ఏం బాగాలేదప్పా! | siddaramaiah dissident on home department advisor | Sakshi
Sakshi News home page

ఏం బాగాలేదప్పా!

Published Mon, Jul 17 2017 4:01 PM | Last Updated on Tue, Sep 5 2017 4:15 PM

ఏం బాగాలేదప్పా!

ఏం బాగాలేదప్పా!

► మంగళూరు అల్లర్లు, జైలు గొడవలు..
► ముందే ఎందుకు గుర్తించలేదు 
► హోంశాఖ సలహాదారు, నిఘా చీఫ్‌లపై సీఎం తీవ్ర అసంతృప్తి! 
 
రాష్ట్రంలో చీమ చిటుక్కుమన్నా ముఖ్యమంత్రికి చేరవేయాల్సిన నిఘా, హోంశాఖ వ్యవహారాలను చక్కబెట్టాల్సిన సలహాదారు... ఇద్దరి మీద సీఎం ఒంటికాలిమీద లేచినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కొద్దిరోజులుగా పతాక శీర్షికలకెక్కుతున్న పరిణామాలపై ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ముందస్తు చర్యలు ఏమయ్యాయయని సిద్ధు వారిని ప్రశ్నించారు. 
 
సాక్షి, బెంగళూరు/ మైసూరు: రాష్ట్ర హోంశాఖ సలహాదారు కెంపయ్యతో పాటు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఎం.ఎన్‌ రెడ్డిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్నటికిమొన్న మంగళూరు అల్లర్లు, అవి సద్దుమణిగేటప్పటికి పోలీసుశాఖలో ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య గొడవలతో హోంశాఖ పరువు పోయిందని హోంశాఖను కూడా పర్యవేక్షిస్తున్న సీఎం సిద్ధరామయ్య ఘాటు వాఖ్యలు చేసినట్లు సమాచారం. బెంగళూరులో ఆయన వారిద్దరితో ఆదివారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త హత్యతో మంగళూరులో ప్రారంభమైన గొడవలు తీవ్రరూపం దాల్చడంతో కొన్నిరోజుల పాటు అల్లర్లు జరగడం ఏమాత్రం బాగాలేదని, ఘర్షణలను నివారించడానికి సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇదంతా జరిగిందంటూ కెంపయ్య, నిఘా డీజీపీ ఎం.ఎన్‌.రెడ్డిలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఘర్షణలను ముందుగా పసిగట్టడంలో ఎందుకు విఫలమయ్యారని వారిద్దరినీ నిలదీసినట్లు సమాచారం. అదేవిధంగా జైళ్లశాఖ డీజీపీ సత్యనారాయణ, డీఐజీ డీ.రూపల మధ్య సాగుతున్న వివాదాన్ని పరిష్కరించడంలో కూడా విఫలమయ్యారంటూ ఆగ్రహించారు.

హద్దులు మీరి ప్రవర్తిస్తున్న ఇద్దరు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులపై ఎటువంటి చర్యలో తీసుకోవచ్చో సమాచారాన్ని వీలైనంత త్వరగా తమకు అందించాలంటూ కెంపయ్య, డీజీపీ ఎం.ఎన్‌.రెడ్డిలను ఆదేశించారు. బదిలీలు, పదోన్నతులపై చూపించే శ్రద్ధ పోలీసుశాఖలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలు, వివాదాలను గుర్తించడంపైనా పెట్టాలని ఇద్దరినీ ఘాటుగా హెచ్చరించినట్లు సమాచారం. ఇద్దరు అధికారులూ స్పందిస్తూ, ఇకపై ఇటువంటి పొరపాట్లు జరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటామంటూ సిద్ధరామయ్యకు హామీ ఇచ్చినట్లు సమాచారం.
 
అవినీతి అధికారులపై చర్యలే: సీఎం 
సిద్ధరామయ్య మైసూరులో మీడియాతో మాట్లాడుతూ... ఆర్థిక నేరాలకు పాల్పడి బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలులో శిక్షననుభవిస్తున్న శశికళకు అతిథి మర్యాదలు కల్పిస్తున్నారంటూ జైళ్లశాఖ డీజీపీ సత్యనారాయణరావు మీద డీఐజీ డీ.రూప మాటల యుద్ధానికి దిగడంపై సిద్ధరామయ్య తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో అవినీతికి పాల్పడే అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. జైళ్లల్లో ఖైదీలకు అతిథి మర్యాదలు చేయడానికి సీనియర్‌ అధికారి లంచం తీసుకున్నట్లు వస్తున్న ఆరోపణలపై విచారణకు ఆదేశించామన్నారు. అవినీతికి పాల్పడే అధికారులను ఉపేక్షించే ప్రసక్తే లేదని, చర్యలు తప్పవని తెలిపారు. ఆషాఢమాసం కాబట్టి కేబినెట్‌ విస్తరణను చేపట్టలేదంటూ వస్తున్న విమర్శలను సీఎం సిద్ధరామయ్య ఖండించారు. కేబినెట్‌ విస్తరణకు– ఆషాఢమాసానికి సంబంధం లేదని, పార్టీ హైమాండ్‌తో చర్చించిన అనంతరం కేబినెట్‌ విస్తరణ చేపట్టనున్నట్లు తెలిపారు.
 
ఆ ఖైదీలు బళ్లారికి షిఫ్ట్‌
పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న రామమూర్తి, శ్రీనివాస్, శివశంకర్‌ అనే ఖైదీలను బళ్లారికి బదిలీ చేశారు. వీరు ముగ్గురు డీఐజీ రూపకు జైలులోపల జరుగుతున్న విషయాలన్నీ చేరవేసేవారని తెలుస్తోంది. ఇందులో రామమూర్తిని జైలు ఉన్నతాధికారి ఒకరు కొట్టడం తెలిసిందే. అందువల్లే వీరిని బళ్లారి జైలుకు తరలించినట్లు సమాచారం. 
 
సాధారణ ఖైదీలా శశికళ 
ఇదిలా ఉండగా రెండు రోజుల ముందు వరకూ జైలులోపల సకల సౌకర్యాలు అనుభవిస్తున్న శశికళ శనివారం నుంచి సాధారణ ఖైదీ మాదిరిగానే ఉంటున్నట్లు సమాచారం. శిక్షపడిన ఖైదీల మాదిరిగానే యూనిఫామ్‌ ధరిస్తున్నారు. సాధారణ కిచెన్‌లో తయారైన ఆహారాన్నే అందిస్తున్నారు. 
 
పరప్పన జైల్లో రభస?
శశికళకు సహాయకులుగా ఉన్న ఇద్దరు మహిళా ఖైదీలు శనివారం జైలు పరిశీలనకు వెళ్లిన సమయంలో డీఐజీ రూపకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దాడికి యత్నించినట్లు తెలిసింది. ఈ సందర్భంగానే ఖైదీలు రెండు గ్రూపులుగా విడిపోయి కొంతమంది డీజీ సత్యనారాయణకు అనుకూలంగా, మరికొంతమంది డీఐజీ రూపాకు అనుకూలంగా నినాదాలు చేయడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే బయటి నుంచి పోలీసులు అదనపు సిబ్బందిని పిలిపించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement