డ్యామిట్... కథ అడ్డం తిరిగింది..! జైతాపూర్ అణుప్రాజెక్టు ఏర్పాటు విషయంలో శివసేన బహుశా ఇలాగే అనుకొని ఉంటుంది. ఎందుకంటే జైతాపూర్ ప్రాజెక్టును అడ్డుకోవడం ద్వారా రాజకీయ లబ్ధిని పొందాలని శివసేన భావించింది. అందుకు మాడ్‌బన్ జనహిత్ సేవా సమితి అండ చూసుకొని రెచ్చిపోయింది.
సాక్షి, ముంబై: డ్యామిట్... కథ అడ్డం తిరిగింది..! జైతాపూర్ అణుప్రాజెక్టు ఏర్పాటు విషయంలో శివసేన బహుశా ఇలాగే అనుకొని ఉంటుంది. ఎందుకంటే జైతాపూర్ ప్రాజెక్టును అడ్డుకోవడం ద్వారా రాజకీయ లబ్ధిని పొందాలని శివసేన భావించింది. అందుకు మాడ్‌బన్ జనహిత్ సేవా సమితి అండ చూసుకొని రెచ్చిపోయింది. అయితే ఇప్పుడు ఆ మాడ్‌బన్ జనహిత్ సేవా సమితి ప్రతినిధులే జైతాపూర్ ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తామంటూ హామీ లేఖలు కూడా సమర్పించడంతో శివసేన వ్యూహం బెడిసికొట్టింది. ఈ విషయంలో మొత్తానికి సేనకు భంగపాటు తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఫలించిన కీర్ చర్చలు..
జైతాపూర్ అణుప్రాజెక్టును ఏర్పాటు చేయడం ద్వారా అనేక నష్టాలు సంభవిస్తాయని ఆరోపిస్తూ మొదటి నుంచి మాడ్‌బన్ జనహిత్ సేవా సమితి ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకుంటూనే ఉంది. ఇందుకోసం అనేక ఆందోళనలు కూడా నిర్వహించింది. దీంతో ప్రభుత్వం కొంత వెనక్కు తగ్గి ప్రాజెక్టు నిర్మాణాన్ని వాయిదావేసింది. అయితే సమితి సభ్యులను ఒప్పించే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమేశ్ కీర్‌కు అప్పగించింది. ఈ విషయమై ఆయన దాదాపు రెండు నెలలుగా సమితి ప్రతినిధులతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. వారి ఆందోళనలు, భయాల గురించి ఎప్పటికప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తూ వారి నుంచి వచ్చిన హామీలను ఇటు సమితి ప్రతినిధులకు తెలుపుతూ చర్చలు జరిపారు. దీంతో దిగివచ్చిన మాడ్‌బన్ జనహిత్ సేవా సమితి అధ్యక్షుడు ప్రవీణ్ గవాన్కర్ ఇతర ప్రతినిధులు డాక్టర్ మిలింద్ దేశాయ్, శర్పుద్ధీన్ కాజీ, రమేశ్ కాజ్వే, శ్రీకృష్ణ మయేకర్, మందా వాడేకర్, సంతోష్ వాఘ్‌ధరే తదితరులు ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు కీర్‌కు లేఖలు కూడా రాసిచ్చారు. ఈ పత్రాల్లో.. ‘ప్రభుత్వం తమ సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాం, ఎవరికీ నష్టం కలగకుండా అందరికీ న్యాయం చేస్తూ ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని, అందుకు తాము ప్రభుత్వానికి సహకరిస్తామ’ని పేర్కొన్నారు. అంతేగాక వచ్చే గురువారం పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ రాణేతో భేటీ అయి చర్చిస్తామన్నారు.
బెడిసికొట్టిన సాల్వీ వ్యూహం..
స్థానికంగా బలంగా ఉన్న మాడ్‌బన్ జనహిత్ సేవా సమితి ప్రాజెక్టును వ్యతిరేకిస్తోందన్న విషయాన్ని గమనించిన శివసేన పరిస్థితులను రాజకీయ లబ్ధిపొందేలా మార్చుకోవాలని భావించింది. సమితి అండను చూసుకొని శివసేన ఎమ్మెల్యే రాజన్ సాల్వీ రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టును కార్యరూపం దాల్చకుండా అడ్డుకుంటామని సాల్వీ హెచ్చరించారు. అప్పట్లో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే కూడా ఆ ప్రాంతాన్ని పర్యటించి, అక్కడి ప్రజలతో సంప్రదించి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అయితే ఈ విషయంలో శివసేన అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటిగా తయారైంది. ఏ సమితి అండచూసుకొని శివసేన రెచ్చిపోయిందో ఇప్పుడు ఆ సమితే ప్రాజక్టు నిర్మాణానికి సహకరిస్తామని చెబుతుండడంతో చేతులు కాల్చుకున్నట్లయింది. సమితి అండ లేకుండా జైతాపూర్ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం అసాధ్యమని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. జైతాపూర్ విషయంలో సేన కూడా మొత్తానికి వెనక్కు తగ్గినట్లేనని రాజకీయ పండితులు చెబుతున్నారు.