సాక్షి, ముంబై : పాకిస్తాన్, ఆస్ట్రేలియాలో ఇటీవల ఉగ్రవాదులు దాడులు నిర్వహించడంతో మేల్కొన్న పోలీసులు నగరంలో న్యూఇయర్ వేడుకలు సురక్షితంగా జరుపుకునేందుకు కట్టుదిట్టమైన భద్రతను నెలకొల్పనున్నారు. నగరంలో అత్యంత రద్దీ ప్రాంతాలైన గేట్‌వే ఆఫ్ ఇండియా, మెరీన్‌డ్రైవ్, జుహూ, మార్వే బీచ్‌లలో దాదాపు 1,000 మంది పోలీసులను మోహరించనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.
స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (ఎస్‌ఆర్‌పీఎఫ్) నుంచి ఇందుకు గాను సహాయం తీసుకున్నారు. సౌత్ ముంబైలోని తాజ్, హిల్టన్ హోటళ్ల పరిసరాల్లో బ్యారికేడ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ పరిసర ప్రాంతాల్లో వాహనాలను నిషేధించనున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైం) ధనుంజయ్ కులకర్ణి మాట్లాడుతూ.. డిసెంబర్ అర్ధరాత్రి నుంచి నగరంలోని కొత్త ఏడాది పార్టీలు జరిగే ప్రాంతాల్లో అధిక సంఖ్యలో లైట్లు వెలుగే విధంగా చర్యలు తీసుకోవాలని బీఎంసీని కోరామన్నారు. పార్టీ స్థలలో తాము నైట్ విజన్‌తో కూడిన సీసీటీవీ కెమరాలను అమర్చనున్నట్లు తెలిపారు.
ముఖ్యంగా సౌత్ ముంబైలో భద్రతాదళాలను అధిక సంఖ్యలో మోహరిస్తామని కులకర్ణి తెలిపారు. గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద మహిళలకు, కుటుంబాలకు ప్రత్యేక ప్రవేశ-నిష్ర్కమణ ద్వారాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో బ్యాగులు, వాటర్ బ్యాటిళ్లను పోలీసులు నిషేధించనున్నారు. వివిధ స్మారక చిహ్నాల వద్ద ఇంతకు ముందే మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశామని, న్యూ ఇయర్ రోజు కూడా ఆయా స్మారక చిహ్నాల వద్ద ఏర్పాటు చేసిన మెటల్ డిటెక్టర్ల నుంచి వెళ్లాల్సి ఉంటుందని కులకర్ణి తెలిపారు.
భద్రతలో భాగంగా కొంత మంది మఫ్టీలో విధులు నిర్వహించనున్నారన్నారు. క్రైం బ్రాంచ్ అధికారులు కూడా నూతన వత్సర రోజు ఎలాంటి ఇబ్బందులు చోటుచేసుకోకుండా అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై గట్టి నిఘా ఉంచనున్నారు. కొన్ని హోటళ్లకు 31వ తేదీ అర్ధరాత్రి 1.30 నుంచి ఉదయం 5 గంటల వరకు తెరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. అయితే వైన్ దుకాణాలను రాత్రి ఒంటి గంట వరకు మాత్రమే అనుమతించారు. ఈ నిర్ణయాన్ని పలు హోటళ్లు స్వాగతించాయి. డిసెంబర్ 31 మధ్య రాత్రి వరకు సంగీతానికి అనుమతి ఉందని కులకర్ణి వివరించారు.
‘వేడుక’లకు భద్రత కట్టుదిట్టం
Published Thu, Dec 25 2014 10:38 PM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM
Advertisement