పేరుకే భాగ్యనగర్! అన్నీ అసౌకర్యాలే
► కంపుకొడుతున్న డ్రెయినేజీలు
► గతుకులమయమైన రోడ్డు
► ఫాగింగ్‌పై పట్టింపు కరువు
కరీంనగర్‌కల్చరల్: పేరు గొప్ప..ఊరు దిబ్బ అన్నట్టుగా ఉందీ ఆ ప్రాంత పరిస్థితి. స్మార్ట్‌సిటీలో భాగమైన 42వ డివిజన్ పరిధిలోని భాగ్యనగర్‌లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. ఆ ప్రాంతంలో రోజురోజుకు విషజ్వరాలు ప్రబలుతున్న పట్టించుకునే వారు కరువయ్యారు. డ్రెయినేజీలు లేక రోడ్డుపైనే మురుగునీరు పారుతున్న ఆ ప్రాంతం వైపు చూసేందుకు అధికారులు తీరడం లేదు. పారిశుధ్య నిర్వహణకే లక్షలు వెచ్చిస్తున్నామని గొప్పగా చెప్పుకునే కార్పొరేషన్ అధికారులకు భాగ్యనగర్‌ను చూస్తే వారి పనితీరు తెలిసిపోతుంది.
అధ్వానం
42వ డివిజన్ పరిధిలోని భాగ్యనగర్‌లో డ్రెయినేజీలు కనిపించవు. మురుగునీరు రోడ్డుపైనే ప్రవహించాల్సిందే. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆ కాలనీవాసుల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. దోమలు పెరిగి ఇప్పటికే పలువురు విషజ్వరాల బారిన పడ్డారు.
పత్తా లేని ఫాగింగ్
దోమల నివారణకు చేసే ఫాగింగ్ గురించి అధికారులు పట్టించుకోవడం లేదు. కాలనీలో చాలా ఖాళీ ప్లాట్లు ఉండడంతో విపరీతంగా చెట్లు పెరిగి దోమలు విజృంబిస్తున్నాయి. దోమల నివారణకు ఉపయోగపడే ఫాగింగ్ ఆరు నెలలుగా చేసిన దాఖలాలు లేవు. కనీసం దుర్వాసన వెదజల్లుతున్న ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లడం లేదు. ఇప్పటికైనా పారిశుధ్య నిర్వహణపై శ్రద్ధ తీసుకోవాలని భాగ్యనగర్ వాసులు కోరుతున్నారు.
భరించలేకపోతున్నం
తలుపు తెరిచిపెడితే మోరీల కంపు భరించలేకపోతున్నం. సాయంత్రం అయితే దోమలు. మోరీల నిండా పందులు. అధికారులకు ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకునే వారు కరువయ్యారు. ఇక్కడి కంటే ఊల్లె ఉండడమే మేలు. డ్రెయినేజీలు లేవు, రోడ్లు సరిగా లేవు. దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. – కాసనగొట్టు శ్రీధర్
దోమలతో వేగలేం
దోమలతో వేగలేకపోతున్నాం. వర్షాకాలం ప్రారంభమైందంటే చాలు భయమేస్తుంటుంది. చిన్నచిన్న గుంతల్లో వర్షపునీరు నిలిచి దోమలు పెరుగుతున్నాయి. పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి. రాత్రి నిద్రపోలేకపోతున్నాం. వెంటనే దోమల నివారణ చర్యలు చేపట్టాలి. పరిసరాలు కంపు వాసన వస్తున్నాయి.
– రామకృష్ణ
కంపుకొడుతున్నాయి
పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉంది. ఎక్కడికక్కడ మురికినీరు నిలిచి పరిసరాలు కంపుకొడుతున్నాయి. చాలా చోట్ల డ్రెయినేజీలు లేకపోవడంతో రోడ్డుపైనే మురుగునీరు ప్రవహిస్తుంది. నివాసాల మధ్యే మురుగునీరు చేరి దుర్వాసన వస్తుంది. ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు.
–జి.సబిత