షాపింగ్ మాల్‌లోకి మెట్రో రైలు కనెక్టింగ్ బ్రిడ్జి
సాక్షి, బెంగళూరు : బెంగళూరులోని మల్లేశ్వరంలో ఉన్న మంత్రి షాపింగ్ మాల్‌లోకి దేశంలోనే తొలిసారిగా మెట్రో రైలు కనెక్టింగ్ బ్రిడ్జ్ ఏర్పాటైంది. సంపిగె రోడ్డులోని మెట్రో స్టేషన్‌లో దిగగానే నేరుగా మంత్రి షాపింగ్‌మాల్‌లోకి ప్రవేశించే విధంగా బ్రిడ్జ్‌ను నిర్మించారు. ఈ కనెక్టింగ్ బ్రిడ్జ్‌ని మంత్రి డెవలపర్స్ మేనేజింగ్ డెరైక్టర్ సుశీల్ మంత్రి, బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) మేయర్ కట్టె సత్యనారాయణ, బీఎంఆర్‌సీఎల్ ఎం.డి ప్రదీప్ సింగ్ కరోలా బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రదీప్ సింగ్ కరోలా మాట్లాడుతూ... పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్(పీపీపీ) విధానంలో ఈ కనెక్టింగ్ బ్రిడ్జ్‌ని నిర్మించినట్లు చెప్పారు. బీఎంఆర్‌సీఎల్ యంత్రాంగం కనెక్టింగ్ బ్రిడ్జ్ డిజైనింగ్‌ని రూపొందించగా, మంత్రి డెవలపర్స్ యాజమాన్యం ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి అవసరమైన నిధులను సమకూర్చిందన్నారు. మెట్రో రైలు రెండో దశలో సైతం ఈ తరహా ప్రాజెక్టులను రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. అనంతరం సుశీల్ మంత్రి మాట్లాడుతూ... మోడ్రన్ బెంగళూరును నిర్మించడంలో ఇది ముందడుగని అన్నారు.