ఆర్‌బీఐ జోక్యంతో రూపాయి రికవరీ
ముంబై: రూపాయి మారకం విలువ మంగళవారం చాలా నాటకీయ పరిణామాలకు లోనైంది. ఇంట్రాడేలో మరో కొత్త రికార్డు కనిష్ట స్థాయి 61.80కి పడిపోయి.. అంతలోనే మళ్లీ కోలుకుని, 11 పైసల లాభంతో 60.77 వద్ద ముగిసింది. ఆర్‌బీఐ జోక్యం చేసుకోవడం, చివర్లో ఎగుమతిదారులు భారీగా డాలర్లను విక్రయించడం రూపాయి రికవరీకి తోడ్పడిందని ఫారెక్స్ డీలర్లు తెలిపారు.
మంగళవారం ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు.. 60.88తో పోలిస్తే బలహీనంగా 61.05 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడంతో ఒక దశలో కొత్త రికార్డు కనిష్టమైన 61.80కి కూడా పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే దేశీ కరెన్సీ జూలై 8న చివరిసారిగా 61.21 కనిష్ట స్థాయిని (ఇంట్రాడే) తాకింది. తాజాగా ట్రేడింగ్ ముగిసే సమయానికి రూపాయి 11 పైసల లాభంతో 60.77 వద్ద క్లోజయ్యింది.
అమెరికాలో రికవరీ సంకేతాలతో ఫెడరల్ రిజర్వ్ సహాయక ప్యాకేజీలను ఉపసంహరించవచ్చన్న ఆందోళనలు మరోసారి తలెత్తడం సైతం ఈ పరిణామానికి దారితీశాయని ధన్‌లక్ష్మి బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (ట్రెజరీ) శ్రీనివాస రాఘవన్ చెప్పారు. అమెరికా పరిణామాలపై ఎక్కువగా ఆధారపడటమనేది దేశీ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. చివర్లో ప్రభుత్వరంగ బ్యాంకుల ద్వారా ఫారెక్స్ మార్కెట్లలో ఆర్‌బీఐ జోక్యం చేసుకుని ఉండొచ్చని, తద్వారా రూపాయి కోలుకుని ఉండగలదని అల్పరీ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఇండియా) సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ తెలిపారు. ప్రతికూల సెంటిమెంట్ కారణంగా రూపాయి రానున్న రోజుల్లో 62 స్థాయికి క్షీణించగలదని ఆయన చెప్పారు.
రూపాయి స్థిరత్వానికి చర్యలు: చిదంబరం
రూపాయి పతనాన్ని కట్టడి చేసేందుకు, దేశీ కరెన్సీని స్థిరపర్చేందుకు ప్రభుత్వం, ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం రాజ్యసభకు తెలిపారు. కరెంటు ఖాతా లోటు (క్యాడ్) పెరుగుతుండటానికి, రూపాయి పతనానికి దారితీస్తున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం సమీక్షిస్తోందని వివరించారు. మరోవైపు, ముడిచమురు, బంగారం దిగుమతుల వల్లే క్యాడ్ పెరుగుతోందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి నమో నారాయణ్ మీనా తెలిపారు. ఎగుమతులను ప్రోత్సహించడం, దిగుమతులు తగ్గించడం ద్వారా క్యాడ్‌ను కట్టడి చేసేందుకు పలు చర్యలు ఇప్పటికే తీసుకున్నట్లు పేర్కొన్నారు.
రూపాయి క్షీణతను అడ్డుకునే దిశగా స్వల్పకాలికమైన దిద్దుబాటు ప్రయత్నాలను కూడా చేయాలని ప్రధాని ఆర్థిక సలహా మండలి పీఎంఈఏసీ చైర్మన్ సి. రంగరాజన్ సూచించారు. ఫారెక్స్ మార్కెట్లో స్పెక్యులేషన్ కార్యకలాపాలను నియంత్రించాలని ఆయన చెప్పారు. రూపాయి స్థిరత్వానికి మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారు రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. డాలరు బలపడుతున్న నేపథ్యంలో రూపాయే కాకుండా మిగతా దేశాల కరెన్సీలు కూడా క్షీణిస్తున్నాయని వివరించారు.