సాక్షి, ముంబై: ఈసారి కాంగ్రెస్, ఎన్సీపీ మిత్రపక్షాలుగా బరిలోకి దిగడం దాదాపు అసాధ్యమేనని అందరూ అనుకుంటున్న తరుణంలో రాజకీయాల్లో రాటుదేలిన శరద్ పవార్ రంగప్రవేశం చేసి పొత్తుకు శుభం పడేలా చూశారు. రాజకీయాల్లో ‘మహా’ నాయకుడినని మరోసారి నిరూపించారు. రాజకీయ చదరంగంలో ఎవరిని ఎక్కడ ఉంచాలో..? ఎవరిని ఎలా ఒప్పించాలో తెలిసిన పవార్ కాంగ్రెస్‌తో పొత్తును కొనసాగేలా చూడటంతో పాటు పాత ఫార్ములా ప్రకారమే ఒప్పించేలా చేయడంలో సఫలీకృతులయ్యారు.
గత కొంతకాలంగా కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య లోక్‌సభ సీట్ల పంపకాలపై వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎన్సీపీ బలం తగ్గిందంటూ, దీంతో లోక్‌సభ ఎన్నికల్లో పాత ఫార్ములాతో (కాంగ్రెస్ 26-ఎన్సీపీ 22) కాకుండా కాంగ్రెస్ 29, ఎన్సీపీ 19 సీట్లలో పోటీ చేయాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తోపాటు ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రేతోపాటు ప్రముఖ కాంగ్రెస్ నాయకులు పట్టుబట్టారు. అయితే ఎన్సీపీ మాత్రం ససేమిరా అని కొట్టిపడేసింది. కాంగ్రెస్‌పై అనేక ఆరోపణలు చేసింది. రాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు బాస్కర్ జాదవ్ కాంగ్రెస్‌కు తీవ్ర విమర్శలు చేశారు.
ఇవన్నీ జరిగిన అనంతరం కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ పర్యవేక్షణలో ఈసారి లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయని, అవసరమైతే ఎన్సీపీతో తెగదెంపులు చేసుకుని ఒంటరిగా కాంగ్రెస్ బరిలోకి దిగుతుందన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే రాజకీయ చదరంగంలో ఉన్నత స్థానంలో ఉన్న శరద్‌పవార్ మాత్రం సోనియాగాంధీ, అహ్మద్ పటేల్‌ను ముందుకు తీసుకువచ్చారు. కాంగ్రెస్‌ను ఒక మెట్టు వెనక్కి తగ్గేలా చేసి తన పంథాన్ని నెగ్గించుకున్నారు. ఎట్టకేలకు కాంగ్రెస్ 26, ఎన్సీపీ 22 సీట్లతో పాత ఫార్ములాతోనే పోటీచేసేందుకు అంగీకరించింది.
సీట్ల మార్పులు ఎలా ఉంటాయో..?
సీట్ల పంపకాల ఘట్టం పూర్తి అయినప్పటికీ నియోజకవర్గాల కేటాయింపు మార్పులపై మళ్లీ వివాదాలు తలెత్తే అవకాశాలున్నాయి. అనేక సీట్లపై ఇరు కాంగ్రెస్‌ల మధ్య సయోధ్య కుదరడం లేదు. దీంతో సీట్ల పంపకాలు ఎలా ఉంటాయోనని ఇరు కాంగ్రెస్‌ల నాయకులు అయోమయానికి గురవుతున్నారు. పొత్తు కుదరడంపై ఆనందం వ్యక్తం చేస్తున్న ఎన్సీపీ కొన్ని స్థానాల్లో సీట్ల మార్పులు చేసుకోవాలని భావిస్తోంది.
ఈ నేపథ్యంలో అనుకూలమైన సీట్లను మార్పు చేసుకోవడంలో ఎవరు సఫలీకృతమవుతారోనన్నది ఆసక్తికరంగా మారింది. హాతకణంగలే, రావేర్ లోక్‌సభ నియోజకవర్గాలను కాంగ్రెస్‌కు కట్టబెట్టాలని అనుకుంటున్న ఎన్సీపీ రాయ్‌గఢ్‌ను మాత్రంతమ వద్ద ఉంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. మరోవైపు కాంగ్రెస్ సీట్లలో ఎలాంటి మార్పులు చేసినప్పటికీ కొల్హాపూర్‌ను మాత్రం విడిచిపెట్టొద్దనే నిర్ణయానికి ఎన్సీపీ వచ్చింది.
శరద్ ‘పవర్’ చూపించారు
Published Tue, Feb 11 2014 11:34 PM | Last Updated on Fri, Oct 19 2018 8:23 PM
Advertisement