
రూ. 10 కోట్లతో దేవరాజ్ అరస్ ‘శతజయంతి
ముఖ్యమంత్రి అధ్యక్షతన సమీక్ష సమావేశం
బెంగళూరు: ఈ నెల 20న దేవరాజ్ అరస్ శత జయంతి నిర్వహించనున్న నేపథ్యంలో ఏడాది పాటు దేవరాజ్ అరస్ శత జయంతి ఉత్సవాలను నిర్వహించేందుకు గాను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన సోమవారమిక్కడి విధాన సౌధలో నిర్వహించిన ఉన్నతస్థాయి అధికారుల సమావేశంలో అంగీకారం లభించింది. ఈ ఉత్సవాల నిర్వహణకు గాను రూ.10కోట్లను కేటాయించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ నెల 20న దేవరాజ్ అరస్ సొంతగ్రామమైన మైసూరు జిల్లాలోని హుణసూరు తాలూకా కల్లహళ్లి గ్రామంలో శతజయంతి ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభంకానున్నాయి. ఈ నేపధ్యంలో కల్లహళ్లి గ్రామాన్ని ‘మోడల్ విలేజ్’గా తీర్చిదిద్దేందుకు సైతం ఈ సమావేశంలో నిర్ణయించారు. అంతేకాక దేవరాజ్ అరస్ బెంగళూరు నగరంలో ఎక్కువ రోజులు గడిపిన బాలబ్రూహి భవనంలో దేవరాజ్ అరస్ సాధనలను ప్రతిబింబించేలా ఒక మ్యూజియంను ఏర్పాటు చేయనున్నారు.
దేవరాజ్ అరస్ పరిశోధనా సంస్థను స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా మార్చేందుకు గా ను రూ.2.5కోట్ల మొత్తాన్ని కేటాయించనున్నారు. ఆకాశవాణిలో అరస్ చేసిన ప్రసంగాలన్నింటిని సేకరించి వాటిని ఓ సీడీ రూపంలోకి తీసుకురానున్నారు. ఇక దేవరాజ్ అరస్ బాల్యం నుంచి ఆయన చని పోయే వరకు సేకరించిన ఛాయాచిత్రాలతో పాటు ఆయన జీవితంపై కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో పుస్తకాన్ని ముద్రించనున్నారు. ఈ పుస్తకాన్ని హిందీ, ఉర్దు, తమిళం, తెలుగు, మళయాళం, బెంగాలి భాషల్లోకి అనువదించనున్నారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రులు హెచ్.ఆంజనేయ, కె.జె.జార్జ్, టి.బి.జయచంద్ర తదితరులు పాల్గొన్నారు.