Umasri
-
వీరి బొమ్మ హిట్టా.. ఫట్టా?
సాక్షి, బెంగళూరు: పలువురు సినీ ప్రముఖులు కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. మంత్రి ఉమాశ్రీ, జగ్గేశ్, సాయికుమార్, శశికుమార్, బీసీ పాటిల్, సీపీ యోగేశ్వర్, మధు బంగారప్ప, కుమార బంగారప్ప, నిర్మాత కుమారస్వామి, సీఆర్ మనోహర్, మునిరత్న నాయుడు తదితరులు వీరిలో ఉన్నారు. వీరి రాజకీయ చిత్రం హిట్ అవుతుందా..? తుస్సుమంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ► సీనియర్ నటి, ప్రస్తుత మంత్రి ఉమాశ్రీ కాంగ్రెస్ టికెట్‌పై తెరదాళ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. గతంలోనూ ఆమె పోటీ చేసి విజయం సాధించారు. ► తెలుగు వారికి ఎంతో సుపరిచితుడయిన నటుడు సాయికుమార్. ఆయన బీజేపీ తరఫున తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న బాగేపల్లి నుంచి బరిలో ఉన్నారు. ► మాజీ ముఖ్యమంత్రి ఎస్.బంగారప్ప ఇద్దరు కుమారులు కుమార బంగారప్ప, మధు బంగారప్పలు కూడా పలు కన్నడ చిత్రాల్లో హీరోలుగా రాణించారు. ప్రస్తుతం కుమార బీజేపీ నుంచి, మధు జేడీఎస్ పార్టీల నుంచి సొరబ నియోజకవర్గంలో ముఖాముఖి తలపడుతుండటం విశేషం. ► ప్రముఖ నటుడు శశికుమార్ కాంగ్రెస్ టికెట్‌పై మాళకాల్మురు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే, కాంగ్రెస్ ఆయనకు టికెట్ నిరాకరించడంతో ఇటీవలే జేడీఎస్ తీర్థం పుచ్చుకుని, హోసదుర్గలో బరిలో దిగారు. ► గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన నటుడు జగ్గేశ్ ప్రస్తుతం బెంగళూరు యశ్వంతపుర నుంచి బీజేపీ టికెట్‌పై ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సినిమా రంగంలో వొక్కళిగ వర్గానికి చెందిన వాడు కావడంతో ఆ వర్గం ఓటర్లను బాగానే ప్రభావితం చేయగలరని బీజేపీ ఆశిస్తోంది. ► నటుడు బీసీ పాటిల్ కాంగ్రెస్ తరఫున హిరేకెరూరు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడే ఓటమి పాలయ్యారు. దీంతో ఈ సారి ఎలాగైనా గెలిచి తీరాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. ► నటుడు, రాజకీయ నేత సీపీ యోగేశ్వర్ చన్నపట్టణ నియోజవర్గం నుంచి జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామిపై పోటీలో దిగారు. ► చలన చిత్ర రంగం, టీవీ సీరియల్లలో నటునిగా పేరు పొందిన నె.ల.నరేంద్ర బాబు ఈసారి బీజీపీ అభ్యర్థిగా మహాలక్ష్మి లేఔట్లో పోటీ చేస్తున్నారు. గతంలో రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ► సినీ నిర్మాత మునిరత్న నాయుడు రాజరాజేశ్వరి నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్‌తో పోటీ చేస్తున్నారు. ► అయితే, రెబెల్ స్టార్ అంబరీష్ ఆశ్చర్యకరంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. -
మహిళా ఖైదీలపై లైంగిక వేధింపులు అబద్ధం
మంత్రి ఉమాశ్రీ మహిళా ఖైదీలను గౌరవించాలి - ఎమ్మెల్సీ తార బెంగళూరు: పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న మహిళ ఖైదీలపై ఎటువంటి లైంగిక వేధింపులు జరగలేదని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉమాశ్రీ స్పష్టం చేశారు. శనివారం ఆమె పరప్పన అగ్రహార జైలును సందర్శించి మహిళా ఖైదీల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రి జైలు బయట విలేకరులతో మాట్లాడారు. తాను మహిళ ఖైదీలతో ప్రత్యేకంగా మాట్లాడానని, ఏ ఒక్కరూ కూడా లైంగిక వేధింపులు జరిగినట్లు చెప్పలేదన్నారు. వేధింపులపై న్యాయమూర్తికి లేఖ అందిందని, ఆ లేఖ ఎవరు రాశారనే దానిపై విచారణ చేయాలని హోం మంత్రి జార్జ ఆదేశాలు జారీ చేశారని మంత్రి గుర్తు చేశారు. మహిళలను గౌరవించాలి : ఎమ్మెల్సీ తార బీజేపీ నాయకురాలు, బహుబాష నటి, ఎంఎల్సీ తార శనివారం పరప్పన అగ్రహార జైలు చేరుకుని మహిళ ఖైదీలతో కలిసి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆనంతరం తార బయటకు వచ్చి విలేకరులతో మాట్లాడారు. తెలిసీ తెలియక నేరం చేసి శిక్ష అనుభవిస్తున్న మహిళలను సాటి ఖైదీలు, జైలు సిబ్బంది గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. మహిళ ఖైదీలపై లైంగిక వేధింపులు జరిగాయని ఆరోపణలు వచ్చాయని, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళ ఖైదీలను లైంగిక వేధింపులకు గురి చేశారని దర్యాప్తులో బయటపడితే కఠిన చర్యలు తీసుకుంటామని బెంగళూరు నగర పోలీసు అధికారులు హెచ్చరించారు. -
అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించిన మంత్రి
సాక్షి, బళ్లారి: రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, కన్నడ సంస్కృతీ శాఖ మంత్రి ఉమాశ్రీ బళ్లారి నగరం, తాలూకాలోని అంగన్వాడీ కేంద్రాలు, చిన్నారులకు పౌష్టికాహారం సరఫరా చేసే పలు గోడౌన్లను పరిశీలించారు. మంగళవారం ఆమె బెంగళూరు నుంచి బళ్లారికి విచ్చేసి బళ్లారి తాలూకాలోని మోకా గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారులతో కాసేపు గడిపి వివరాలు సేకరించారు. అటెండెన్స్ జాబితాలో ఉన్న ప్రకారం చిన్నారులు ఉన్నారో లేదో లెక్కకట్టారు. చిన్నారులకు మెనూ ప్రకారం అన్ని రకాల పౌష్టికాహారం అందిస్తున్నారో లేదో తెలుసుకున్నారు. గర్భిణులకు అందించే పౌష్టికాహారం అంగన్వాడీ కేంద్రాలకు సం బంధించిన వారు స్వాహా చేస్తున్నారని ఫిర్యాదులు చేయడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా అంగన్వాడీ కేంద్రాల వద్ద చిన్నారుల నుంచి నేరుగా వివరాలు సేకరించిన తర్వాత పౌష్టికాహారం అందించే గోడౌన్ల వద్దకు వెళ్లి పరిశీలించారు. మోకా, బళ్లారి నగరంలోని హవంబావి వద్ద ఉన్న గోడౌన్లను పరిశీలించి మంత్రి అవాక్కయ్యా రు. గోడౌన్ల నిండా వేరుశనగ, పెసర, శనగ బేడలు, బెల్లం తదితరాలు ప్యాకెట్లలో ఉంచి నేరుగా అంగన్వాడీలకు సరఫరా చేస్తున్నట్లు కళ్లారా చూశారు. ఇలా అంగన్వాడీ కేంద్రాలకు నెల కా దు రెండు నెలలు కాదు ఏకంగా మూ డు సంవత్సరాల నుంచి ఇదే తరహాలో సరఫరా చేస్తున్నారని, అక్కడ పని చేస్తున్న సిబ్బంది ద్వారా తెలుసుకుని మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారులు పొడి చేయకుండా గింజలు నేరుగా సరఫరా చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. పెసలు, శనగలు, గోధుమలు, బెల్లం, వేరుశనగ విత్తనాలు బాగా పిండి చేసిన తర్వాత చిన్నారులకు అందిస్తే పౌష్టికాహారం అందించినట్లు అవుతుందని గుర్తు చేశారు. మూడు సంవత్సరాలుగా నిర్లక్ష్యంగా పని చేస్తూ, ఇప్పుడు తాను పరిశీలించిన తర్వాత చేస్తామంటున్నారంటూ మండిపడ్డారు. చిన్నారులు పౌష్టికాహారం కోసం ప్రభుత్వం ఎన్నో నిధులు వెచ్చించి అన్ని రకాలుగా పౌష్టికాహార పదార్థాలు సరఫరా చేస్తుంటే ఇక్కడ ఏమి జరుగుతుందో అర్థం కావ డం లేదని మండిపడ్డారు. వెంటనే సంబంధిత సీడీపీఓలు సోమశేఖర్, కృష్ణమ్మలను ఇద్దరినీ సస్పెండ్ చేయాలని బెంగళూరు ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా కబురు పంపారు. అలాగే జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డెరైక్టర్ కలాదగికి నోటీసులు జారీ చేయాలని సక్రమంగా జవాబు ఇవ్వకపోతే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఎస్పీ సర్కిల్లోని బాలికల రిమాండ్ హోంను సందర్శించి అక్కడ బాలికలతో వివరాలు సేకరించారు. సౌకర్యాలు సక్రమంగా అందిస్తున్నారా? లేదా? అని అడిగి తెలుసుకుని, బాగా చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని రావాలని, పెళ్లి ఈడు వచ్చిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలని సూచించారు. -
సిలికాన్ సిటీ.. సిగ్గు సిగ్గు
అత్యాచారాల్లో మూడో స్థానం 2013లో మొత్తం 80 అత్యాచారాలు.. అందులో 46 మైనర్ బాలికలపైనే సభలో నోరు మెదపని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి బాధితులను కనీసం పరామర్శించని రాష్ట్ర మహిళా కమిషన్ సాక్షి, బెంగళూరు : నగరంలో రోజురోజుకూ అత్యాచారాల సంఖ్య పెరుగుతోంది. మృగాళ్ల వికృత చేష్టలకు అభం శుభం ఎరుగని చిన్నారులు బలవుతున్నారు. దేశంలో 53 నగరాల్లో జరిగిన అత్యాచార గణాంకాలను జాతీయ నేర నమోదు సంస్థ (ఎన్సీఆర్బీ) సేకరించింది. అందులో బెంగళూరు మూడో స్థానంలో ఉంది. 2013లో బెంగళూరులో మొత్తం 80 అత్యాచారాలు నమోదు కాగ అందులో 46 (57 శాతం) మైనర్ బాలికల పై జరిగినవే. అంటే అత్యాచార బాధితుల్లో అభం శుభం తెలియని చిన్నారులే ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. రాష్ర్టంలో రోజుకొక అత్యాచారం జరుగుతున్నా.. మహి ళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉమాశ్రీ మాత్రం మూడు రోజులుగా ఈ విషయంపై నోరు కూడా మెదపడం లేదు. శుక్రవారం కూడా శాసనసభలో కనీసం తన విచారాన్ని కూడా వ్యక్తం చేయలేదు. ఇక రాష్ట్ర మహిళా కమిషన్ కూడా బాధితులను పరామర్శించలేదు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల పట్ల మన మంత్రులు, అధికారులకు ఎంత నిబద్ధత ఉందో వీటిని చూస్తే అర్థమౌవుతుంది.