- మంత్రి ఉమాశ్రీ
- మహిళా ఖైదీలను గౌరవించాలి - ఎమ్మెల్సీ తార
బెంగళూరు: పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న మహిళ ఖైదీలపై ఎటువంటి లైంగిక వేధింపులు జరగలేదని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉమాశ్రీ స్పష్టం చేశారు. శనివారం ఆమె పరప్పన అగ్రహార జైలును సందర్శించి మహిళా ఖైదీల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రి జైలు బయట విలేకరులతో మాట్లాడారు. తాను మహిళ ఖైదీలతో ప్రత్యేకంగా మాట్లాడానని, ఏ ఒక్కరూ కూడా లైంగిక వేధింపులు జరిగినట్లు చెప్పలేదన్నారు. వేధింపులపై న్యాయమూర్తికి లేఖ అందిందని, ఆ లేఖ ఎవరు రాశారనే దానిపై విచారణ చేయాలని హోం మంత్రి జార్‌జ ఆదేశాలు జారీ చేశారని మంత్రి గుర్తు చేశారు.
మహిళలను గౌరవించాలి : ఎమ్మెల్సీ తార
బీజేపీ నాయకురాలు, బహుబాష నటి, ఎంఎల్‌సీ తార శనివారం పరప్పన అగ్రహార జైలు చేరుకుని మహిళ ఖైదీలతో కలిసి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆనంతరం తార బయటకు వచ్చి విలేకరులతో మాట్లాడారు. తెలిసీ తెలియక నేరం చేసి శిక్ష అనుభవిస్తున్న మహిళలను సాటి ఖైదీలు, జైలు సిబ్బంది గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. మహిళ ఖైదీలపై లైంగిక వేధింపులు జరిగాయని ఆరోపణలు వచ్చాయని, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళ ఖైదీలను లైంగిక వేధింపులకు గురి చేశారని దర్యాప్తులో బయటపడితే కఠిన చర్యలు తీసుకుంటామని బెంగళూరు నగర పోలీసు అధికారులు హెచ్చరించారు.