సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ, బీఎస్పీ లతో పాటు ఈసారి శివసేన కూడా తన అభ్యర్థులను నిలబెడుతోంది. ఈ ఎన్నికల్లో 40 స్థానాల నుంచి అభ్యర్థులను నిలబెట్టాలని ఆ పార్టీ నేత ఉద్ధవ్‌థాక్రే నిర్ణయించారు. పార్టీ నిర్ణయం మేరకు శివసేనకు చెందిన శివ్ కాశీ తివారీ సోమవారం న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నియోజకవర్గం నుంచి ఆప్ తరఫున ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్, కాంగ్రెస్ తరఫున కిరణ్ వాలియా పోటీచేయనున్న సంగతి తెలిసిందే.
బీజేపీ అభ్యర్థి ఎవరన్నది త్వరలో తేలనుంది. కాగా, నామినేషన్ దాఖలు చేయడం కోసం కాశీ తివారీ ఒంటెపై ఊరేగింపుగా వెళ్లడం పలువురి దృష్టిని ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా, ఈసారి రాష్ట్రంలో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకుంటున్న బీజేపీకి శివసేన పోటీతో కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. శివసేన, బీజేపీ కలిసి మహారాష్ట్రలో కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. కాగా, శివసేన అభ్యర్థులు బీజేపీ ఓట్లకు కొంతమేర గండి కొట్టే అవకాశం లేకపోలేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే బీజేపీకి జరిగే నష్టం గురించి తాము ఆలోచించేపరిస్థితి లేదని శివసేన నాయకులు స్పష్టం చేస్తున్నారు.
ఎన్నికల బరిలో శివసేన
Published Sat, Jan 17 2015 10:26 PM | Last Updated on Fri, Oct 19 2018 8:23 PM
Advertisement
Advertisement