9 నిమ్మకాయలు 68 వేల రూపాయలు!
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని మురుగన్ ఆలయంలో నిర్వహించిన వేలం పాటలో 9 నిమ్మకాయలు రూ. 68,100 పలికాయి. విల్లుపురం జిల్లా ఒట్టనందల్ గ్రామంలోని పురాతన రత్నవేల్ మురుగన్ ఆలయంలో ఏటా 10 రోజుల పాటు కావడి ఉత్సవాలను నిర్వహిస్తారు. 11వ రోజు అర్ధరాత్రి ముగింపు కార్యక్రమంలో పది రోజుల పాటు మురుగన్ వద్ద శూలానికి గుచ్చి ఉంచే 9 నిమ్మకాయలను వేలం వేస్తారు.
మంగళవారం జరిగిన ఈ వేలం పాటలో తొలి నిమ్మకాయను రూ. 27 వేలకు ఓ భక్తుడు కొన్నాడు. 2, 3 నిమ్మకాయలు రూ.6 వేలు, నాలుగోది రూ.5,800, ఐదోది రూ.6,300, ఆరోది రూ. 5 వేలు, 7వది రూ. 5,600, ఎనిమిదోది రూ. 3,700, తొమ్మిదోది రూ. 2,700లకు కొనుగోలు చేశారు. ఈ నిమ్మకాయను దక్కించుకున్న వ్యక్తి భార్య మరుసటి రోజు గింజలతో తిన్నట్లయితే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం.