చెలి కోసం నెచ్చెలి పూజలు
రాష్ట్ర ముఖ్యమంత్రి జే జయలలిత నెచ్చలి శశికళ బుధవారం ఉదయాన్నే కృష్ణగిరి జిల్లాలోని అటవీ గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం లో ప్రత్యక్షం అయ్యారు. కొబ్బరి కాయలు చేత బట్టి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆంజనేయుడికి ప్రత్యేకంగా కొబ్బరి కాయలతో మొక్కులు చెల్లించారు. అన్నాడీఎంకే అధినేత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి జె జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ బంధం దాదాపు 30 ఏళ్లు పైమాటే. జయలలిత ఎక్కడికి వెళ్లినా వెన్నంటి శశికళ ఉంటారు. జయలలితకు ఏ మేరకు గౌరవాలు, విలువలు దక్కుతాయో అవన్నీ ఆమెకూ దక్కాల్సిందే.
జయలలితకు నీడలా ఉంటూ వచ్చిన శశికళకు రెండేళ్ల క్రితం చేదు అనుభవం ఎదురైంది. పోయేస్ గార్డెన్ నుంచి ఆమెను గెంటివేయడంతో ఇక జయ-శశి బం ధానికి కాలం చెల్లినట్టే సర్వత్రా భావించారు. అయితే, కొందరు మాత్రం ఇది వారికి కొత్తేమీ కాదన్నట్టుగా వ్యాఖ్యానించారు. అదే సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు ఇక, వీరిద్దరి మధ్య అగాథం పెంచినట్టేనన్న భావన ప్రతి ఒక్కరి మదిలోనూ నెలకొంది. అయి తే, ఈ అగాథం వెనుక భారీ కుట్ర వెలుగు చూసింది.
ఈ పరిస్థితుల్లో బాధనంతా ఏకరువు పెడుతూ కన్నీరు మున్నీరై మనసులోని మాటను తలైవికి చేరవేస్తున్నట్లు ఓ లేఖాస్త్రం మీడియాకు శశికళ విడుదల చేశారు. అం దులో ‘ఆనమీర గలనా... జయ సఖి’ అంటూ తప్పొప్పులు తానెరుగనని, అంతా ఎవరో చేసి తనపై వేశారని, తనకు ప్రాణస్నేహితురాలు జయను ప్రేమిం చటం తప్ప వేరే ప్రపంచమే తెలియదన్న విషయాన్ని కుండబద్దలు కొట్టారు. ఇక తన జీవితం జయలలిత సేవకే అంటూ ప్రకటించారు. దీంతో కరిగిపోయిన పురట్చి తలైవి మళ్లీ పోయేస్ గార్డెన్‌లో శశికళకు చోటు ఇచ్చారు. ఆ నాటి నుంచి జయలలితకు మళ్లీ నీడలా ఉంటూ వస్తున్న శశికళ తన చెలిని ప్రధానిగా చూడాలన్న తపనతో ఉంటున్నారు.
ఆలయ బాట
తాము కేసుల నుంచి నిర్దోషులుగా బయట పడాలని, జయలలిత అత్యున్నత స్థానంలో ఉండాలని కాంక్షిస్తూ నెచ్చెలి శశికళ ఆలయాల బాట సైతం పట్టారు. గత ఏడాది రాష్ర్టంలోని అన్ని ప్రధాన ఆలయాలను ఆమె రహస్యంగా సందర్శించారు. ఈ ఆలయ బాట పట్టేం దుకు చెన్నై కోటూరు పురంలోని బొజ్జగణపయ్య ఆల యంలో జయలలితతో కలసి పూజలను సైతం నిర్వహించారు. ఆ తర్వాత ఓమారు తిరుచ్చిలో జయలలిత కలసి ఆలయ దర్శనానికి వెళ్లిన శశికళ బుధవారం ఉదయాన్నే కృష్ణగిరిలోని ఓ అటవీ గ్రామంలో ఉన్న ఆలయంలో ప్రత్యక్షం కావడం ప్రాధాన్యతను సంతరించుకునేలా చేసింది. పవిత్ర క్షేత్రాలన్నీ సందర్శించి ప్రత్యేక పూజలను శశికళ చేసి ఉన్నారు.
చిన్నమ్మ పూజలు
జయలలిత అత్యున్నత స్థానంలో కూర్చోవాలని కలలు కంటున్న శశికళ తన కోరికను తీర్చాలంటూ ఆంజనేయస్వామిని వేడుకున్నారు. 40 లోక్‌సభ స్థానాలు చేజిక్కించుకుని పీఎం సింహాసనంలో కూర్చోవాలని జయలలిత తపన పడుతుండటం, ఆమె కలను నెరవేర్చడం లక్ష్యంగా ఎన్నికలకు ముందు రోజు ఈ ఆల యాన్ని శశికళ సందర్శించినట్టుందన్న ప్రచారం సాగుతోంది. కృష్ణగిరి జిల్లా నయాన్ పారై సమీపంలోని అటవీ గ్రామంలో కాట్టు ఆంజేయ స్వామి ఆలయం ఉంది. ఇక్కడ ప్రతి శని వారం, పౌర్ణమి పర్వదినాన ప్రత్యేక పూజాధి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇక్కడ కొబ్బరికాయను కొట్టడం ఉండదు.
కొబ్బరికాయను ఓ సంచిలో పెట్టి ఆలయ ప్రద క్షిణ చేస్తే, కోరిన కోరికలు నెరవేరుతాయన్నది భక్తుల నమ్మకం. ఈ ఆలయం గురించి శశికళ తెలుసుకున్నట్టుంది. ఉదయాన్నే చెన్నై నుంచి రోడ్డు మార్గంలో కృష్ణగిరి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఆలయానికి వెళ్లిన ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొబ్బరి సంచిని చేత బట్టి ఆలయం చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేశారు. పూజాది కార్యక్రమాల అనంతరం ఆగమేఘాలపై చెన్నైకు ఆమె తిరుగు పయనం అయ్యారు. శశికళ వెంట ఓ మహిళ, మరో ముగ్గురు ఉన్నట్టు ఆలయ వర్గాలు పేర్కొంటున్నాయి. బెంగళూరు కోర్టులో సాగుతున్న విచారణ తుది దశకు చేరిన దృష్ట్యా, అందులో నుంచి నిర్దోషులుగా బయట పడాలని, జయలలిత ప్రధాని కావాలని ఆమె పూజలు చేశారు.