అన్ని రంగాల్లో దూసుకెళ్లాలి
చెన్నై : పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్లాలని టెన్నిస్ స్టార్ సానియా మిర్జా పిలుపునిచ్చారు. శుక్రవారం ఈ స్టార్ కోయంబత్తూరులో ప్రత్యక్షమయ్యారు. వర్ణం ఫౌండేషన్ నేతృత్వంలో మై ఇండియా, వంద శాతం ఓటింగ్ నినాదంతో మారథాన్‌ను కోయంబత్తూరులో నిర్వహించారు. కోయంబత్తూరు కొడిసియా మైదానం నుంచి సాగిన ఈ మారథాన్‌కు వేలాది మంది తరలి వచ్చారు.
విజేతలకు బహుమతులు ప్రదానోత్సవం సమయంలో హఠాత్తుగా అక్కడ టెన్నిస్ స్టార్ సానియా మిర్జా ప్రత్యక్షం కావడంతో అక్కడి జన సందోహం ఆమెను చూడడానికి ఎగబడ్డారు. విజేతలకు బహుమతులు అందజేసినానంతరం మహిళల్ని ఉద్దేశించి సానియా ప్రసంగించారు. మహిళలకు వ్యాయామం తప్పని సరిగా సూచించారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి మహిళ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు దూసుకెళ్లాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆస్ట్రేలియా, యూఎస్, వింబుల్డన్ విజయం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. డబుల్స్ ఆడేటప్పుడు సహ క్రీడాకారిణిని స్నేహితురాలిగా భావించి, సంపూర్ణ సహకారం అందించిన పక్షంలో విజయం వరించడం ఖాయం అని వ్యాఖ్యానించారు.
సంవత్సరంలో ముప్పై వారాలు టెన్నిస్ ఆడుతున్నామని పేర్కొంటూ, యూఎస్ ఓపెన్‌కు సిద్ధమవుతున్నట్టు చెప్పారు. క్రికెట్‌కు ఇస్తున్నట్టుగా ఇతర క్రీడలకు ప్రాధాన్యత పెరుగుతున్నదని వివరిస్తూ, దేశానికి చెందిన క్రీడాకారులతో డబుల్స్ ఆడడం అన్నది కాలం నిర్ణయిస్తుందని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువ శాతం మహిళలు క్రీడా రంగంలో రాణించాలని, ఆ దిశగా తన పయనం సాగుతుండడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు.