోడవరం, అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం, పాడేరు, పాయకరావుపేట ఆర్టీసీ కాంప్లెక్సుల్లో ప్రయాణికుల అవస్థ చెప్పనలవి కాకుండా ఉంది.

    ప్రధానంగా మరుగుదొడ్ల సమస్య వేధిస్తోంది. వాటి నిర్వహణ దయనీయంగా ఉంది. నీటి సౌకర్యం లేక, పరిశుభ్రత కానరాక వాతావరణం బీభత్సంగా ఉంది. చోడవరంతోపాటు పలు కాంప్లెక్స్‌లలో మరుగుదొడ్లు దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. ప్రయాణికులు ముక్కుమూసుకొని కాంప్లెక్స్‌లో  కూర్చోవాల్సి వస్తోం ది. ఇక మహిళా ప్రయాణికుల పరిస్థితి చెప్పనలవి కాకుండా ఉంది. కాంప్లెక్స్‌లను పూర్తిగా వ్యాపార దృక్పథంతో నిర్వహిస్తుండగా ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించాలన్న విషయాన్నే ఆర్టీసీ అధికారులు మరిచిపోయారు. బెంచీలు అరకొరగా ఉంటే, ఫ్యాన్లు ఎక్కడో ఒకటీఅరా కనిపిస్తాయి.

    వేసవిలో పరిస్థితి మరీ కలవరపరుస్తోంది. మంచినీటి సమస్య పీడిస్తోంది. కొన్ని చోట్ల కలుషిత నీటినే తాగునీటిగా సరఫరా చేస్తున్నారు. దీనివల్ల ప్రయాణికులు ఎక్కువ డబ్బు పోసి వాటర్ బాటిళ్లు, ప్యాకెట్లు కొనుక్కోవాల్సి వస్తోంది. కాంప్లెక్స్‌లలోని దుకాణాల్లో ధరల పరిస్థితి దారుణంగా ఉంటోంది. కాంప్లెక్స్‌ల వద్ద రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉండడంతో ప్రయాణికులు నానా బాధలు పడుతున్నారు. ఇన్ని సమస్యలు ఉన్నా ఆర్టీసీ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ప్రయాణికులు విమర్శిస్తున్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement